కుర్చీలు ఉండి జనం లేకపోతే అది చంద్రబాబు ప్రచారసభ. జనం ఉండి కుర్చీలు లేకపోతే అది ఉండవల్లిలోని ప్రజావేదిక. ఈ రెండు చోట్లా కాకుండా చంద్రబాబు ప్రసంగిస్తున్నాడంటే.. అది టెలికాన్ఫరెన్స్.
టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నాడు చంద్రబాబు.
టెలికాన్ఫరెన్స్‌లో ప్రజలు ఉండరు. పార్టీ నాయకులు ఉంటారు. అదో సుఖం చంద్రబాబుకి. ప్రజలైతే చప్పట్లు కొట్టరేమోనన్న భయం ఉంటుంది. ఉండేది నాయకులు కాబట్టి.. చప్పట్లు కొట్టకపోతే ఎలా అనే భయం నాయకులకే ఉంటుంది.
టెలికాన్ఫరెన్స్‌లో లోకేశ్, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, ఎంపీ కనకమేడల, అధికార ప్రతినిధి సాదినేని యామిని.. ఇంకా రెగ్యులర్‌గా టీవీల్లో కనిపించి జ్ఞానం, విజ్ఞానం, పరిజ్ఞానం ప్రదర్శించే స్టార్ క్యాంపెయినర్‌లు కూడా ఉన్నారు.
‘‘ఇంక ఐదు రోజులే’’ అన్నాడు చంద్రబాబు.
‘‘ఐదు రోజులెక్కడ నాన్గారూ.. రేపే కదా’’ అన్నాడు లోకేశ్. అంతా ఉలిక్కిపడ్డారు. చంద్రబాబు ఉలిక్కిపడలేదు.
‘‘రేపేంటి లోకేశ్‌బాబూ.. ఏప్రిల్ 11న కదా’’ అన్నాడు.
‘‘ఏప్రిల్ 11న ఏంటి నాన్గారూ.. రేపే కదా’’ అన్నాడు లోకేశ్.
మళ్లీ అంతా ఉలిక్కిపడ్డారు. చంద్రబాబు ఉలిక్కిపడలేదు.
‘‘లోకేశ్‌బాబూ.. 11న కదా పోలింగ్. మర్చిపోయావా’’ అన్నాడు.
‘‘ఓ! నాన్గారూ.. మీరు పోలింగ్ గురించి మాట్లాడుతున్నారా. నేను పండగ గురించి అనుకున్నా. ఉగాది రేపే కదా’’ అన్నాడు లోకేశ్.
బుద్ధా వెంకన్న వైపు బెంగగా చూశాడు చంద్రబాబు.
చంద్రబాబు తనవైపు అలా బెంగగా ఎందుకు చూశాడో అర్థం కాక యామిని వైపు చూశాడు బుద్ధా వెంకన్న.
యామిని ‘మైహూనా’ అన్నట్లు చంద్రబాబు వైపు చూశారు.
‘‘లోకేశ్‌బాబు కరెక్టే చెప్పారు నాయుడుగారూ.. ఎన్నికలంటే పండగే కదా. ఈ నెలలో రెండు పండగలు. ఒకటి ఏటా వచ్చే పండగ. ఇంకోటి ఐదేళ్లకొచ్చే పండగ. పోలింగ్ పండగ ఇంకో ఐదు రోజులే ఉందని మీరన్నారు. పచ్చడి పండగ రేపే కదా అని లోకేశ్‌బాబు అనుకున్నారు’’ అని కవర్ చేశారు యామిని.
‘‘యామినిగారూ.. మీరెవర్ని కవర్ చేయాలని చూస్తున్నారు?! చంద్రబాబు గారినా, లోకేశ్‌బాబుగారినా, మన పార్టీ లీడర్లనా, ప్రజలనా, టెలికాన్ఫరెన్స్‌నా?’’ అని లేచాడు కనకమేడల. యామిని అంతకు అంతెత్తూ లేచారు.
‘‘నేనెవర్నీ కవర్ చేయట్లేదు కనకమేడలగారూ.. మీరే ఈ మధ్య టీవీల్లో బాగా కవర్ అవుతూ, బాబుగారికి ఏదో చేస్తున్నట్లు కవరింగు, కలరింగు ఇస్తున్నారు..’’ అన్నారు.
చంద్రబాబు మళ్లీ బుద్ధా వెంకన్న వైపు బెంగగా చూశాడు.
‘‘ఇంకో ఐదురోజులే మిగిలాయి వెంకన్నగారూ. ఈ ఐదు రోజుల్లో చివరి రెండు రోజులు మనం మాట్లాడేదేమీ ఉండదు. ఇంక మిగిలేది మూడు రోజులే. ఈ మూడురోజులైనా మీరంతా లోకేశ్‌బాబుకి అర్థమయ్యేలా మాట్లాడండి. ప్రజలకు అర్థంకాకపోయినా పార్టీకి నష్టం లేదు’’ అన్నాడు చంద్రబాబు.
‘నాకు అర్థంకాకపోవడం ఏంటి!’ అన్నట్లు నాన్గారి వైపు చూస్తున్నాడు లోకేశ్.
‘నేను అర్థం కాకుండా మాట్లాడ్డం ఏంటి’ అని చంద్రబాబు వైపు చూస్తున్నాడు బుద్ధా వెంకన్న. టెలికాన్ఫరెన్స్ అయ్యాక విడిగా చంద్రబాబుని కలుసుకుని ‘‘నేనేమైనా అర్థంకాకుండా మాట్లాడానా నాయుడుగారూ..
అని అడిగాడు.
చంద్రబాబు నిట్టూర్పు విడిచారు.
‘‘వెంకన్న గారూ.. మంగళగిరి సభలో మీరేమన్నారు! లోకేశ్ నలభై ఏళ్లు మంగళగిరి ఎమ్మెల్యేగా ఉంటారని కదా అన్నారు. లోకేశ్‌బాబు నన్ను ఏమడిగాడో తెలుసా! ‘నాన్నగారూ.. నేను నలభై ఏళ్లయినా మంగళగిరి ఎమ్మెల్యేగానే ఉండపోతానా, మీలా సీఎంని కాలేనా’ అని అడిగాడు వెంకన్నగారూ..’’ అని చెప్పి, మళ్లీ బెంగపడ్డాడు చంద్రబాబు.
–మాధవ్
Comments
Please login to add a commentAdd a comment