చేసిన మేలును మరిచిపోయే ఈ రోజుల్లో కూడా ఎప్పుడో తీసుకున్న 1000 రూపాయలకు ఏకంగా రూ.2 కోట్లు తిరిగి ఇచ్చి అందరి చేతా ఔరా అనిపించుకున్నారు. ఇంతకీ ఆయన ఎవరు, ఎక్కడ పనిచేస్తున్నారు అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
వైద్యనాథన్ (Vaidyanathan) అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ ఐడీఎఫ్‍సీ (IDFC) ఫస్ట్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ అంటే కొందరికి గుర్తొస్తుంది. బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కంటే ఈయన చేసిన దాతృత్వం వల్ల చాలా మందికి సుపరిచయం. ఆపదలో ఉన్న వారికి తన షేర్లను గిఫ్ట్ ఇస్తూ ఎంతోమందిని ఆదుకుంటున్నారు.
వైద్యనాథన్ ఇప్పటికి రూ. 80 కోట్ల విలువ చేసే షేర్లను ప్రజలకు పంచిపెట్టారు. తాజాగా మరో 5.5 కోట్ల రూపాయల విలువైన షేర్లను మరో ఐదు మందికి గిఫ్ట్‌గా ఇచ్చేసారు. అంటే 7 లక్షల షేర్స్ (మార్చి 22న ఒక్కో షేర్ ధర రూ.78 వద్ద ముగిసింది) గిఫ్ట్ ఇచ్చారు. ఇందులో రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అధికారి వింగ్ కమాండర్ 'సంపత్ కుమార్' ఉన్నారు.
ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. సంపత్ కుమార్ గతంలో ఎప్పుడో వైద్యనాథన్‌కు 1000 రూపాయలు అప్పుగా ఇచ్చారట. దాన్ని గుర్తుపెట్టుకుని ఇప్పుడు వైద్యనాథన్ ఏకంగా వైద్య సహాయం కోసం 2.50 లక్షల షేర్స్ (సుమారు రూ. 2 కోట్లు) గిఫ్ట్ ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వైరల్ అవుతోంది. కేవలం వెయ్యి రూపాయలకు.. 2 కోట్ల రూపాయలు గిఫ్ట్ ఇచ్చారంటే అయన దాతృత్వాన్ని మాటల్లో వర్ణించడం కష్టం.
రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అధికారికి మాత్రమే కాకూండా మనోజ్ సహాయ్ అనే వ్యక్తికి 50 వేల షేర్స్, సమీర్ మాత్రే అనే వ్యక్తికి మరో 50 వేల షేర్స్ అందించారు. తన సహోద్యోగి మరణించడం వల్ల అతని కుటుంబాన్ని ఆదుకోవడంలో భాగంగా వారికి 75వేల షేర్స్ ఇచ్చారు. ఎ.కనోజియా అనే వ్యక్తికి కూడా 2.75 లక్షల షేర్స్ ఇచ్చినట్లు సమాచారం. ఈ కాలంలో కూడా ఇలాంటి వారు ఉన్నారంటే నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment