మూడేళ్ల క్రితం.. కెన్యాలోని నైరోబీలో అండర్–20 వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ జరుగుతోంది. స్ప్రింట్స్ పోటీలకు ముందు ఒక కుర్రాడు అందరి దృష్టినీ ఆకర్షించాడు. అంతకు మూడు నెలల క్రితం జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ రిలేల్లో అతను మంచి ప్రదర్శన కనబరచాడు. క్రీడల్లో పెద్దగా గుర్తింపులేని ఆఫ్రికా దేశం బోత్స్‌వానా నుంచి వచ్చాడు. ప్రతిభనే నమ్ముకుంటూ ఒక్కోమెట్టు ఎక్కాడు.
‘ఆఫ్రికా బోల్ట్’ అంటూ క్రీడాభిమానుల ఆశీస్సులు అందుకున్నాడు. ఊహించని వేగంతో అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోయిన ఆ కుర్రాడు 21 ఏళ్ల వయసు వచ్చేసరికే వరల్డ్ ఫాస్టెస్ట్ అథ్లెట్‌లలో ఒకడిగా నిలిచాడు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకొని సత్తా చాటాడు. తమ దేశానికి ఈ మెగా క్రీడల చరిత్రలో తొలి పసిడి పతకాన్ని అందించాడు. రిలే పరుగులోనూ అతని వేగం వల్లే బోత్స్‌వానా దేశానికి మరో రజతమూ దక్కింది. అతని పేరే లెట్సిల్ టెబోగో.
పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించిన కొద్ది రోజులకు ఒక కార్పొరేట్ కంపెనీ ప్రతినిధులు కొందరు టెబోగోను కలిసేందుకు బోత్స్‌వానాలోని అతని స్వస్థలం కాన్‌యేకు వచ్చారు. వారికి అతను తన సొంత పొలంలో పనిచేస్తూ కనిపించాడు. అదేదో ఫ్యాషన్ కోసమో సరదాగానో కాదు పూర్తిస్థాయి రైతులా శ్రమిస్తున్నాడు టెబోగో. ‘ఒలింపిక్స్ మెడల్ గెలిచినా, నా జీవనం మాత్రం ఇదే’ అని అతను చెప్పుకోవడం విశేషం. టెబోగో స్వర్ణంతో పారిస్ నుంచి తిరిగొచ్చాక బోత్స్‌వానా దేశం మొత్తం పండుగ చేసుకుంది. అతని విజయాన్ని సంబరంగా జరుపుకునేందుకు సెలవు ప్రకటించిన ఆ దేశాధ్యక్షుడు స్వయంగా వెళ్లి స్వాగతం పలకడంతో పాటు తాను కూడా డాన్స్ చేస్తూ తన ఆనందాన్ని ప్రదర్శించడం టెబోగో ఆట విలువను చూపింది.
వరల్డ్ అథ్లెటిక్స్‌లో సత్తా చాటి..
నైరోబీ అండర్–20 వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ తర్వాత టెబోగో ఆగిపోలేదు. సరిగ్గా ఏడాది తర్వాత కొలంబియాలోని క్యాలీలో మళ్లీ ఈ టోర్నీ జరిగింది. అక్కడా గత ఏడాది ప్రదర్శనను పునరావృతం చేశాడు. మళ్లీ స్వర్ణం, రజతంతో మెరిశాడు. అంతే కాదు 100 మీటర్ల పరుగును 9.96 సెకన్లలో పూర్తిచేసి అండర్–20 స్థాయిలో ప్రపంచ రికార్డును సృష్టించడంతోపాటు కొద్దిరోజులకే తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. మూడు నెలల తర్వాత 9.94 సెకన్ల టైమింగ్‌తో అతని ఖాతాలో కొత్త రికార్డు నమోదైంది. అండర్–20 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో 100 మీ., 200 మీ.లలో వరుసగా రెండుసార్లు పతకాలు గెలుచుకోవడంతో దిగ్గజ అథ్లెట్ ఉసేన్ బోల్ట్‌తో అతడిని పోల్చటం మరింతగా పెరిగింది.
ఒలింపిక్స్ విజయం దిశగా..
సాధారణంగా క్రీడల్లో జూనియర్ స్థాయిలోని జోరునే సీనియర్ స్థాయిలోనూ కొనసాగించడం అంత సులువు కాదు. స్థాయి మారడం, పోటీతోపాటు కొత్తగా బరిలోకి దిగుతున్నట్లుగా ఉండే ఒత్తిడి యువ ఆటగాళ్లను గందరగోళానికి గురిచేస్తాయి. టెబోగో కూడా అలాంటి స్థితినే ఎదుర్కొన్నాడు. అండర్–20 విజయాల ఉత్సాహంతో వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ బరిలోకి దిగిన అతను తొలి ప్రయత్నంలో తడబడ్డాడు. ఓటమి నుంచి నేర్చుకునే స్వభావమున్న అతను సరిగ్గా ఏడాది తర్వాత 2023 బుడాపెస్ట్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో తానేంటో చూపించాడు.
100 మీటర్ల పరుగులో రజత పతకం గెలుచుకోవడంతో పాటు 200 మీటర్ల పరుగులో కాంస్యం సాధించాడు. ఇవి వరల్డ్ అథ్లెటిక్స్‌లో అతని స్థానాన్ని సుస్థిరం చేశాయి. పారిస్ ఒలింపిక్స్ ఫేవరెట్‌లలో ఒకడిగా నిలిపాయి. అయితే దురదృష్టవశాత్తు 100 మీటర్ల పరుగులో ఫైనల్ వరకు చేరగలిగినా అతని 9.86 సెకన్ల టైమింగ్ టెబోగోకు పతకాన్ని అందించలేకపోయింది. నిరాశ చెందలేదు. అంతే పట్టుదలగా మూడు రోజుల తర్వాతి 200 మీటర్ల పరుగుకు సన్నద్ధమయ్యాడు. 19.46 సెకన్ల టైమింగ్ నమోదుచేసి చాంపియన్‌గా నిలిచాడు. సగర్వంగా తన జాతీయ పతాకాన్ని ప్రదర్శించాడు.
అమ్మ కోసం గెలిచి..
‘నువ్వు ఎలాగైనా ఒలింపిక్స్ పతకం గెలవాలని అమ్మ మళ్లీ మళ్లీ చెప్పింది. ఆమె కోసమే ఈ పరుగు. ఆమెకే ఈ పతకం అంకితం!’ 200 మీటర్ల రేసు గెలిచాక టెబోగో భావోద్వేగంతో చెప్పిన మాటలవి. విజయం సాధించాక అతని కన్నీళ్లను చూస్తే ఆ గెలుపు ప్రత్యేకత కనిపిస్తుంది. టెబోగో ఈ స్థాయికి చేరడంలో అతని తల్లి ఎలిజబెత్ సెరాతివా పాత్ర ఎంతో ఉంది. ఆటలో ఓనమాలు నేర్పించడంతోపాటు అతను ఒక బలమైన అథ్లెట్‌గా ఎదగడంలో ఆమె అన్ని రకాలుగా అండగా నిలిచింది. జూనియర్ స్థాయిలో విజయాలతో పాటు వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకాలు గెలిచే వరకు కూడా అమ్మ తోడుగా ఉంది.
అయితే అతను ఒలింపిక్స్‌కు సిద్ధమయ్యే సమయంలోనే క్యాన్సర్‌తో 44 ఏళ్ల వయసులో ఆమె కన్నుమూసింది. ఒలింపిక్స్‌లో 200 మీటర్ల ఈవెంట్‌లో చేతివేలి గోర్లపై తల్లి పేరు, తన షూస్‌పై తల్లి పుట్టిన తేదీ రాసుకొని అతను బరిలోకి దిగాడు. చనిపోయిన తేదీ రాయాలంటే తనకు ధైర్యం సరిపోలేదని చెప్పాడు. విజయానంతరం ఆ షూస్‌ను కెమెరాకు చూపిస్తూ టెబోగో కన్నీళ్లపర్యంతమయ్యాడు. 21 ఏళ్ల వయసులోనే ట్రాక్‌పై అద్భుతాలు చేస్తున్న ఈ బోత్స్‌వానా స్టార్ రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించగలడనడంలో ఎలాంటి సందేహం లేదు. – మొహమ్మద్ అబ్దుల్ హాది
ఇవి చదవండి: భీష్ముడు చెప్పిన.. పులి–నక్క కథ!
Comments
Please login to add a commentAdd a comment