Naya scene
-
పొలిటికల్ మంటపై ఎన్నికల వంట!
‘‘ఎలక్షన్లకూ, వంటలకూ బాగా దగ్గరి సంబంధం ఉందని నా అభిప్రాయం రా’’ అన్నాడు మా రాంబాబుగాడు. ‘‘నువ్వెప్పుడూ ఇంతేరా. నువ్వనేదాన్లో ఏమైనా లాజిక్ ఉందా? అసలు ఎన్నికలకూ, వంట వండటానికీ ఎలా ముడిపెట్టగలుగుతున్నావ్’’ అంటూ కోప్పడ్డాను నేను. ‘‘విను.. ఉదాహరణకు మన చంద్రబాబు ఉన్నాడనుకుందాం. ‘మీకు పోలవరం బిర్యానీ పెడతా.. రాజధాని బగారాబైగన్ రెసిపీ చేస్తా’ అంటూ తెగ ఊరిస్తూ ఉంటాడు. కానీ ఐదేళ్ల పాటు ఏమీ చేయడు. ఉన్న టైమ్‌లో ఏమీ చేయలేక ‘నేను విదేశాలన్నీ తిరిగి రకరకాల కాంటినెంటల్ ఐటమ్స్‌తో, మీకు ఇంటర్నేషనల్ క్యూజిన్ వడ్డిద్దామనుకున్నాను. కానీ కేంద్రంలో మోదీ, పక్కరాష్ట్రంలో కేసీఆర్ అడ్డుపడటం వల్ల ఏమీ చేయలేకపోయాను. ఈసారికి ఇవే తినండి’ అంటూ పాత మేనిఫెస్టో మెనూలో మిగిలిపోయిన అన్నంలో ఏ తాలింపో, పోపో వేసేసి పోపన్నం చేస్తాడు. అలా పొద్దున్నే పాచి ఐటమ్స్‌తోనే మేకోవర్ తిరగమోతతో మేనేజ్ చేస్తూ మోత మోగించేస్తుంటాడు. ఆ పాచిబువ్వ పులిహోర కలిపేస్తున్నప్పుడు వచ్చే పోపు వాసనను పట్టుకొని, ఎల్లో మీడియా అంతా ‘వాహ్.. వాటే వాసన... ఇట్స్ గోయింగ్ టు బీ డెలీషియస్ డిషెస్’ అంటూ హడావుడి చేస్తూ ఊదరగొట్టేస్తుంది. ‘‘కరక్టేరా.. నువ్వంటుంటే నిజమే అనిపిస్తోంది’’ అన్నాను. ‘‘అప్పుడే అయిపోయిందా.. విను. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ల వంటలన్నీ మాటల రెసిపీల లాంటివే. ఉదాహరణకు చంద్రబాబు తెలంగాణలో పోటీ చేయాలనుకున్నప్పుడు ‘నేను తెలంగాణ కోసం లేఖ ఇచ్చా. తెలంగాణకు నేను వ్యతిరేకం కాదు’ అంటూ ‘రెండు డిష్’ల సిద్ధాంతం చెబుతాడు. అలాగే ఈ చంద్రబాబు కనుసన్నల్లో, అడుగుజాడల్లో నడుస్తున్న పవన్‌కళ్యాణ్ కూడా ఆయన దారిలోనే మరింత ముందుకెళ్లి.. ఆంధ్రలో మాట్లాడేటప్పుడు ‘తెలంగాణలో ఆంధ్రవాళ్లను కొడుతున్నారటాడు. మళ్లీ కాసేపటికి తెలంగాణకు వచ్చి.. ‘నేను తెలంగాణలో పుట్టకపోవడం నా దురదృష్టం. నేనిక్కడే పుట్టి ఉద్యమంలో ఉండి ఉంటే.. దుర్మార్గులైన ఆ యొక్క ఆంధ్రనాయకులను అల్లల్లాడించి, వాళ్లను అష్టకష్టాలు పెట్టేవాణ్ణి. మిమ్మల్ని కష్టాలే లేకుండా కళ్లలో పెట్టుకునేవాణ్ణి’ అని వాపోతాడు. ఇదెలాంటిదంటే.. పెనం మీద పిండి పరచి దోసె వేశాక.. అవతలివైపు కూడా బాగా కాలడానికి దోసె తిరగేయడం లాంటిదన్నమాట. ఇలా దోసెల్లాగా, చపాతీల్లాగా రెండువైపులా మాటిమాటికీ తిరగేస్తున్నట్టుంటాయి వీళ్ల పొలిటికల్ ప్రసంగాలు. వీళ్లలోనే మరికొందరుంటారు. వారు పొత్తులనే పేరుతో నలుగురైదుగురు కలిసి వంట చేస్తుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అయితే పొత్తులేదంటూనే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, పాల్ లాంటివాళ్లు కలిసి.. అన్నం లాంటి ఒకే ఐటమ్‌ను ఒకరు బగారరైస్ అనీ, మరొకరు బిర్యానీ అనీ, ఇంకొకరు ఫ్రైడ్ రైస్ అని వండుతున్నారు. ‘టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్’ అనే సామెత తెలుసుకదా. అయితే వీరందరూ కలిసి పక్కవాళ్ల వంటను చెడగొట్టేందుకు ప్రయత్నిస్తుంటారు’’ చెప్పాడు రాంబాబుగాడు. ‘‘మరి వీళ్లలో ఎవరైనా సిన్సియర్‌గా కడుపు నింపేవారు ఉన్నారంటావా?’’ నేనడిగా. ‘‘ఉన్నారు. ఆయన షో చేయడు. అప్పటికప్పుడు ఏదో వండేస్తున్నట్టు నటించడు. చాలా ముందు నుంచే పొయ్యిసెగలాంటి ఎండలో మాడుతూ, నడుస్తూ అందర్నీ కలుస్తాడు. మర్నాటి ఇడ్లీ కోసం ముందు రోజు నుంచే పిండి కలుపుకొన్నట్టు ఎప్పట్నుంచో శ్రమ పడతారు. ఆ ఇడ్లీలోకి కొబ్బరిపచ్చడీ, అల్లంచెట్నీ, సాంబారు.. ఇలాంటివెన్నో టిఫిన్‌గా పెడతామంటాడు. వాటికి అవసరమైన సరుకుల కోసం ముందు నుంచే పాదాల మీద శ్రమతో నడుస్తూ.. చాలా చోట్ల తిరుగుతూ, అన్ని రకాల సంభారాలూ సేకరిస్తారు. నవరత్నాల్లాంటి పిండి వంటలు చేస్తాననీ, ఆ వంటకయ్యే దినుసులూ చూపిస్తారు. మధ్యాహ్న భోజనం కోసం, రాత్రి ఫుడ్ కోసం తానేమి వండిపెట్టదలచుకున్నాడో అవే తప్పకుండా వండుతాడు. అలాంటి యువనేతలాంటి చెఫ్‌ను నమ్ముకుంటేనే ముప్పూటలా కడుపునిండుతుంది. షడ్రసోపేతమైన విందు దొరుకుతుంది’’ అంటూ ముగించాడు మా రాంబాబుగాడు. -
గోడ మీది పిల్లిలో ఎంత మార్పో..?
ఎన్నికల సీజన్లో ఓ పిల్లి ఓ న్యూస్‌పేపర్‌కు పే...ద్ద ఇంటర్వ్యూ ఇచ్చింది. తనను తాను సమర్థించుకుంటూ చాలా విషయాలు చెప్పింది. ఆ వివరాలు కాస్త చూద్దాం. నాలో ఎంతో మార్పు.. ప్రశ్న : మీ కొన్ని పాలసీలకు జనం నుంచి వ్యతిరేకత వచ్చింది కదా. ఈ విషయంలో మీరు చెప్పదలచుకున్నది.. జవాబు : ఆ రోజుల్లో.. అంటే 1995–2004లో నా వ్యవహారశైలి వేరుగా ఉండేది. అప్పట్లో నేను కాస్త దూకుడుగా ఉండేదాన్ని. చాలా ఎలుకలను పట్టా. నేను అలా ఎలుకలను పట్టడానికి కారణం అవి నా ఆహారమని కాదు. వాటిని తినాలనే ఆశ నాకు లేదు. రైతులనే అమాయకపు ఓటర్లు ఆరుగాలం కష్టపడి పంట పండిస్తారు. ఆ ఫలసాయాన్ని ఎలుకలు తినేస్తాయేమోననే ఆందోళనతో కేవలం రైతుల కష్టం తీర్చడానికే నేను వాటిని పట్టి చంపాను. అంతే తప్ప నేను తినడానికి ఎంతమాత్రమూ కాదు. అయినా ఇప్పుడు మీకో విషయం తెలుసా? నేనిప్పుడు ‘రుద్రాక్ష పిల్లి’ని. నాన్‌వెజ్ పూర్తిగా మానేశా. భూతదయతో ఇప్పుడు నేనే కొన్ని ఎలుకలను చేరదీసి పెంచుతున్నా. అవిప్పుడు పందికొక్కుల్లా ఎదిగాయి. అందుకే సీబీఐ, ఈడీ బ్రాండుల ఎలుకల మందు వద్దని చెబుతున్నా. అయినా మందు పెడుతున్నారు. కొన్ని చోట్ల పెడితే కొన్ని పందికొక్కులు దొరుకుతున్నాయి. నాలో ఎంతగా మార్పు వచ్చిందో తెలుసా? ‘పిల్లి గుడ్డిదైతే.. ఎలుక కన్నుకొట్టింద’నే సామెతను నిజం చేస్తూ పందికొక్కులకు స్థాయికి చేరిన నేను పెంచిన ఎలుకలే కొన్ని నాకు అప్పుడప్పుడూ కన్ను కొడుతున్నాయి. అయినా సరే.. ఇక నాలో ఎంతో మార్పు వచ్చి ఇప్పుడు రుద్రాక్ష పిల్లిని అయ్యాను కదా. అందుకే కన్నుకొట్టే పందికొక్కులనూ మందలించకుండా కీలకమైన స్థానాల్లో నిలబెట్టి మరీ ప్రోత్సహిస్తున్నా. చూడండి.. ఇది నాలో వచ్చిన మార్పునకు సంకేతం కాదా? నేనెప్పుడూ అబద్ధం ఆడలేదు ప్రశ్న : హోదా విషయంలో మీరు అబద్ధాలు ఆడారు కదా? జవాబు : నేనెప్పుడూ అబద్ధాలు ఆడలేదు. నేను పిల్లిని కాబట్టి గోడ మీద ఉండటం నా నైజం. ఒకసారి గోడ మీద నేను నిలబడి ఉన్నప్పుడు ‘ఏది రైట్?’ అని ఒకరు నన్ను అడిగారు. అప్పుడు నా కుడికాళ్లు ఉన్న వైపునకు చూపిస్తూ.. ‘ఇది రైట్.. ఇదే రైట్’ అన్నా. ఆ తర్వాత గోడమీద వెనక్కు తిరిగా.. అప్పుడు కొంత మంది మళ్లీ ‘ఏది రైట్’ అని ప్రశ్నించారు. అప్పుడు మళ్లీ నా కుడి వైపున ఉన్న భాగాన్నే ‘ఇది రైట్’ అని చూపించా. నేనెప్పుడూ నా ‘రైట్ సైడ్’నే చూపించా. కానీ గోడ మీద నేనలా తిరగడం చూసి.. కొందరది ‘యూ–టర్న్’ అంటూ ప్రచారం చేస్తున్నారు. నేనెప్పుడూ రైట్ను రైట్ అనే చెప్పా. అబద్ధాలు ఆడటం మా ఇంటావంటా లేదు. జనం పిల్లి ఇచ్చిన ఇంటర్వ్యూ చదవనైతే చదివారు. కానీ కాస్త ఆలోచించారు. అంతకు ముందు కూడా పిల్లి ఓసారి తనలో చాలా మార్పు వచ్చిందనీ.. గతంలో రైతులను నిర్లక్ష్యం చేసి, ఐటీ ఐటీ అన్నానని ఒప్పుకుంది. ఈసారి అలా చేయనంది. కానీ మళ్లీ దానికి తిండిపెట్టాక.. మునపటి దారిలోనే వెళ్లడం మొదలుపెట్టింది. ‘డ్యాష్బోర్డని ఒకటి ఏర్పాటు చేసుకుని, దాని మీద.. లేని అభివృద్ధిని చూస్తూ ఉండిపోయింది. కాబట్టి పిల్లికి సంబంధించి దాన్ని పెంచుతున్న వారు ఓ నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే.. దానికి సంబంధించిన రెండు సామెతలను నిజం చేస్తూ.. అభివృద్ధి అనే పెళ్లికి వెళ్తూ.. పిల్లిని చంకన ఎత్తుకోవడం ఎందుకని.. ఈసారి పిల్లికి ఓటు బిచ్చం పెట్టలేదు. -
నువ్వు నాకు నచ్చలేదు !
మా రాంబాబుగాడు ఓ సినిమా కథ చెప్పడం మొదలుపెట్టాడు... ‘‘ఎక్కడికి వెళ్లి వస్తున్నావ్? ఎవరికి ఏం చెప్పి వస్తున్నావ్?’’ ప్రశ్నించారు పబ్లిక్. ‘‘హోదా అనేది చాలా బెస్ట్ అనీ, దానికోసమే మనం రక్తం ధారపోసైనా పోరాడాలని చెప్పి వస్తున్నా అంకుల్’’ అతి వినయం నటిస్తూ పబ్లిక్‌కి ఆన్సరిచ్చారు బాబుగారు. ‘‘ఆ?’’ ‘‘అంటే.. ముందు హోదా అనే అనుకున్నాను. ఆ తర్వాత ఏవో కొన్ని ఇబ్బందులు రావడంలో.. ఆ పక్కనే ప్యాకేజ్ అనేదాన్ని ఎంచుకున్నా. కాకపోతే పబ్లిక్ తిరగబడ్డారు కాబట్టి మళ్లీ ఎప్పటిలాగే హోదా బెటర్ అని అనుకుంటున్నా సార్’’ ‘‘ఈ ఎక్స్‌ట్రాలే వద్దు. ఇంతకీ నీకు ఏమొచ్చు?’’ అడిగారు పబ్లిక్. ‘‘ఈత సార్.. కాకపోతే ఇండోర్‌లోనే ఈదుదామని తాత్కాలిక సచివాలయం స్విమ్మింగ్‌పూల్ అయ్యేలా కట్టించా’’ జవాబిచ్చారు బాబుగారు. ‘‘ఈ ఎక్స్‌ట్రాలే తగ్గించుకుంటే మంచిది’’ ఈసడింపుగా అన్నారు పబ్లిక్. ‘‘ఇంతకీ ఏం అవుదామనుకుంటున్నావ్?’’ మళ్లీ పబ్లిక్ ప్రశ్న. ‘‘మరోసారి సీఎం.. లేదా మావాణ్ణి ఇక్కడ పెట్టేసి పీఎం’’ . ‘అవాక్కయ్యారు’ పబ్లిక్. ‘‘ఐదేళ్లలో నెరవేర్చగలిగే హామీలు పదిహేనేళ్లయినా పూర్తి కాలేదు. నువ్వు మళ్లీ మరోసారి సీఎం.. లేదా పీఎం?’’ పబ్లిక్ ఈసారి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘‘సార్ మీకేం తెలుసు సార్. మా అబ్బాయి సరిగా చదవలేదు. నేను దొడ్డిదారిన ఎమ్మెల్సీ ఇచ్చి, ఆ తర్వాత మంత్రిని చేసి, వాక్యాలు పలకడం కూడా రాకపోతే గవర్నమెంటు ఖర్చుతో ట్యూషన్ పెట్టించి.. అప్పుడు పనులు చేయడం మొదలు పెట్టేవాణ్ణి. మరి ఇంక పని చేయడానికి టైమేదీ? హామీలు నెరవేర్చడానికి వ్యవధేది? మీకు నాలాంటి కొడుకున్నాడా సార్. ఉంటే తెలిసేది సార్.. వాడికి అన్నీ నేర్పి.. అప్పుడు మళ్లీ పని చేయడం ఎంత కష్టమో’’ అంటూ ముక్కు చీదినట్టు నటించారు బాబుగారు. ‘‘సార్.. మీరు అవుతారు సార్. మళ్లీ తప్పక సీఎం అవుతారు’’ బంతి అలియాస్ ధారాకృష్ణ. ‘‘అవ్వకపోయినా ఫర్లేదు అంకుల్. నాకు కొడుకున్నాడు. మనవడు కూడా ఉన్నాడు. ఈ అందరిలో నా మనవడికి మొదటిసారి.. మా అబ్బాయికి రెండోసారీ అక్షరాభ్యాసం చేసి, ఇద్దరిని ఒకేసారి కాన్వెంట్లో వేసేసి, ఇద్దరికీ నేనే స్వయంగా ట్యూషన్ చెప్పుకుంటాను. కాకపోతే ఈ సారి మావాణ్ణి మరింత జాగ్రత్తగా చదివించుకుంటా’’ తన ఫ్యూచర్ ప్లాన్లు వివరిస్తూ.. తన విశ్రాంతి సమయాన్ని ఎంత అర్థవంతంగా గడపదలుచుకున్నారో విపులీకరించి చెప్పారు బాబుగారు. ’’’ ఇంతవరకు ఒక కథను స్పూఫ్‌లా చెప్పి.. ‘‘ఈ కథకు టైటిల్ ఏమిటో చెప్పు?’’ అడిగాడు మా రాంబాబుగాడు. ‘‘నువ్వు నాకు నచ్చలేదు’’ ఒక్క క్షణం కూడా ఆలస్యం లేకుండా ఠక్కున చెప్పారు పబ్లిక్. –యాసీన్ -
రాజుగారి బావమరుదులంతా ఇంతేనేమో..!
‘‘నా చిన్నప్పుడు చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర ఇవన్నీ చదివేవాణ్ణి. వాటితో పాటు పెద్దవాళ్లు చదువుకునే డిటెక్టివ్ బుక్స్ కంటే ఒకింత చిన్న సైజులో ఉండే బుజ్జి బుజ్జి జానపద నవలలూ చదివేవాణ్ణి’’ డిగ్రీ చదువుతున్న పక్కింటి పిల్లాడికి తన చిన్నప్పటి అనుభవాలు చెబుతున్నాడు వెంకట్రావ్. ‘‘చాలా మంది అంతేసార్. మీ చిన్నప్పుడు మీరు అవి చదివారు. మా రోజుల్లో అవి లేవు కాబట్టి మేం బాహుబలి లాంటి సినిమాలు చూస్తున్నాం’’ మాట కలిపాడు శివ. ‘‘ఆ పుస్తకాలు చదువుతూనే మేము కూడా జానపద సినిమాలు తెగ చూసేవాళ్లం. ఎడ్లబండ్ల మీద, సైకిళ్ల మీద పక్కనుండే టౌనుకెళ్లి బోలెడన్ని సినిమాలు చూశాం’’ అన్నాడు వెంకట్రావ్. ‘‘మీ చిన్నప్పటి సినిమాలు ఈ మధ్య నేనూ కొన్ని చూశాను సార్. కానీ ప్రతి సినిమాలోనూ దాదాపుగా కథ ఒకేలా ఉంటుంది. దుష్టుడైన ఒక రాజు తన ప్రజలను విపరీతంగా బాధపెడుతూ పాలిస్తుంటాడు. ప్రజాకంటకుడైన ఆ రాజుకు ఒక బావమరిది కూడా ఉంటాడు. రాజుగారి బావమరిదిననే అహంకారంతో వాడు కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తిస్తుంటాడు. ఎవరడ్డొస్తే వాళ్లను ఎడాపెడా కొడుతుండటం, అందమైన అమ్మాయి ఎవరైనా ఎదురుపడితే అసభ్యంగా ప్రవర్తించడం, కొండొకచో రేప్ చేయడం, ఇలా రాజుగారి బావమరిది ఆగడాలు తట్టుకోలేక, వాణ్ణేమీ చేయలేక ప్రజలంతా అతడిని చాటుగా తిట్టుకుంటూ ఉండటం... ఇంతేకదా అన్ని జానపద సినిమాల్లోని కథ’’అంటూ కాస్తంత నిరసనగా అన్నాడు శివ. ‘‘మేం కాస్తంత పెద్దయ్యాక సినిమాలతో పాటు సాహిత్యం చదవడమూ మొదలుపెట్టాం. దాదాపు అన్ని జానపద సినిమాలకు ఆధారమైన నాటకం ఒకటుంది. దానిపేరే మచ్ఛకటికం. ఆ అద్భుతమైన నాటకంలోనూ రాజుగారికి ఒక బావమరిది ఉంటాడు. వాడి పేరు శకారుడు. వాడూ అంతే. బహుశా రాజుగారి బావమరుదులంతా ఇంతేనేమో. శకారుడు కూడా తన బండికి మెట్లు అడ్డం వస్తే వాటినీ తొక్కేయమంటూ ఆర్డరేస్తాడు’’ ‘‘సార్.. మనమేదో జానపద కథలూ, సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే.. ఆ సంభాషణంతా రాష్ట్ర పరిస్థితిలా అనిపిస్తుందేమిటి సార్! ఓ దుష్టుడైన రాజు!, అడ్డొచ్చిన ప్రతివాణ్ణీ తిడుతూ, కొడుతూ, ఎవరి మీద పడితే వారి మీద చేయిజేసుకుంటూ ఉండే ఓ రాజుగారి బావమరిదీ!! కాకపోతే ఈ బావమరిది ‘అమ్మాయి కనబడితే ముద్దు అయినా పెట్టాలి, కడుపైనా చేయాలి’ లాంటి గలీజు మాటలు మాట్లాడుతుంటాడు సార్’’ ‘‘అవునోయ్... నువ్వు చెబుతుంటే నాకూ అదే అనిపిస్తోంది. అయితే ఇంత చీకట్లోను నాకో ఆశారేఖ కనిపిస్తోందోయ్’’ ‘‘ఏమిటి సార్ అది?’’ అడిగాడు శివ. ‘‘జానపదకథలో ఒక తోటరాముడు దేశాటనం చేస్తూ బయల్దేరతాడు. అక్కడ అతడు దేశాటనం చేసినట్టే.. వాస్తవ ప్రపంచంలోని ఈ రాష్ట్రంలో ఈ యువకుడు పాదయాత్ర చేశాడు. జనాదరణ, ప్రజామోదం ఉన్న ఈ యువనేత వచ్చి దుష్టుడైన రాజు పనీ, విలనీకామెడీ ప్రదర్శించే రాజుగారి బావమరిది పనీపట్టి, ప్రజలను ఆ దుష్టుల పరిపాలన నుంచి విముక్తులను చేస్తాడు’’ ‘‘నిజమే సార్. ఈ సీన్ కూడా కూడా అచ్చం జానపద కథతో పోలుతోంది కదా. అలాగే కానివ్వండి కానివ్వండి. రాజూ, అతడి బావమరిదితో పాటు, చాలా దౌర్జన్యంగా ప్రవర్తిస్తూ, బ్రాహ్మణులు మొదలుకుని బడుగువర్గాల వారి వరకూ అందరినీ దూషిస్తూ, వేధిస్తూ, బాధిస్తూ ఉండే ఇతర రాజోద్యోగుల పీడవిరగడ కావాలనే కదా రాష్ట్రప్రజలందరూ కోరుకుంటున్నారు’’ ‘‘ప్రతి కథలోనూ అంతో ఇంతో చరిత్ర ఉంటుందట. దీన్ని బట్టి చూస్తే హిస్టరీ రిపీట్స్ అనే మాట అక్షరాలా వాస్తవం అనిపిస్తోంది. కానీయ్.. కానీయ్. అలాగే కానీయ్. మనమనుకున్నట్టే జరగనీ. తథాస్తు’’ – యాసీన్ -
చే గువేరా.. రావాలా?
నయా సీన్: ‘‘అదేంటిసార్... ఇలా చేశారు. పొద్దస్తమానం అటు చేగువేరానూ, ఇటు కొమరం భీమ్‌నూ తలచుకుని, తలచుకుని, కొమరం భీం పేరును కొందరే పేటెంటు చేసుకుని వాళ్ల టెంట్లో ఉంచుకున్నారని కుమిలి కుమిలి, మళ్లీ ఇలా వాళ్ల సిద్ధాంతాలకు పూర్తిగా వ్యతిరేకులైన బాబూ, మోడీలను సమర్థించారేంటిసార్?’’ ‘‘ఒరే బాలూ... నేను మొదట్నుంచీ ఇంతేరా! బాబూ, మోడీల రూటే. కాకపోతే వాళ్లు గడ్డం చేసుకోరూ, నేను చేసుకుంటానంతే తేడా!’’ ‘‘అదేంట్సార్... ఎక్కడైనా పవనం అంటే అది మొదట నైరుతీ నుంచి వీచాలి. ఆ తర్వాత ఈశాన్యం నుంచి వీచాలి. భారత్‌కు వర్షాలనిచ్చే మంచి పవనాలు అవే సార్. అలాంటిది మీరు వాయవ్యం నుంచి గుజరాత్ మీదుగా వీచాలంటున్నారు. మీకో విషయం తెలుసా? భారత్‌లో అలా వీచే పవనాలూ ఉన్నాయి. ఆ వాయవ్యపవనాలను ‘లూ’ అంటారు సార్. అవి వాయవ్య భారతదేశంలో వీస్తూ జనాలకంతా పరమ ఉబ్బరింత కలిగించే భరించలేనంత వేడి వేడి పవనాలు సార్. పోయి పోయి మీరూ జనాల్ని మతం పేరిట వందలాది మందిని ఊచకోత కోసిన భారత వాయవ్య గుజరాతీ పవనాన్నే ఆశ్రయించారు. ఆ పవన ధర్మం, మీ పేరిట ప్రవచించిన పవన ధర్మం ఒకేలా ఉన్నాయేంటి సార్?’’ ‘‘ఒరే బాలూ... నేనేమైనా పవనం ఎలా వీచాలంటూ ఓ పుస్తకం రాశానట్రా? గాలివాటుగా పోవడమే ‘పవన’ ధర్మం. కాబట్టి అలా చెప్పా. పవన ధర్మాలంటూ చెప్పి చిర్రాక్కు కిర్రాక్కు పుట్టించకు. ఎందుకంటే నాకు ధర్మాలు నచ్చవ్. నాకు నచ్చేదల్లా ‘ఇజం’ అంతే! ’’ ‘‘సరే... ధర్మం మాట వదిలేద్దాం. మరి ‘ఇజమ్’ అని పుస్తకం రాశారు కద సార్. అలా రాశాక ఇజమ్ పై అవగాహన ఉండాలి కదా. చేగువేరాకూ, బాబుకూ, మోడీకీ సాపత్యమేంట్సార్?’’ ‘‘చేగువేరాలాగే వాళ్లిద్దరికీ గడ్డం ఉంది చూడు. ఒకేలాంటి ఫ్యాషన్ అనుసరించడం కూడా ఒక ఇజమే కదరా బాలూ!’’ ‘‘ఇజానికి మీరిచ్చిన నిర్వచనం గమ్మత్తుగా ఉంది సార్. కానీ మీ సినిమా విలన్ సిద్ధప్పది చిత్తూరు కదా! అలాగే మీ రాజకీయాల్లోనూ చిత్తూరు బాస్‌ను చిత్తు చేస్తారనుకుంటే నెత్తినెక్కించుకున్నారు కదా సార్. అదేంటో మీరన్నీ ఎప్పుడూ పరస్పర విరుద్ధమైనవి చేస్తూ ఉంటా రు. అదేమిటంటే మీ తిక్కకో లెక్కుందంటారు’’ ‘‘రివర్సులో ఏం చేశాన్రా బాలూ?’’ ‘‘నిజాయితీపరులనే కావాలంటారు. కానీ ఏలేరు స్కాములూ, ఎయిర్‌పోర్టు, ఎమ్మార్‌లకు భూములూ ఉంటూ అవినీతికి పాల్పడ్డవారికి వత్తాసులిస్తారు. చేగువేరా, కొమురంభీమ్లంటారు. కానీ విప్లవమూర్తులుగా రగిలిపోయే వాళ్ల సిద్ధాంతాలకు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరించే ఫాసిస్టులకు వెన్నుదన్నవుతారు. పార్టీ పెడతానంటారు. పోటీ పెట్టనంటారు. ఇవన్నీ చూస్తుంటే ఒకటనిపిస్తోంది సార్’’ ‘‘ఏవనిపిస్తోందిరా బాలూ?’’ ‘‘మీకు తిక్క ఉంది. కానీ మీ తిక్కకు లెక్కలేద్సార్! మీకోసం సాక్షాత్తూ ఇక చేగువేరాయే దిగిరావాల్సార్’’ ‘‘ఎందుకురా బాలూ... తన ఇజాన్ని నాకు అర్థమయ్యేలా బోధించడానికా?’’ ‘‘కాద్సార్. చేగువేరా డాక్టర్ కదా! మీ తిక్కకు వైద్యం చేయాలంటే డాక్టర్ అవసరం కదా. సాక్షాత్తూ చేగువేరాయే స్వయంగా వచ్చి వైద్యం చేస్తే పవన కళ్యాణం ఎలా ఉన్నా లోకకళ్యాణం మాత్రం ఖాయం సార్’’ ‘‘లాస్ట్ పంచ్ మనదైతే ఆ మజాయే వేరు. కానీ ఇక్కడది నీదయ్యిందేమిట్రా బాలూ!’’