సాక్షి, అమరావతి : ‘‘మరి కాసేపట్లో మన ప్రియతమ నేత శ్రీ నారా చంద్రబాబునాయుడుగారు ‘వికారి’ నామ ఉగాది పురస్కారాలను ప్రకటించబోతున్నారు’’ అన్న అనౌన్స్‌మెంట్ వినిపించింది. అవునన్నట్లు వేదికపై ఉన్న చంద్రబాబు చిరునవ్వు నవ్వారు. పార్టీ నాయకులు, స్టార్ క్యాంపెయినర్‌లు, ముఖ్య కార్యకర్తలు సర్దుకుని కూర్చున్నారు.
‘‘వికారి పురస్కారాలన్నీ ప్రకటించాక, చివర్లో ‘పరమ వికారి’ పురస్కారం కూడా ప్రకటించబడుతుంది కనుక వికారి పురస్కారాలు దక్కని వాళ్లు నిరాశతో లేచి వెళ్లకండి. ఏమో, పరమ వికారి పురస్కారం ఆ లేచి వెళ్లిన వాళ్లలోనే ఒకరికి రావచ్చు’’ అని రెండో అనౌన్స్‌మెంట్ వినిపించింది. అవునన్నట్లు చంద్రబాబు రెండు వేళ్లు చూపిస్తూ నవ్వారు.
‘‘వికారి పురస్కారాలను పొందిన వాళ్లకు 2024 ఎన్నికల్లో ఎంపీ టికెట్, ‘పరమ వికారి’ పురస్కారం గెలుచుకున్న వారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబడుతుంది’’అని మూడో అనౌన్స్‌మెంట్ వినిపించింది. ఎంపీ సీటు కన్నా, ఎమ్మెల్యే సీటు ఎంత వాల్యూనో అర్థమై పార్టీ లీడర్‌లు, స్టార్ క్యాంపెయినర్‌లు, ముఖ్యకార్యకర్తలు మళ్లీ సర్దుకుని కూర్చున్నారు.
చంద్రబాబు ప్రారంభోపన్యాసం మొదలైంది. వెంటనే ఎండ్ అయింది!
‘‘ఈ ఏడాది జగన్‌ని ఎవరైతే వికారంగా తిట్టారో వారికి ఈ వికారి పురస్కారాలను ఇస్తున్నామన్న సంగతి మీకు తెలిసిందే. షడ్రుచులు ఆరు కాబట్టి ఆరు వికారి పురస్కారాలు ఉంటాయి. అంటే ఆరు ఎంపీ టికెట్‌లు. అలాగే ఈ ఆరు రుచులనూ కలిపి గిలక్కొడితే పరమ వికారంగా ఉండే రుచి ఒకటి తయారవుతుంది. ఆ రుచికి ఒక ఎమ్మెల్యే టికెట్ ఉంటుంది. ఆరు వికారాలు, ఒక పరమ వికారం కలిపి మొత్తం ఏడుగురు విజేతల పేర్ల జాబితా నా జేబులో ఉంది.
ఆ పేర్లను ప్రకటించడానికి ముందు ‘‘నాకెందుకు పరమ వికారి పురస్కారం రావాలంటే..’’ అని మీ గొప్పతనాన్ని మీరు చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరందరూ కూడా పరమ వికారి పురస్కారాన్నే ఆశిస్తున్నట్లు మీ ముఖాలను చూస్తే అర్థమౌతోంది’’ అని చెప్పి కూర్చున్నాడు చంద్రబాబు.
వెంటనే వైవీబీ రాజేంద్రప్రసాద్ లేచాడు. ‘‘జగన్‌మోదీ రెడ్డిగారి మీద జరిగిన హత్యాప్రయత్నాన్ని షర్మిల, విజయమ్మే చేశారని నేను పరమ వికారంగా తిట్టాను. జగన్‌మోహన్‌రెడ్డిని జగన్‌మోదీరెడ్డి అనడం కన్నా పరమ వికారం ఏముంటుంది? కనుక ఈ అవార్డు నాకే రావాలి’’ అన్నాడు.
‘‘సరే.. నువ్వు కూర్చో’’ అని, వర్ల రామయ్య లేచాడు. ‘‘వైఎస్ వివేకా మృతిపై జగన్ శవ రాజకీయాలు చేస్తున్నాడు అని నేను పరమ వికారంగా తిట్టాను. చిన్నాన్న చనిపోయిన బాధలో ఉన్న మనిషిని అలా తిట్టడం కన్నా పరమ వికారం ఏముంటుంది? కనుక ఈ అవార్డు నాకే’’ రావాలి అని చెప్పి కూర్చున్నాడు వర్ల రామయ్య.
సాదినేని యామిని లేచారు. ‘‘లేటుగా వచ్చినా, లేటెస్టుగా వచ్చాను. జగన్‌ని అసలు నా అంత పరమ వికారంగా ఎవరూ తిట్టి ఉండరు. మహిళా దినోత్సవ వేదికపై మహిళల సమస్యల గురించి మాట్లాడకుండా ఆ వేదికను నేను జగన్‌ని తిట్టడానికి వాడుకున్నాను. పరమ వికారానికి ఇది పరాకాష్ట. కనుక ఈ అవార్డు నాకే రావాలి అన్నారు’’.
‘‘నువ్వు కూర్చోవమ్మా..’’ అని కుటుంబరావు, కళావెంకట్రావు, బుద్ధా వెంకన్నా, యనమల, జూపూడి, మురళీమోహన్.. మరికొంతమంది ఒకేసారి పైకి లేచారు. ఎవరి తిట్లు వారు వినిపించారు. ‘పరమ వికారి’ అవార్డు తమకే రావాలని వాదించారు.
అందరి తిట్లూ విన్నాడు చంద్రబాబు. జేబులోంచి జాబితా తీసి, మొదట ఆరుగురు వికారి పురస్కార విజేతల పేర్లు చదివాడు. ఆ ఆరుగురు వికారి పురస్కార విజేతలు నిరుత్సాహ పడ్డారు. తమకు పరమ వికారి పురస్కారం వచ్చే ఛాన్స్ పోయిందని.
‘‘.. అండ్, ది పరమ వికారి అవార్డ్ గోస్ టు..’’ అని పాజ్ ఇచ్చాడు చంద్రబాబు. అంతా ఉత్కంఠగా తలలెత్తారు.
‘‘.. అండ్.. పరమ వికారి గోస్ టు.. సర్వేరాధ సర్వేకృష్ణ’’! అని ప్రకటించాడు.
‘‘అన్యాయం.. అక్రమం’’ అని ఆక్రోశించారు పరమ వికారి పురస్కారాన్ని ఆశించినవారంతా. ఆ పురస్కారానికి సర్వేరాధ సర్వేకృష్ణ ఎలా అర్హుడో చెప్పాలని డిమాండ్ చేశారు. వారిపైపు చూసి, కళ్లజోడు సవరించుకున్నాడు చంద్రబాబు.
‘‘మీరంతా జగన్‌ని పరమ వికారంగా తిట్టారు నిజమే. కానీ అతను జగన్‌ని పరమ వికారంగా తిట్టించాడు. తిట్టడం కన్నా తిట్టించడం పరమ వికారం. ఇంటర్వ్యూలు చేయించి తిట్టించాడు. సర్వేలు రాయించి తిట్టించాడు. జాతకాలు వేయించి తిట్టించాడు. అవి కూడా దొంగ సర్వేలు, దొంగ జాతకాలు, దొంగ ఇంటర్వ్యూలు. ఇంతకన్నా పరమ వికారం ఉంటుందా?’’ అన్నాడు. ఒక్కరూ నోరెత్తలేదు. ‘‘దయచేసి నోరు తెరవండి.. సారీ, దయచేసి పచ్చడి తిని వెళ్లండి..’’ అని వేదిక మీద నుంచి మరో అనౌన్స్‌మెంట్ వినిపించింది.
పరమ వికారి
Published Sat, Apr 6 2019 7:14 AM | Last Updated on Sat, Apr 6 2019 7:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment