నీళ్లు పట్టుకెళ్లి పాలు తెచ్చుకోండి | Usha Ramaswamy Life Story | Sakshi
Sakshi News home page

నీళ్లు పట్టుకెళ్లి పాలు తెచ్చుకోండి

Published Mon, Feb 3 2020 5:19 AM | Last Updated on Mon, Feb 3 2020 5:19 AM

Usha Ramaswamy Life Story - Sakshi

‘నీళ్లు పట్టుకెళ్లి పాలు తెచ్చుకోండి’.. న్యూఢిల్లీలో నలభై ఏళ్ల కిందట అద్భుతమైన ఫలితాలను ఇచ్చిన మాట ఇది. అప్పట్లో న్యూఢిల్లీలో చాలా కాలనీల్లో కాలనీకి ఒక్క పాలబూత్‌ మాత్రమే ఉండేది. వైద్యనాథన్‌ నివసించే ‘ఓల్డ్‌ ఆరావళి రేంజ్‌’ కు సమీపంలోని కాలనీకి కూడా అంతే. వాళ్లకు ‘మదర్‌ డెయిరీ’ బూత్‌ మాత్రమే ఆధారం. అప్పటికి ఇంకా పాలకు ప్యాకెట్‌ రూపం రాలేదు. అందరూ గిన్నె లేదా చిన్న క్యాన్‌ పట్టుకెళ్లి పాలు పోయించుకునే వాళ్లు. అప్పుడు వైద్యనాథన్‌కి వచ్చిన ‘నీళ్లు పట్టుకెళ్లి పాలు తెచ్చుకోండి’.. అనే ఆలోచనే ఆ కాలనీని పచ్చగా పెంచింది.

కాలనీలోని వీధుల్లో వైద్యనాథనే స్వయంగా మొక్కలు నాటారు. తర్వాత ప్రతి ఇంటికి ముందుకూ వెళ్లి.. ‘పాల కోసం మీరు ఉదయం బూత్‌కి వెళ్లేటప్పుడు పాల గిన్నె నిండా నీళ్లు పట్టుకెళ్లి ఒక్కొక్కరు ఒక్కో మొక్కకు పోయండి. వచ్చేటప్పుడు ఆ గిన్నెలో పాలు పోయించుకుని రండి. ఇది మీకు కష్టమైన పనేమీ కాదు కదా’ అని అభ్యర్థించాడు. ఆ ప్రయత్నం ఫలించి ఇదిగో ఇప్పుడీ కాలనీ మొత్తం పచ్చటి చెట్లతో చల్లగా ఉందని చెప్పారు వైద్యనాథన్‌ కూతురు ఉషా రామస్వామి.

మొక్కలే ఉద్యోగం
ఎనభై ఏళ్ల వైద్యనాథన్‌ది తమిళనాడులోని ఓ మారుమూల పల్లె. చదువుకుని ఉద్యోగరీత్యా  ఢిల్లీలో స్థిరపడ్డారాయన. ఉద్యోగం చేసిన రోజుల్లోనూ మొక్కల పెంపకం మీద ఆసక్తితో ఉండేవారు. రిటైర్‌ అయిన తర్వాత ఆయన పూర్తి స్థాయిలో మొక్కలతోనే జీవించడం మొదలుపెట్టారు. ఢిల్లీ, గుర్‌గావ్‌ పరిసరాల్లో ఆయన మొక్కలు నాటి పెంచిన పార్కులకు లెక్కేలేదు. మొక్కలు పెంచడం ఖర్చుతో కూడిన పని కానే కాదని చెప్తారు, చేసి చూపిస్తారు కూడా. ఎండాకాలంలో నీటి ఎద్దడి ఉన్న రోజుల్లో తన దుస్తులు ఉతుక్కున్న నీటిని బకెట్లతో మోసుకెళ్లి ఇప్పటికీ ఇంటికి దగ్గరలో ఉన్న మొక్కలకు పోసి వస్తారు. ఎనభై ఏళ్ల వయసులో ఈయనకు ఎంత ఓపిక అని నలభై ఏళ్ల వాళ్లు ఆశ్చర్యపోతుంటారని చెప్పారు ఉషా రామస్వామి.

మొక్క కోసం పోరు
తమ ఇంటికి సమీపంలోని రాక్‌ గార్డెన్‌ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో అది పాడుపడిపోయిందని, తండ్రి తన రెక్కల కష్టంతో ఆ గార్డెన్‌ను చిగురింపచేశారని, ఆ తర్వాత అది కబ్జాదారుల కోరల్లోకి చిక్కుకుపోయిందని చెప్పారు ఉష. ఆ సమయంలో వైద్యనాథన్‌ ఆ వార్డు కౌన్సిలర్‌కు, సంబంధిత ప్రభుత్వ శాఖలకు, వార్తాపత్రికలకు లెటర్లు రాసి రాసి ఎట్టకేలకు అధికారుల కళ్లు తెరుచుకునే వరకు పోరాడారు. ప్రభుత్వంతో ఆయన పోరాటం మొక్కలకే పరిమితం కాలేదు.

బస్‌ స్టాప్‌ను కాలనీ వాసులకు అనువైన ప్రదేశంలోకి మార్పించడం, రద్దీగా ఉన్న ప్రదేశాల్లో పాదచారుల సౌకర్యం కోసం నడక వంతెన ఏర్పాటు చేయించడం, లైబ్రరీ పెట్టించడం వంటి పనులను అధికారుల వెంటపడి మరీ పూర్తి చేయించారు. అందుకే ఆ కాలనీవాసులతోపాటు ఆ కాలనీకి వచ్చే పాలవాళ్లు, కూరగాయలు అమ్ముకునే వాళ్లు కూడా దీపావళి పండుగ రోజు ఆయనతో స్వీట్లు పంచుకుంటారు. ఉద్యోగం నుంచి రిటైర్‌ అయ్యి ఇరవై ఏళ్లు నిండినా ఇప్పటికీ ఆయన జూనియర్‌లు వైద్యనాథన్‌కు అంతేస్థాయిలో గౌరవం ఇస్తారు.

మొక్క పూజ
‘ఈ వయసులో విశ్రాంతిగా ఉండకుండా ఇన్ని వ్యాపకాలెందుకు’ అంటే నవ్వి.. ‘‘నా వయసు వాళ్లు మంత్రాలు చదువుతూ, పూజలు చేసుకుంటూ గడుపుతారు. నేను మాత్రం ‘ప్రార్థించే పెదవుల కంటే పని చేసే చేతులు మిన్న’ అని నమ్ముతాను. అంతగా పూజలు చేయాలని ఉంటే దండిగా వండి చుట్టు పక్కల వాళ్లకు పంచి పెడితే సరి. మన చుట్టూ ఉన్న వాళ్లను సంతోషంగా ఉంచడంతోపాటు మన కారణంగా ఎవరికీ కష్టం కలగకుండా నడుచుకుంటే చాలు’’ అంటారు వైద్యనాథన్‌. – మంజీర

మొక్క మనిషి
మొక్కలు నాటడం కోసం ఈ వయసులోనూ నాన్న గుంటలు తవ్వుతుంటారు. అడ్డదిడ్డంగా పెరిగిన రెమ్మలను కత్తిరిస్తుంటారు. ఎండిన ఆకులను ఏరివేస్తారు. మొక్కల మధ్య దారులు తీస్తారు. మొక్కలకు పాదులు కూడా తీస్తుంటారు. అంతేకాదు, నిచ్చెన ఎక్కి మొక్కల తీగలను పైకి అల్లకం పెడతారు. ఈ పనులు చేస్తున్నప్పుడు ఈ వయసులో ఆయన దేహాన్ని ఎలా బాలెన్స్‌ చేసుకుంటున్నారా అని చూసే వాళ్లు ఆందోళన పడాల్సిందే తప్ప ఆయనకు ఏ మాత్రం భయం ఉండదు. – ఉషా రామస్వామి, వైద్యనాథన్‌ కూతురు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement