‘కృష్ణా’పై ఏం చెబుతారో..?
♦ నేడు కృష్ణా జలాలపై సుప్రీంకోర్టులో విచారణ
♦ కేంద్రం సమర్పించే అఫిడవిట్‌పై అందరి దృష్టి
♦ ఢిల్లీకి వెళ్లిన ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల కేటాయింపులపై బుధవారం సుప్రీంకోర్టులో మరోమారు కీలక విచారణ జరుగనుంది. ఈ విచారణలో సుప్రీంకోర్టు బ్రజేష్ ట్రిబ్యునల్ పరిధిని రెండు తెలుగు రాష్ట్రాలకే సరిపెడుతుందా? లేక 4 రాష్ట్రాలకు వర్తింపజేస్తుందా? అన్నది వెల్లడికానుంది. పునః కేటాయింపులు రెండు రాష్ట్రాలకే పరిమితం చేయాలని గత విచారణ సందర్భంగా కేంద్ర జల వనరుల శాఖ సుప్రీంకోర్టుకు తెలిపిన నేపథ్యంలో బుధవారం నాటి తదుపరి విచారణకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక్కడ వెల్లడయ్యే కేంద్రం వైఖరిపైనే తెలుగు రాష్ట్రాల భవిష్యత్ ఆధారపడి ఉండటంతో విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
బ్రజేష్ ట్రిబ్యునల్ 5(2) కింద ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. బ్రజేష్ తీర్పు, తుది తీర్పును కలిపి గెజిట్ ప్రచురించేలా కేంద్రాన్ని ఆదేశించమని కర్ణాటక, మహారాష్ట్రలు పిటిషన్ వేసిన విదితమే. ఈ కేసులో కొత్తగా ఏర్పడిన తెలంగాణను సైతం చేర్చేందుకు అంగీకరించిన సుప్రీం, స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతినిచ్చింది. వీటిపై ఇప్పటికే పలు దఫాలుగా విచారణ చేసిన సుప్రీం తన నిర్ణయాన్ని అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. బుధవారం విచారణలో కేంద్రం తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది.
ఢిల్లీ వెళ్లిన ప్రభుత్వ సలహాదారు..
కాగా బ్రజేష్ తీర్పును పూర్తిగా సమీక్షించి 4 రాష్ట్రాలకు కలిపి కొత్తగా పునః కేటాయింపులు జరపాలని తెలంగాణ మరోమారు కోరనుంది. ముఖ్యంగా మిగులు జలాలను గుర్తించి వాటిని పంపిణీ చేయడంతో రాష్ట్రానికి జరిగే అన్యాయాన్ని వివరించనుంది. దీనిపై చర్చిం చేందుకు ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లారు.