అమ్మ ఒడి..చదువుల గుడి | Education To Children By Ammavodi Declared By YS Jagan | Sakshi
Sakshi News home page

అమ్మ ఒడి..చదువుల గుడి

Published Tue, Apr 2 2019 9:00 AM | Last Updated on Tue, Apr 2 2019 11:32 AM

Education To  Children By Ammavodi Declared By YS Jagan - Sakshi

సాక్షి,అమరావతి : ఐదేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చదువు అందని ద్రాక్షగా మారింది. పిల్లలను బడికి పంపించాలంటేనే.. తల్లిదండ్రులు బెంబేలెత్తాల్సిన పరిస్థితి. ఎల్‌కేజీ, యూకేజీల్లో చేర్పించాలన్నా.. వేలకు వేలు ఫీజులు కట్టాల్సిందే. చంద్రబాబు సర్కారు ప్రైవేట్‌ కార్పొరేట్‌ స్కూల్స్‌ను ప్రోత్సహిస్తూ.. సర్కారీ బడులను నిర్వీర్యం చేసింది. వేల సంఖ్యలో ప్రభుత్వ స్కూళ్లను మూసేసింది. ఉన్న పాఠశాలల్లోనూ టీచర్లను నియమించకుండా.. సరైన సదుపాయాలు కల్పించకుండా సర్కారీ బడులను అధ్వానంగా మార్చివేసింది.

దీంతో రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేద తల్లిదండ్రులు సైతం పిల్లలకు వేలకు వేలు ఫీజులు కట్టి ప్రైవేట్‌ స్కూల్స్‌లో చేర్పించక తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితిల్లో ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ సాగిన సుదీర్ఘ పాదయాత్రలో.. తల్లిదండ్రుల ఇబ్బందులను స్వయంగా చూసిన జననేత వైఎస్‌ జగన్‌.. పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కల్గించేలా ‘అమ్మ ఒడి’ పథకం ప్రకటించారు. పిల్లలను బడికి పంపితే చాలు.. ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. జగన్‌ హామీతో తమపై పిల్లల చదువుల భారం తగ్గుతుందని తల్లిదండ్రుల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 

ఇక తమ పిల్లల చదువులకు ఎలాంటి ఢోకా ఉండదని తల్లిదండ్రులు విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చి ‘అమ్మ ఒడి’ అమలైతే తమపై పిల్లల చదువుల భారం తగ్గుతుందని.. బడుల్లో డ్రాపవుట్లు కూడా తగ్గుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. తమ పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.


పిల్లల చదువు భారం కాకూడదనే..
పిల్లల చదువులు కుటుంబానికి భారం కాకూడదని.. తల్లిదండ్రులు ఆందోళన చెందకూడదన్న ఆశయంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ నవరత్నాల్లో భాగంగా ‘అమ్మ ఒడి’ పథకం ప్రకటించారు. దీంతోపాటు సర్కారీ బడులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వ పాఠశాలల్లోని టీచర్‌ పోస్టులన్నిటినీ భర్తీచేసేందుకు మెగా డీఎస్సీని నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ప్రైవేట్‌ స్కూల్స్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని, ప్రతి ఒక్క విద్యార్థికి నాణ్యమైన అందిస్తామని భరోసా ఇచ్చారు.

మొన్న..1995 –2004
విద్యావ్యాపారానికి ద్వారాలు తెరిచిన చంద్రబాబు
చంద్రబాబు 1995లో అధికారంలోకి వచ్చీరాగానే ప్రైవేట్‌ విద్యావ్యాపారానికి ద్వారాలు తెరిచారు. నారాయణ, శ్రీచైతన్య వంటి బినామీ సంస్థలను ఏర్పాటుచేసి.. విద్యను వ్యాపార వస్తువుగా మార్చేశారు. ప్రభుత్వ పాఠశాలలను అప్పటినుంచే నిర్వీర్యం చేస్తూ వచ్చారు.  ప్రభుత్వ బడుల్లో వేలాది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచేశారు. మరోవైపు విద్యావాలంటీర్ల వ్యవస్థకు తెరతీశారు.

విద్యార్ధులు లేరనే సాకుతో వేలాది పాఠశాలలను మూసేయించారు. ఫలితంగా వేలాది మారుమూల గ్రామాలకు ప్రాథమిక పాఠశాలలు అందుబాటులో లేకుండాపోయాయి. వాటి స్థానంలో పుట్టగొడుగుల్లా ప్రైవేట్‌ స్కూల్స్‌ పుట్టుకొచ్చాయి. నాటి చంద్రబాబు పాలనలో సామాన్య, మధ్యతరగతి పిల్లలకు చదువు అందుబాటులో లేకుండా పోయింది.

నిన్న.. 2004–2009 
వైఎస్‌ హయాం.. సర్కారీ విద్యకు స్వర్ణయుగం
దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004లో అధికారం చేపట్టిన తరువాత విద్యావ్యవస్థను మెరుగుపర్చడానికి అనేక చర్యలు చేపట్టారు. తాను అధికారంలోకి వచ్చాక వరుసగా డీఎస్సీలు నిర్వహించి టీచర్‌ పోస్టుల భర్తీచేశారు. 2008 డీఎస్సీలో ఏకంగా 50వేలకు పైగా టీచర్‌ పోస్టులు భర్తీ చేసిన ఘనత వైఎస్‌కే దక్కింది. ప్రైవేటు స్కూల్స్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు కృషిచేశారు.

ప్రభుత్వ స్కూల్స్‌లో ఆంగ్లమాధ్యమం ఉండేలా.. సమాంతరంగా సక్సెస్‌ స్కూళ్లను ప్రారంభించారు. మోడల్‌ స్కూళ్లూ అప్పుడే వచ్చాయి. మారుమూల గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో పాఠశాలలను వేలాదిగా ప్రారంభించారు. హైస్కూళ్ల సంఖ్య అప్పటివరకు 3వేలకు పరిమితం కాగా వైఎస్‌ పాలనలో వాటిసంఖ్య 6వేలకు పైగా చేరింది. పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్యకు ప్రాధాన్యత కల్పించారు. డిజిటల్‌ తరగతులకు శ్రీకారం చుట్టింది వైఎస్సారే. ప్రతి పాఠశాలలో సబ్జెక్టు టీచర్లు తప్పనిసరిగా ఉండేలా చేశారు. సక్సెస్‌ స్కూళ్లలో ఆంగ్లమాధ్యమ తరగతులకోసం ప్రత్యేక శిక్షణ పొందిన టీచర్లను నియమించారు.

నేడు.. 2014–2019
చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కునారిల్లిన విద్యావ్యవస్థ
2014లో చంద్రబాబు అధికారం చేపట్టాక విద్యావ్యవస్థలో మళ్లీ ప్రైవేట్‌ పెత్తనం పెరిగిపోయింది. చంద్రబాబు వచ్చీరావడంతోనే రేషనలైజేషన్‌కు తెరతీశారు. ఈ ఐదేళ్లలో 6వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలను మూసేయించారు. ఎస్సీ,ఎస్టీ కుటుంబాలున్న ప్రాంతాలు, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని స్కూళ్లు మూతపడటంతో అక్కడ చదువుతున్న వేలాది మంది పిల్లలు చదువుకు దూరమయ్యారు.

ప్రభుత్వ స్కూళ్లల్లో నిబంధనల మేరకు తగినంత సంఖ్యలో టీచర్లను నియమించడం లేదు. 30వేలకు పైగా టీచర్‌ పోస్టులు ఖాళీలున్నా.. వాటిని భర్తీచేయడం లేదు. ఇప్పటికీ ఏకోపాధ్యాయ పాఠశాలలు 6వేల వరకు ఉన్నాయంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పాఠశాలల్లో కనీస సదుపాయాలు కల్పించడం లేదు. బయోమెట్రిక్‌ యంత్రాలు, ట్యాబ్‌ల పంపిణీ, పాఠశాలలకు ఫర్నీచర్‌ సరఫరా, మరుగుదొడ్ల నిర్మాణం.. ఇలా అన్ని వ్యవహారాల్లో భారీగా నిధులు దండుకున్నారు.

నాలుగున్నరేళ్లలో సర్వశిక్ష అభియాన్‌ నిధులతోపాటు ఇటు బడ్జెట్‌ నిధులనూ ఇష్టానుసారంగా తమ వారికి కాంట్రాక్టుల పేరిట కట్టబెట్టింది చంద్రబాబు సర్కారు. తాజాగా రూ.4800 కోట్లతో మౌలిక సదుపాయాల పేరిట మరిన్ని కాంట్రాక్టులు ఇచ్చింది. మధ్యాహ్నం భోజనం, దుస్తుల పంపిణీ, పాఠ్యపుస్తకాల సరఫరా, ఇతర పరికరాలు ఏర్పాటు వంటి టెండర్లలో కోట్లాది రూపాయలను కమీషన్లు తీసుకొని వాటిని తమ అనుయాయులకు అప్పగించారు. 

రేపు.. జగన్‌... అమ్మ ఒడితో తల్లిదండ్రులకు భరోసా
ఫీజుల భారం పెరిగి పోయిన ప్రస్తుత పరిస్థితుల్లో.. ‘అమ్మ ఒడి’ పథకం ద్వారా.. పిల్లలను బడికి పంపితే చాలు ఏటా రూ.15వేలు నేరుగా తల్లి చేతికే ఇస్తామని వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. సర్కారీ బడులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వ పాఠశాలల్లోని టీచర్‌ పోస్టులన్నిటినీ భర్తీచేసేందుకు మెగా డీఎస్సీని నిర్వహిస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ప్రైవేట్‌ స్కూల్స్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు.

చంద్రబాబు హామీ ఇచ్చి మరిచారు
2014 ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే కేజీ నుంచి పీజీ వరకు.. ఉచిత విద్య అందిస్తామని చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారు. అది అమలు కాలేదు.  ప్రతి కిలోమీటరుకు ఒక ప్రాథమిక పాఠశాల.. ప్రతి 3కిలో మీటర్లకు ఒక ప్రాథమికోన్నత పాఠశాల.. ప్రతి 5 కిలోమీటర్లకు ఒక హైస్కూలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వాస్తవానికి గత ఐదేళ్లలో ఉన్న స్కూళ్లను సైతం మూసేయించారు.

ప్రతి ఏటా విద్యాసంవత్సరానికి మూడు నెలల ముందే డీఎస్సీని నిర్వహించి టీచర్లను నియమిస్తామన్నారు. తన ఐదేళ్ల పాలనలో ఎన్నికలకు ముందు అరకొర పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చి మమ అనిపించారు.ఆ చట్టంతో చదువులు మరింత భారం: చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్‌ను ప్రోత్సహించడానికి ఏకంగా ఒక ప్రత్యేక చట్టాన్ని తెస్తోంది.

సెల్ఫ్‌ఫైనాన్స్‌డ్‌ ఇండిపెండెంటు స్కూల్సు పేరిట తెస్తున్న ఈ చట్టంతో ఇక చదువులు మరింత భారంగా మారనున్నాయి. పెద్దపెద్ద కార్పొరేట్‌ సంస్థలు మాత్రమే పాఠశాలలు స్థాపించేలా ఈ నిబంధనలు పెట్టింది. ఈ చట్టంవస్తే  ప్రస్తుతం అందుబాటులో ఉన్న విద్య కూడా పేద మధ్యతరగతి పిల్లలకు అందకుండాపోనుంది. కార్పొరేట్‌ విద్య మరింత భారంగా మారనుంది.

నారాయణ, చైతన్య చేతుల్లో ఇంటర్‌ విద్య
చంద్రబాబు పాలనలో ఇంటర్మీడియెట్‌ విద్య మరింత భారంగా మారింది. రాష్ట్రంలో 3500 వరకు జూనియర్‌ కాలేజీలుంటే.. అందులో 1100 మాత్రమే ప్రభుత్వ, ఎయిడెడ్‌ కాలేజీలు. మిగతావన్నీ ప్రైవేట్‌ కార్పొరేట్‌ సంస్థల చేతుల్లోనే ఉన్నాయి. వీటిల్లో అత్యధిక శాతం నారాయణ, చైతన్య సంస్థలవే. ఈ కార్పొరేట్‌ స్కూల్స్‌లో ఫీజులపై నియంత్రణ లేకపోవడంతో ఆయా యాజమాన్యాలు ఇష్టానుసారం ఫీజులు పెంచేస్తున్నాయి.

రూ.30వేల నుంచి లక్షకు పైగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇవి కాకుండా పుస్తకాలు, యూనిఫారాలు, ఇతరాల పేరిట వేలకు వేలు డబ్బు వసూలు చేస్తున్నాయి. పుస్తకాలకు రూ.15వేలు, యూనిఫారానికి రూ.7వేలు, ఇతర సామగ్రి అంటూ మరో 2వేలు దండుకుంటున్నాయి.  ఇంటర్మీడియెట్‌ విద్య పేరిట కార్పొరేట్‌ సంస్థలు విద్యార్ధులను పీల్చిపిప్పిచేస్తున్నాయి. ఏటా రూ.లక్షన్నర నుంచి రూ.3లక్షల వరకు ఇంటర్‌కు ఫీజులుగా వసూలు చేస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement