Vaidyanathan
-
రూ.1000 అప్పుకు రూ.2 కోట్లు తిరిగిచ్చాడు!
చేసిన మేలును మరిచిపోయే ఈ రోజుల్లో కూడా ఎప్పుడో తీసుకున్న 1000 రూపాయలకు ఏకంగా రూ.2 కోట్లు తిరిగి ఇచ్చి అందరి చేతా ఔరా అనిపించుకున్నారు. ఇంతకీ ఆయన ఎవరు, ఎక్కడ పనిచేస్తున్నారు అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వైద్యనాథన్ (Vaidyanathan) అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ ఐడీఎఫ్సీ (IDFC) ఫస్ట్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ అంటే కొందరికి గుర్తొస్తుంది. బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కంటే ఈయన చేసిన దాతృత్వం వల్ల చాలా మందికి సుపరిచయం. ఆపదలో ఉన్న వారికి తన షేర్లను గిఫ్ట్ ఇస్తూ ఎంతోమందిని ఆదుకుంటున్నారు. వైద్యనాథన్ ఇప్పటికి రూ. 80 కోట్ల విలువ చేసే షేర్లను ప్రజలకు పంచిపెట్టారు. తాజాగా మరో 5.5 కోట్ల రూపాయల విలువైన షేర్లను మరో ఐదు మందికి గిఫ్ట్‌గా ఇచ్చేసారు. అంటే 7 లక్షల షేర్స్ (మార్చి 22న ఒక్కో షేర్ ధర రూ.78 వద్ద ముగిసింది) గిఫ్ట్ ఇచ్చారు. ఇందులో రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అధికారి వింగ్ కమాండర్ 'సంపత్ కుమార్' ఉన్నారు. ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. సంపత్ కుమార్ గతంలో ఎప్పుడో వైద్యనాథన్‌కు 1000 రూపాయలు అప్పుగా ఇచ్చారట. దాన్ని గుర్తుపెట్టుకుని ఇప్పుడు వైద్యనాథన్ ఏకంగా వైద్య సహాయం కోసం 2.50 లక్షల షేర్స్ (సుమారు రూ. 2 కోట్లు) గిఫ్ట్ ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వైరల్ అవుతోంది. కేవలం వెయ్యి రూపాయలకు.. 2 కోట్ల రూపాయలు గిఫ్ట్ ఇచ్చారంటే అయన దాతృత్వాన్ని మాటల్లో వర్ణించడం కష్టం. రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అధికారికి మాత్రమే కాకూండా మనోజ్ సహాయ్ అనే వ్యక్తికి 50 వేల షేర్స్, సమీర్ మాత్రే అనే వ్యక్తికి మరో 50 వేల షేర్స్ అందించారు. తన సహోద్యోగి మరణించడం వల్ల అతని కుటుంబాన్ని ఆదుకోవడంలో భాగంగా వారికి 75వేల షేర్స్ ఇచ్చారు. ఎ.కనోజియా అనే వ్యక్తికి కూడా 2.75 లక్షల షేర్స్ ఇచ్చినట్లు సమాచారం. ఈ కాలంలో కూడా ఇలాంటి వారు ఉన్నారంటే నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి. -
నీళ్లు పట్టుకెళ్లి పాలు తెచ్చుకోండి
‘నీళ్లు పట్టుకెళ్లి పాలు తెచ్చుకోండి’.. న్యూఢిల్లీలో నలభై ఏళ్ల కిందట అద్భుతమైన ఫలితాలను ఇచ్చిన మాట ఇది. అప్పట్లో న్యూఢిల్లీలో చాలా కాలనీల్లో కాలనీకి ఒక్క పాలబూత్ మాత్రమే ఉండేది. వైద్యనాథన్ నివసించే ‘ఓల్డ్ ఆరావళి రేంజ్’ కు సమీపంలోని కాలనీకి కూడా అంతే. వాళ్లకు ‘మదర్ డెయిరీ’ బూత్ మాత్రమే ఆధారం. అప్పటికి ఇంకా పాలకు ప్యాకెట్ రూపం రాలేదు. అందరూ గిన్నె లేదా చిన్న క్యాన్ పట్టుకెళ్లి పాలు పోయించుకునే వాళ్లు. అప్పుడు వైద్యనాథన్‌కి వచ్చిన ‘నీళ్లు పట్టుకెళ్లి పాలు తెచ్చుకోండి’.. అనే ఆలోచనే ఆ కాలనీని పచ్చగా పెంచింది. కాలనీలోని వీధుల్లో వైద్యనాథనే స్వయంగా మొక్కలు నాటారు. తర్వాత ప్రతి ఇంటికి ముందుకూ వెళ్లి.. ‘పాల కోసం మీరు ఉదయం బూత్‌కి వెళ్లేటప్పుడు పాల గిన్నె నిండా నీళ్లు పట్టుకెళ్లి ఒక్కొక్కరు ఒక్కో మొక్కకు పోయండి. వచ్చేటప్పుడు ఆ గిన్నెలో పాలు పోయించుకుని రండి. ఇది మీకు కష్టమైన పనేమీ కాదు కదా’ అని అభ్యర్థించాడు. ఆ ప్రయత్నం ఫలించి ఇదిగో ఇప్పుడీ కాలనీ మొత్తం పచ్చటి చెట్లతో చల్లగా ఉందని చెప్పారు వైద్యనాథన్ కూతురు ఉషా రామస్వామి. మొక్కలే ఉద్యోగం ఎనభై ఏళ్ల వైద్యనాథన్‌ది తమిళనాడులోని ఓ మారుమూల పల్లె. చదువుకుని ఉద్యోగరీత్యా ఢిల్లీలో స్థిరపడ్డారాయన. ఉద్యోగం చేసిన రోజుల్లోనూ మొక్కల పెంపకం మీద ఆసక్తితో ఉండేవారు. రిటైర్ అయిన తర్వాత ఆయన పూర్తి స్థాయిలో మొక్కలతోనే జీవించడం మొదలుపెట్టారు. ఢిల్లీ, గుర్గావ్ పరిసరాల్లో ఆయన మొక్కలు నాటి పెంచిన పార్కులకు లెక్కేలేదు. మొక్కలు పెంచడం ఖర్చుతో కూడిన పని కానే కాదని చెప్తారు, చేసి చూపిస్తారు కూడా. ఎండాకాలంలో నీటి ఎద్దడి ఉన్న రోజుల్లో తన దుస్తులు ఉతుక్కున్న నీటిని బకెట్లతో మోసుకెళ్లి ఇప్పటికీ ఇంటికి దగ్గరలో ఉన్న మొక్కలకు పోసి వస్తారు. ఎనభై ఏళ్ల వయసులో ఈయనకు ఎంత ఓపిక అని నలభై ఏళ్ల వాళ్లు ఆశ్చర్యపోతుంటారని చెప్పారు ఉషా రామస్వామి. మొక్క కోసం పోరు తమ ఇంటికి సమీపంలోని రాక్ గార్డెన్‌ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో అది పాడుపడిపోయిందని, తండ్రి తన రెక్కల కష్టంతో ఆ గార్డెన్‌ను చిగురింపచేశారని, ఆ తర్వాత అది కబ్జాదారుల కోరల్లోకి చిక్కుకుపోయిందని చెప్పారు ఉష. ఆ సమయంలో వైద్యనాథన్ ఆ వార్డు కౌన్సిలర్‌కు, సంబంధిత ప్రభుత్వ శాఖలకు, వార్తాపత్రికలకు లెటర్లు రాసి రాసి ఎట్టకేలకు అధికారుల కళ్లు తెరుచుకునే వరకు పోరాడారు. ప్రభుత్వంతో ఆయన పోరాటం మొక్కలకే పరిమితం కాలేదు. బస్ స్టాప్‌ను కాలనీ వాసులకు అనువైన ప్రదేశంలోకి మార్పించడం, రద్దీగా ఉన్న ప్రదేశాల్లో పాదచారుల సౌకర్యం కోసం నడక వంతెన ఏర్పాటు చేయించడం, లైబ్రరీ పెట్టించడం వంటి పనులను అధికారుల వెంటపడి మరీ పూర్తి చేయించారు. అందుకే ఆ కాలనీవాసులతోపాటు ఆ కాలనీకి వచ్చే పాలవాళ్లు, కూరగాయలు అమ్ముకునే వాళ్లు కూడా దీపావళి పండుగ రోజు ఆయనతో స్వీట్లు పంచుకుంటారు. ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యి ఇరవై ఏళ్లు నిండినా ఇప్పటికీ ఆయన జూనియర్లు వైద్యనాథన్‌కు అంతేస్థాయిలో గౌరవం ఇస్తారు. మొక్క పూజ ‘ఈ వయసులో విశ్రాంతిగా ఉండకుండా ఇన్ని వ్యాపకాలెందుకు’ అంటే నవ్వి.. ‘‘నా వయసు వాళ్లు మంత్రాలు చదువుతూ, పూజలు చేసుకుంటూ గడుపుతారు. నేను మాత్రం ‘ప్రార్థించే పెదవుల కంటే పని చేసే చేతులు మిన్న’ అని నమ్ముతాను. అంతగా పూజలు చేయాలని ఉంటే దండిగా వండి చుట్టు పక్కల వాళ్లకు పంచి పెడితే సరి. మన చుట్టూ ఉన్న వాళ్లను సంతోషంగా ఉంచడంతోపాటు మన కారణంగా ఎవరికీ కష్టం కలగకుండా నడుచుకుంటే చాలు’’ అంటారు వైద్యనాథన్. – మంజీర మొక్క మనిషి మొక్కలు నాటడం కోసం ఈ వయసులోనూ నాన్న గుంటలు తవ్వుతుంటారు. అడ్డదిడ్డంగా పెరిగిన రెమ్మలను కత్తిరిస్తుంటారు. ఎండిన ఆకులను ఏరివేస్తారు. మొక్కల మధ్య దారులు తీస్తారు. మొక్కలకు పాదులు కూడా తీస్తుంటారు. అంతేకాదు, నిచ్చెన ఎక్కి మొక్కల తీగలను పైకి అల్లకం పెడతారు. ఈ పనులు చేస్తున్నప్పుడు ఈ వయసులో ఆయన దేహాన్ని ఎలా బాలెన్స్ చేసుకుంటున్నారా అని చూసే వాళ్లు ఆందోళన పడాల్సిందే తప్ప ఆయనకు ఏ మాత్రం భయం ఉండదు. – ఉషా రామస్వామి, వైద్యనాథన్ కూతురు -
‘కృష్ణా’పై నేడు సబ్ కమిటీ భేటీ
- భవిష్యత్ కార్యాచరణపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం - సమావేశంలో పాల్గొననున్న సుప్రీం న్యాయవాది వైద్యనాథన్ - ఈ అంశంపై సీఎంతో చర్చించిన మంత్రి హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు విషయం లో అనుసరించాల్సిన భవిష్యత్ న్యాయ కార్యాచరణ గురించి చర్చించేందుకు నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ శనివారం సచివాయంలో భేటీ కానుంది. సబ్ కమిటీ సభ్యులైన కడియం శ్రీహరి, పోచార ం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, జగదీశ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషీ, ఈఎన్సీ మురళీధర్‌తోపాటు సుప్రీంకోర్టు న్యాయవాది వైద్యనాథన్, అడిషనల్ అడ్వొకేట్ జనరల్ రామ్‌చందర్‌రావులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రంపై పడే ప్రభావం, భవిష్యత్ కార్యాచరణపై భేటీలో చ ర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకే ట్రిబ్యునల్ విచారణ పరిమితమైతే తెలంగాణకు ఎనలేని నష్టం జరిగే అవకాశాల దృష్ట్యా, దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లడమే ఉత్తమమని ప్రభుత్వానికి ఓవైపు సూచనలు అందుతుండగా తీర్పు వెలువడ్డాక సుప్రీంకు వెళ్లి చేసేదేమీ లేదని మరోవైపు నుంచి వాదన వినిపిస్తోంది. దీనిపై ఇప్పటికే ఓసారి చర్చించిన కమిటీ...వైద్యనాథన్ సలహా మేరకే ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఇదే విషయమై మంత్రి హరీశ్ శుక్రవారం సీఎం కేసీఆర్‌తో చర్చించినట్లు తెలిసింది. మరోవైపు ఎస్కే జోషి, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు అధికారులతో సమావేశమై వైద్యనాథన్ ముందుంచాల్సిన అంశాలపై చర్చిం చారు. ఇదే విషయమై రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం సైతం ప్రత్యేకంగా సమావేశమైంది. ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లడమే రాష్ట్రం ముందున్న మార్గమని, ఇదే నిర్ణయాన్ని ప్రభుత్వానికి చెప్పాలని నిర్ణయించినట్లు తెలిసింది. -
‘కృష్ణా’ వాదనలకు మరో సీనియర్ న్యాయవాది
వైద్యనాథన్‌కు తోడు హరీశ్సాల్వేను నియమించాలని కోరిన అడ్వొకేట్ జనరల్ గత విచారణలో సుప్రీం వ్యాఖ్యల నేపథ్యంలో అప్రమత్తం 30న జరగనున్న వాదనలు సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాద అంశమై సుప్రీంకోర్టులో జరుగుతున్న వాదనలను మరింత గట్టిగా వినిపించేందుకు ప్రస్తుతమున్న సీనియర్ న్యాయవాదికి తోడు మరో సీనియర్ న్యాయవాదిని నియమించాలని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన రెండు రోజుల క్రితం ప్రభుత్వానికి ప్రత్యేకంగా లేఖ రాశారు. కృష్ణా వివాదాన్ని కేవలం రెండు రాష్ట్రాలకే ఎందుకు పరిమితం చేయవద్దంటూ ఇటీవల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వ న్యాయవాదులు.. ఈ మేరకు మరో సీనియర్ న్యాయవాది నియామక అవసరాన్ని నొక్కి చెబుతూ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కృష్ణా నదీ జలాల వివాదాన్ని కేవలం రెండు రాష్ట్రాల వివాదంగా చూడరాదని, నీటిని కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వినియోగిస్తున్నప్పుడు కేటాయింపులు 4 రాష్ట్రాలకు చేయాలని రెండు తెలుగు రాష్ట్రాలు వేర్వేరుగా సుప్రీంను కోరుతున్నాయి. సుప్రీంకోర్టులో తన వాదనలను వినిపించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సీనియర్ న్యాయవాది వైద్యనాథన్‌ను నియమించుకుంది. ఆయనకు కావేరీ, వంశధార ట్రిబ్యునల్ల ముందు వాదించిన అపార అనుభవం ఉంది. అయితే రెండు వారాల కిందట ఈ కేసు విచారణ సందర్భంగా కర్ణాటక, మహారాష్ట్రల తరపున న్యాయవాదులు పాలీ నారిమన్, అంధ్యార్జునలు చేసిన వాదనలను దృష్టిలో పెట్టుకుని ‘తుది లేకుండా జల వివాదాలు కొనసాగడం మంచిది కాదు. కేటాయింపులన్నీ ముగిశాక ప్రస్తుత వివాదం కేవలం రెండు రాష్ట్రాలకే కదా’ అని సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. కృష్ణా వివాదం కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేస్తే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే బ్రజేష్ ట్రిబ్యునల్ ముందు నాలుగు రాష్ట్రాల అవసరాలను పరిగణనలోకి తీసుకొని నీటి పునఃపంపకంపై వాదనలు కొనసాగుతున్నాయి. ఈ దశలో సుప్రీంకోర్టు ఏదైనా కీలక నిర్ణయం ప్రకటిస్తే అసలుకే ఎసరు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో 30న జరిగే తదుపరి విచారణకు రాజ్యాంగ నిపుణుడైన మరో సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వేని నియమించాల్సిన అవసరాన్ని తన లేఖలో అడ్వొకేట్ జనరల్ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.