‘కృష్ణా’ వాదనలకు మరో సీనియర్ న్యాయవాది
- వైద్యనాథన్‌కు తోడు హరీశ్‌సాల్వేను నియమించాలని కోరిన అడ్వొకేట్ జనరల్
- గత విచారణలో సుప్రీం వ్యాఖ్యల నేపథ్యంలో అప్రమత్తం
- 30న జరగనున్న వాదనలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాద అంశమై సుప్రీంకోర్టులో జరుగుతున్న వాదనలను మరింత గట్టిగా వినిపించేందుకు ప్రస్తుతమున్న సీనియర్ న్యాయవాదికి తోడు మరో సీనియర్ న్యాయవాదిని నియమించాలని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన రెండు రోజుల క్రితం ప్రభుత్వానికి ప్రత్యేకంగా లేఖ రాశారు.
కృష్ణా వివాదాన్ని కేవలం రెండు రాష్ట్రాలకే ఎందుకు పరిమితం చేయవద్దంటూ ఇటీవల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వ న్యాయవాదులు.. ఈ మేరకు మరో సీనియర్ న్యాయవాది నియామక అవసరాన్ని నొక్కి చెబుతూ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కృష్ణా నదీ జలాల వివాదాన్ని కేవలం రెండు రాష్ట్రాల వివాదంగా చూడరాదని, నీటిని కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వినియోగిస్తున్నప్పుడు కేటాయింపులు 4 రాష్ట్రాలకు చేయాలని రెండు తెలుగు రాష్ట్రాలు వేర్వేరుగా సుప్రీంను కోరుతున్నాయి.
సుప్రీంకోర్టులో తన వాదనలను వినిపించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సీనియర్ న్యాయవాది వైద్యనాథన్‌ను నియమించుకుంది. ఆయనకు కావేరీ, వంశధార ట్రిబ్యునల్‌ల ముందు వాదించిన అపార అనుభవం ఉంది. అయితే రెండు వారాల కిందట ఈ కేసు విచారణ సందర్భంగా కర్ణాటక, మహారాష్ట్రల తరపున న్యాయవాదులు పాలీ నారిమన్, అంధ్యార్జునలు చేసిన వాదనలను దృష్టిలో పెట్టుకుని ‘తుది లేకుండా జల వివాదాలు కొనసాగడం మంచిది కాదు. కేటాయింపులన్నీ ముగిశాక ప్రస్తుత వివాదం కేవలం రెండు రాష్ట్రాలకే కదా’ అని సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. కృష్ణా వివాదం కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేస్తే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది.
ఇప్పటికే బ్రజేష్ ట్రిబ్యునల్ ముందు నాలుగు రాష్ట్రాల అవసరాలను పరిగణనలోకి తీసుకొని నీటి పునఃపంపకంపై వాదనలు కొనసాగుతున్నాయి. ఈ దశలో సుప్రీంకోర్టు ఏదైనా కీలక నిర్ణయం ప్రకటిస్తే అసలుకే ఎసరు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో 30న జరిగే తదుపరి విచారణకు రాజ్యాంగ నిపుణుడైన మరో సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వేని నియమించాల్సిన అవసరాన్ని తన లేఖలో అడ్వొకేట్ జనరల్ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.