కృష్ణా.. మొర వినేనా?
♦ నేడు కేంద్రం అఫిడవిట్‌పై సుప్రీంలో వాదనలు
♦ తీర్పు వ్వ్యతిరేకంగా ఉంటే న్యాయపోరాటానికి సిద్ధం
♦ ఢిల్లీలోనే సీఎం, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాదాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో గురువారం సుప్రీంకోర్టులో జరగనున్న విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలుగు రాష్ట్రాల మొరను సుప్రీంకోర్టు ఆలకిస్తుందా? లేక కేంద్ర నిర్ణయాన్నే పరిగణనలోకి తీసుకుంటుందా? అన్న అంశంపై ఉత్కంఠ సాగుతోంది. ఢిల్లీలోనే ఉన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు. కేంద్ర వైఖరి ఎలా ఉన్నా.. మొత్తం జలాల కేటాయింపును సమీక్షించి నాలుగు రాష్ట్రాలకు మళ్లీ పంచకుంటే తెలంగాణకు జరిగే అన్యాయాన్ని సమర్థంగా సుప్రీంకోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఉన్న పరివాహక ప్రాంతం ఆధారంగా రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన వాటా దక్కలేని, అందువల్ల కొత్తగా కేటాయింపులు జరపాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాలని నిర్ణయించింది.
మిగులు జలాలపైనే వాదనలు
తన వాదనల్లో మిగులు జలాల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాలని రాష్ట్రం నిర్ణయించింది. బచావత్ అవార్డు ప్రకారం కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యత లెక్కన 2,060 టీఎంసీల నికర జలాలు ఉన్నట్లు గుర్తించగా.. బ్రజేష్ ట్రిబ్యునల్ మాత్రం 65 శాతం నీటి లభ్యతను ఆధారం చేసుకుని 2,578 టీఎంసీల జలం ఉన్నట్టు తేల్చారు. కొత్తగా 163 టీఎంసీల నికర జలం, మరో 285 టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్టు గుర్తించారు. వాటిని మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఏపీలకు పంపిణీ చేసింది. ఈ లెక్కన ఇప్పటికే ఉన్న కేటాయింపులకు అదనంగా ఏపీకి 190 టీఎంసీలు, కర్ణాటకకు 177 టీఎంసీలు, మహారాష్ట్రకు 81 టీఎంసీల నీటిని కేటాయించారు.
ఇందులో 280 టీఎంసీల మేర మిగులును ఎగువ రాష్ట్రాలే వాడేసుకుంటే దిగువన మిగులు జలాలపై ఆధారపడిన కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీ, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందనే అంశాన్ని కోర్టు ముందు ప్రస్తావించే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాలకే వివాదాన్ని పరిమితం చేస్తే క్యారీ ఓవర్ స్టోరేజీ కింద ఇచ్చిన 150 టీఎంసీల నీటిని మాత్రమే తెలంగాణ, ఏపీలు పంచుకోవాల్సి ఉంటుంది. జూరాలకు 9 టీఎంసీలు, ఆర్డీఎస్‌కు 4 టీఎంసీలు, తెలుగుగంగకు కేటాయించిన 25 టీఎంసీలను యథావిధిగా కొనసాగించే అవకాశాలుంటాయని, అప్పుడు తెలంగాణ ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదని వివరించనుంది. కోర్టు తీర్పు వ్యతిరేకంగా ఉంటే మళ్లీ న్యాయపోరాటానికే తెలంగాణ సర్కారు. మొగ్గుచూపనుంది.