మా రాంబాబుగాడు ఓ సినిమా కథ చెప్పడం మొదలుపెట్టాడు...
‘‘ఎక్కడికి వెళ్లి వస్తున్నావ్? ఎవరికి ఏం చెప్పి వస్తున్నావ్?’’ ప్రశ్నించారు పబ్లిక్.
‘‘హోదా అనేది చాలా బెస్ట్ అనీ, దానికోసమే మనం రక్తం ధారపోసైనా పోరాడాలని చెప్పి వస్తున్నా అంకుల్’’ అతి వినయం నటిస్తూ పబ్లిక్‌కి ఆన్సరిచ్చారు బాబుగారు.
‘‘ఆ?’’
‘‘అంటే.. ముందు హోదా అనే అనుకున్నాను. ఆ తర్వాత ఏవో కొన్ని ఇబ్బందులు రావడంలో.. ఆ పక్కనే ప్యాకేజ్ అనేదాన్ని ఎంచుకున్నా. కాకపోతే పబ్లిక్ తిరగబడ్డారు కాబట్టి మళ్లీ ఎప్పటిలాగే హోదా బెటర్ అని అనుకుంటున్నా సార్’’
‘‘ఈ ఎక్స్‌ట్రాలే వద్దు. ఇంతకీ నీకు ఏమొచ్చు?’’ అడిగారు పబ్లిక్.
‘‘ఈత సార్.. కాకపోతే ఇండోర్‌లోనే ఈదుదామని తాత్కాలిక సచివాలయం స్విమ్మింగ్‌పూల్ అయ్యేలా కట్టించా’’ జవాబిచ్చారు బాబుగారు.
‘‘ఈ ఎక్స్‌ట్రాలే తగ్గించుకుంటే మంచిది’’ ఈసడింపుగా అన్నారు పబ్లిక్.
‘‘ఇంతకీ ఏం అవుదామనుకుంటున్నావ్?’’ మళ్లీ పబ్లిక్ ప్రశ్న.
‘‘మరోసారి సీఎం.. లేదా మావాణ్ణి ఇక్కడ పెట్టేసి పీఎం’’ . ‘అవాక్కయ్యారు’ పబ్లిక్.
‘‘ఐదేళ్లలో నెరవేర్చగలిగే హామీలు పదిహేనేళ్లయినా పూర్తి కాలేదు. నువ్వు మళ్లీ మరోసారి సీఎం.. లేదా పీఎం?’’ పబ్లిక్ ఈసారి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
‘‘సార్ మీకేం తెలుసు సార్. మా అబ్బాయి సరిగా చదవలేదు. నేను దొడ్డిదారిన ఎమ్మెల్సీ ఇచ్చి, ఆ తర్వాత మంత్రిని చేసి, వాక్యాలు పలకడం కూడా రాకపోతే గవర్నమెంటు ఖర్చుతో ట్యూషన్ పెట్టించి.. అప్పుడు పనులు చేయడం మొదలు పెట్టేవాణ్ణి. మరి ఇంక పని చేయడానికి టైమేదీ? హామీలు నెరవేర్చడానికి వ్యవధేది? మీకు నాలాంటి కొడుకున్నాడా సార్. ఉంటే తెలిసేది సార్.. వాడికి అన్నీ నేర్పి.. అప్పుడు మళ్లీ పని చేయడం ఎంత కష్టమో’’ అంటూ ముక్కు చీదినట్టు నటించారు బాబుగారు.
‘‘సార్.. మీరు అవుతారు సార్. మళ్లీ తప్పక సీఎం అవుతారు’’ బంతి అలియాస్ ధారాకృష్ణ.
‘‘అవ్వకపోయినా ఫర్లేదు అంకుల్. నాకు కొడుకున్నాడు. మనవడు కూడా ఉన్నాడు. ఈ అందరిలో నా మనవడికి మొదటిసారి.. మా అబ్బాయికి రెండోసారీ అక్షరాభ్యాసం చేసి, ఇద్దరిని ఒకేసారి కాన్వెంట్‌లో వేసేసి, ఇద్దరికీ నేనే స్వయంగా ట్యూషన్ చెప్పుకుంటాను. కాకపోతే ఈ సారి మావాణ్ణి మరింత జాగ్రత్తగా చదివించుకుంటా’’ తన ఫ్యూచర్ ప్లాన్లు వివరిస్తూ.. తన విశ్రాంతి సమయాన్ని ఎంత అర్థవంతంగా గడపదలుచుకున్నారో విపులీకరించి చెప్పారు బాబుగారు. ’’’
ఇంతవరకు ఒక కథను స్పూఫ్‌లా చెప్పి.. ‘‘ఈ కథకు టైటిల్ ఏమిటో చెప్పు?’’ అడిగాడు మా రాంబాబుగాడు.
‘‘నువ్వు నాకు నచ్చలేదు’’ ఒక్క క్షణం కూడా ఆలస్యం లేకుండా ఠక్కున చెప్పారు పబ్లిక్.
–యాసీన్
Comments
Please login to add a commentAdd a comment