
జగన్ సభల్లో జనం తప్ప జగన్ కనిపించడం లేదు.పవన్ సభల్లో పవన్ తప్ప జనం కనిపించడం లేదు. బాబు సభల్లో జనం కనిపించడం లేదు.. బాబూ కనిపించడం లేదు! కారణమేంటని, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్నాడు చంద్రబాబు.
‘లోకేశ్‌బాబు సుడిగాలి పర్యటనలే కారణం’ అని ఉంది రిపోర్ట్‌లో!! రిపోర్ట్‌ని విసిరికొట్టాడు చంద్రబాబు.
‘‘నేనడిగిన రిపోర్ట్ ఏంటి, మీరిచ్చిన రిపోర్ట్ ఏంటి?’ అన్నాడు.
‘‘సారీ సార్. ఇది లోకేశ్‌బాబు తెప్పించుకున్న రిపోర్ట్.. వాతావరణ శాఖ నుంచి. ఇదిగోండి మీరు అడిగిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్’’ అని వేరే కాగితం చేతికిచ్చాడు కార్యదర్శి. దాన్ని చూడలేదు చంద్రబాబు!
‘‘వాతావరణశాఖ నుంచి లోకేశ్ రిపోర్ట్ తెప్పించుకున్నాడా!’’ అని ఆశ్చర్యపోయాడు. ‘‘అవున్సార్. రుతుపవనాలు రెండు నెలల ముందే కేరళ తీరాన్ని తాకే అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో చూసి చెప్పమన్నారట లోకేశ్ బాబు’’.. అన్నాడు కార్యదర్శి.
చంద్రబాబు ముసిముసిగా నవ్వుకున్నాడు. ‘‘ఎన్నికలు కొత్త కదా. ఎండలకు తట్టుకోలేకపోతున్నట్లున్నాడు’’ అన్నాడు. ‘‘ఎన్నికలు కొత్తయినా, లోకేశ్‌బాబుకి ఎండలు కొత్త కాదు కదా సార్. ఎండల్లో వానలు పడతాయని ఎందుకు అనుకు న్నాడో..’’ అన్నాడు కార్యదర్శి.
‘‘అనుకోలేదయ్యా.. ఆశించాడు. ఆశించడం తప్పా? నువ్వు ఆశించడం లేదా.. మళ్లీ నేనే సీఎంను కావాలని! నేను ఆశించడం లేదా నా సభలకు కనీసం ఇద్దరు ముగ్గురైనా జనం రావాలని! అలాగే లోకేశ్‌బాబూ ఆశించాడు.. సమ్మర్‌లో కుంభవృష్టి కురిస్తే బాగుంటుందని..’’ అన్నాడు చంద్రబాబు. ‘‘నైస్ సర్’’ అన్నాడు కార్యదర్శి.
‘‘నైస్ సరే.. ‘లోకేశ్‌బాబు సుడిగాలి పర్యటనలే కారణం’ అని ఉందేంటి వాతావరణ శాఖ రిపోర్ట్‌లో! దేనికి కారణం?’’ అని అడిగాడు చంద్రబాబు. ‘‘లోకేశ్‌బాబు రుతుపవనాల గురించి మాత్రమే ఆరాతీసి ఊరు కోలేదు సార్. ఎండలింత తీవ్రంగా ఉండడానికి కారణం ఏమిటో కూడా కనిపెట్టి చెప్పమని అడిగినట్లు న్నాడు. ‘ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే ఉన్నప్పటికీ లోకేశ్‌బాబు సుడిగాలి పర్యటనలు మొదలు పెట్టడంతో రాష్ట్రంలో ఎండలు ఒక్కసారిగా తీవ్రస్థాయికి చేరుకున్నాయి’ అని రాసి పంపారు’’ అన్నాడు కార్యదర్శి.
చంద్రబాబుకి మండిపోయింది. ‘‘ఆ రిపోర్ట్ ఇచ్చినవాడెవడో వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడై ఉంటాడు. లోకేశ్‌బాబు కంటపడకుండా రిపోర్ట్‌ని దాచేయండి. సెటైర్ అని అర్థం చేసుకోకుండా ‘నాన్గారూ.. నా వల్లే ఎండలు మండిపోతున్నాయట.. హి..హి.. హీ..’ అని వచ్చి చెబుతాడు. పిచ్చి లోకన్న’’ అన్నాడు.
తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసి చూశాడు. అందులో ఇలా ఉంది.
మీవాళ్ల ప్రశ్నలు :
జగన్ సభల్లో జనం తప్ప జగన్ కనిపించడం లేదు.
పవన్ సభల్లో పవన్ తప్ప జనం కనిపించడం లేదు.
బాబు సభల్లో జనం కనిపించడం లేదు, బాబూ కనిపించడం లేదు! ....కారణం ఏంటి?
మావాళ్ల పరిశీలన :
జగన్ జనం మధ్యలో ఉంటున్నాడు. అందుకే జనం తప్ప జగన్ కనిపించడం లేదు.
పవన్ జనం మధ్యలో ఉండటం లేదు. అందుకే పవన్ తప్ప జనం కనిపించడం లేదు.
చంద్రబాబు తెలుగురాని ఉత్తరాది లీడర్‌ల వెనుక ఉంటున్నాడు. అందుకే జనమూ కనిపించడం లేదు. బాబూ కనిపించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment