‘‘నా చిన్నప్పుడు చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర ఇవన్నీ చదివేవాణ్ణి. వాటితో పాటు పెద్దవాళ్లు చదువుకునే డిటెక్టివ్ బుక్స్ కంటే ఒకింత చిన్న సైజులో ఉండే బుజ్జి బుజ్జి జానపద నవలలూ చదివేవాణ్ణి’’ డిగ్రీ చదువుతున్న పక్కింటి పిల్లాడికి తన చిన్నప్పటి అనుభవాలు చెబుతున్నాడు వెంకట్రావ్.
‘‘చాలా మంది అంతేసార్. మీ చిన్నప్పుడు మీరు అవి చదివారు. మా రోజుల్లో అవి లేవు కాబట్టి మేం బాహుబలి లాంటి సినిమాలు చూస్తున్నాం’’ మాట కలిపాడు శివ.
‘‘ఆ పుస్తకాలు చదువుతూనే మేము కూడా జానపద సినిమాలు తెగ చూసేవాళ్లం. ఎడ్లబండ్ల మీద, సైకిళ్ల మీద పక్కనుండే టౌనుకెళ్లి బోలెడన్ని సినిమాలు చూశాం’’ అన్నాడు వెంకట్రావ్.
‘‘మీ చిన్నప్పటి సినిమాలు ఈ మధ్య నేనూ కొన్ని చూశాను సార్. కానీ ప్రతి సినిమాలోనూ దాదాపుగా కథ ఒకేలా ఉంటుంది. దుష్టుడైన ఒక రాజు తన ప్రజలను విపరీతంగా బాధపెడుతూ పాలిస్తుంటాడు. ప్రజాకంటకుడైన ఆ రాజుకు ఒక బావమరిది కూడా ఉంటాడు. రాజుగారి బావమరిదిననే అహంకారంతో వాడు కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తిస్తుంటాడు. ఎవరడ్డొస్తే వాళ్లను ఎడాపెడా కొడుతుండటం, అందమైన అమ్మాయి ఎవరైనా ఎదురుపడితే అసభ్యంగా ప్రవర్తించడం, కొండొకచో రేప్ చేయడం, ఇలా రాజుగారి బావమరిది ఆగడాలు తట్టుకోలేక, వాణ్ణేమీ చేయలేక ప్రజలంతా అతడిని చాటుగా తిట్టుకుంటూ ఉండటం... ఇంతేకదా అన్ని జానపద సినిమాల్లోని కథ’’అంటూ కాస్తంత నిరసనగా అన్నాడు శివ.
‘‘మేం కాస్తంత పెద్దయ్యాక సినిమాలతో పాటు సాహిత్యం చదవడమూ మొదలుపెట్టాం. దాదాపు అన్ని జానపద సినిమాలకు ఆధారమైన నాటకం ఒకటుంది. దానిపేరే మచ్ఛకటికం. ఆ అద్భుతమైన నాటకంలోనూ రాజుగారికి ఒక బావమరిది ఉంటాడు. వాడి పేరు శకారుడు. వాడూ అంతే. బహుశా రాజుగారి బావమరుదులంతా ఇంతేనేమో. శకారుడు కూడా తన బండికి మెట్లు అడ్డం వస్తే వాటినీ తొక్కేయమంటూ ఆర్డరేస్తాడు’’
‘‘సార్.. మనమేదో జానపద కథలూ, సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే.. ఆ సంభాషణంతా రాష్ట్ర పరిస్థితిలా అనిపిస్తుందేమిటి సార్! ఓ దుష్టుడైన రాజు!, అడ్డొచ్చిన ప్రతివాణ్ణీ తిడుతూ, కొడుతూ, ఎవరి మీద పడితే వారి మీద చేయిజేసుకుంటూ ఉండే ఓ రాజుగారి బావమరిదీ!! కాకపోతే ఈ బావమరిది ‘అమ్మాయి కనబడితే ముద్దు అయినా పెట్టాలి, కడుపైనా చేయాలి’ లాంటి గలీజు మాటలు మాట్లాడుతుంటాడు సార్’’
‘‘అవునోయ్... నువ్వు చెబుతుంటే నాకూ అదే అనిపిస్తోంది. అయితే ఇంత చీకట్లోను నాకో ఆశారేఖ కనిపిస్తోందోయ్’’
‘‘ఏమిటి సార్ అది?’’ అడిగాడు శివ.
‘‘జానపదకథలో ఒక తోటరాముడు దేశాటనం చేస్తూ బయల్దేరతాడు. అక్కడ అతడు దేశాటనం చేసినట్టే.. వాస్తవ ప్రపంచంలోని ఈ రాష్ట్రంలో ఈ యువకుడు పాదయాత్ర చేశాడు. జనాదరణ, ప్రజామోదం ఉన్న ఈ యువనేత వచ్చి దుష్టుడైన రాజు పనీ, విలనీకామెడీ ప్రదర్శించే రాజుగారి బావమరిది పనీపట్టి, ప్రజలను ఆ దుష్టుల పరిపాలన నుంచి విముక్తులను చేస్తాడు’’
‘‘నిజమే సార్. ఈ సీన్ కూడా కూడా అచ్చం జానపద కథతో పోలుతోంది కదా. అలాగే కానివ్వండి కానివ్వండి. రాజూ, అతడి బావమరిదితో పాటు, చాలా దౌర్జన్యంగా ప్రవర్తిస్తూ, బ్రాహ్మణులు మొదలుకుని బడుగువర్గాల వారి వరకూ అందరినీ దూషిస్తూ, వేధిస్తూ, బాధిస్తూ ఉండే ఇతర రాజోద్యోగుల పీడవిరగడ కావాలనే కదా రాష్ట్రప్రజలందరూ కోరుకుంటున్నారు’’
‘‘ప్రతి కథలోనూ అంతో ఇంతో చరిత్ర ఉంటుందట. దీన్ని బట్టి చూస్తే హిస్టరీ రిపీట్స్ అనే మాట అక్షరాలా వాస్తవం అనిపిస్తోంది. కానీయ్.. కానీయ్. అలాగే కానీయ్. మనమనుకున్నట్టే జరగనీ. తథాస్తు’’
– యాసీన్
Comments
Please login to add a commentAdd a comment