ఎన్నికల సీజన్‌లో ఓ పిల్లి ఓ న్యూస్‌పేపర్‌కు పే...ద్ద ఇంటర్వ్యూ ఇచ్చింది. తనను తాను సమర్థించుకుంటూ చాలా విషయాలు చెప్పింది. ఆ వివరాలు కాస్త చూద్దాం.
నాలో ఎంతో మార్పు..
ప్రశ్న : మీ కొన్ని పాలసీలకు జనం నుంచి వ్యతిరేకత వచ్చింది కదా. ఈ విషయంలో మీరు చెప్పదలచుకున్నది..
జవాబు : ఆ రోజుల్లో.. అంటే 1995–2004లో నా వ్యవహారశైలి వేరుగా ఉండేది. అప్పట్లో నేను కాస్త దూకుడుగా ఉండేదాన్ని. చాలా ఎలుకలను పట్టా. నేను అలా ఎలుకలను పట్టడానికి కారణం అవి నా ఆహారమని కాదు. వాటిని తినాలనే ఆశ నాకు లేదు. రైతులనే అమాయకపు ఓటర్లు ఆరుగాలం కష్టపడి పంట పండిస్తారు. ఆ ఫలసాయాన్ని ఎలుకలు తినేస్తాయేమోననే ఆందోళనతో కేవలం రైతుల కష్టం తీర్చడానికే నేను వాటిని పట్టి చంపాను. అంతే తప్ప నేను తినడానికి ఎంతమాత్రమూ కాదు.
అయినా ఇప్పుడు మీకో విషయం తెలుసా? నేనిప్పుడు ‘రుద్రాక్ష పిల్లి’ని. నాన్‌వెజ్ పూర్తిగా మానేశా. భూతదయతో ఇప్పుడు నేనే కొన్ని ఎలుకలను చేరదీసి పెంచుతున్నా. అవిప్పుడు పందికొక్కుల్లా ఎదిగాయి. అందుకే సీబీఐ, ఈడీ బ్రాండుల ఎలుకల మందు వద్దని చెబుతున్నా. అయినా మందు పెడుతున్నారు. కొన్ని చోట్ల పెడితే కొన్ని పందికొక్కులు దొరుకుతున్నాయి. నాలో ఎంతగా మార్పు వచ్చిందో తెలుసా? ‘పిల్లి గుడ్డిదైతే.. ఎలుక కన్నుకొట్టింద’నే సామెతను నిజం చేస్తూ పందికొక్కులకు స్థాయికి చేరిన నేను పెంచిన ఎలుకలే కొన్ని నాకు అప్పుడప్పుడూ కన్ను కొడుతున్నాయి.
అయినా సరే.. ఇక నాలో ఎంతో మార్పు వచ్చి ఇప్పుడు రుద్రాక్ష పిల్లిని అయ్యాను కదా. అందుకే కన్నుకొట్టే పందికొక్కులనూ మందలించకుండా కీలకమైన స్థానాల్లో నిలబెట్టి మరీ ప్రోత్సహిస్తున్నా. చూడండి.. ఇది నాలో వచ్చిన మార్పునకు సంకేతం కాదా?
నేనెప్పుడూ అబద్ధం ఆడలేదు
ప్రశ్న : హోదా విషయంలో మీరు అబద్ధాలు ఆడారు కదా?
జవాబు : నేనెప్పుడూ అబద్ధాలు ఆడలేదు. నేను పిల్లిని కాబట్టి గోడ మీద ఉండటం నా నైజం. ఒకసారి గోడ మీద నేను నిలబడి ఉన్నప్పుడు ‘ఏది రైట్?’ అని ఒకరు నన్ను అడిగారు. అప్పుడు నా కుడికాళ్లు ఉన్న వైపునకు చూపిస్తూ.. ‘ఇది రైట్.. ఇదే రైట్’ అన్నా. ఆ తర్వాత గోడమీద వెనక్కు తిరిగా.. అప్పుడు కొంత మంది మళ్లీ ‘ఏది రైట్’ అని ప్రశ్నించారు.
అప్పుడు మళ్లీ నా కుడి వైపున ఉన్న భాగాన్నే ‘ఇది రైట్’ అని చూపించా. నేనెప్పుడూ నా ‘రైట్ సైడ్’నే చూపించా. కానీ గోడ మీద నేనలా తిరగడం చూసి.. కొందరది ‘యూ–టర్న్’ అంటూ ప్రచారం చేస్తున్నారు. నేనెప్పుడూ రైట్‌ను రైట్ అనే చెప్పా. అబద్ధాలు ఆడటం మా ఇంటావంటా లేదు.
జనం పిల్లి ఇచ్చిన ఇంటర్వ్యూ చదవనైతే చదివారు. కానీ కాస్త ఆలోచించారు. అంతకు ముందు కూడా పిల్లి ఓసారి తనలో చాలా మార్పు వచ్చిందనీ.. గతంలో రైతులను నిర్లక్ష్యం చేసి, ఐటీ ఐటీ అన్నానని ఒప్పుకుంది. ఈసారి అలా చేయనంది. కానీ మళ్లీ దానికి తిండిపెట్టాక.. మునపటి దారిలోనే వెళ్లడం మొదలుపెట్టింది.
‘డ్యాష్‌బోర్డని ఒకటి ఏర్పాటు చేసుకుని, దాని మీద.. లేని అభివృద్ధిని చూస్తూ ఉండిపోయింది. కాబట్టి పిల్లికి సంబంధించి దాన్ని పెంచుతున్న వారు ఓ నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే.. దానికి సంబంధించిన రెండు సామెతలను నిజం చేస్తూ.. అభివృద్ధి అనే పెళ్లికి వెళ్తూ.. పిల్లిని చంకన ఎత్తుకోవడం ఎందుకని.. ఈసారి పిల్లికి ఓటు బిచ్చం పెట్టలేదు.
Comments
Please login to add a commentAdd a comment