10 రోజుల జీతాన్నే చెల్లించనున్న టీ సర్కార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం నుంచి రిలీవైన ఏపీ విద్యుత్ ఉద్యోగులు ప్రస్తుతం ఏ రాష్ట్రానికీ కానివారయ్యారు. జూన్ నెలకు సంబంధించిన జీత భత్యాలను ఏ రాష్ట్రం నుంచి పొందాలో తెలియక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 1,251 మంది ఏపీ ఉద్యోగులను ఈ నెల 9, 10 తేదీల్లో తెలంగాణ విద్యుత్ సంస్థలు రిలీవ్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఉద్యోగులు ఈ నెలలో పనిచేసిన 10 రోజుల కాలానికి సంబంధించిన జీతభత్యాలను మాత్రమే జూలై నెలలో చెల్లించాలని తెలంగాణ విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి.
రిలీవ్ ఆర్డర్లు జారీ చేయకముందే ఏపీ ఉద్యోగులు కోర్టుకు వెళ్లడం వల్ల మళ్లీ వారిని తిరిగి విధుల్లోకి చేర్చుకునే ప్రసక్తే లేదని తెలంగాణ విద్యుత్ సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. ఏపీ ప్రభుత్వం సైతం ఈ ఉద్యోగులను విధుల్లో తీసుకోవడంలో విముఖత చూపింది. తెలంగాణ విద్యుత్ సంస్థల విభజన మార్గదర్శకాలు, రిలీవ్ ఉత్తర్వులను హైకోర్టు సింగిల్‌బెంచ్ నిలుపుదల చేసింది.
ఈ నిర్ణయంపై డివిజన్ బెంచ్‌కు అప్పీలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రెండు వారాల సమయం కోరింది. మళ్లీ ఈ అంశంపై హైకోర్టులో ఓ నిర్ణయం వెల్లడైతేనే ఏపీ ఉద్యోగుల భవితవ్యం తేలే అవకాశముంది. తెలంగాణ ప్రభుత్వం అప్పీలు దాఖలు చేయడం, దానిపై ఏపీ ఉద్యోగులు, ప్రభుత్వం కౌంటర్ వేయడం, నిర్ణయం వచ్చే సరికి ఏపీ ఉద్యోగులు జూలై నెల జీతాన్ని సైతం కోల్పోయే ప్రమాదముంది.
ఏ రాష్ట్రానికీ కానివారైన ఏపీ విద్యుత్ ఉద్యోగులు
Published Sat, Jun 27 2015 12:58 AM | Last Updated on Sat, Aug 18 2018 6:29 PM
Advertisement
Advertisement