అవి ముమ్మాటికీ పాతవే
పాలమూరు, డిండిపై సుప్రీంకోర్టులో తెలంగాణ కౌంటర్ దాఖలు
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా నదీ జలాల్లో తమకున్న వాస్తవ కేటాయింపుల్లోంచే నీటిని వాడుకుంటున్నామని ఎక్కడా పునర్విభజన చట్టాన్ని, ఇతర నిబంధనలను అతిక్రమించలేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. రాష్ట్ర పునర్విభజన అనంతరం చేపట్టే కొత్త ప్రాజెక్టుల గురించి సంబంధిత బోర్డులకు తెలపాలని చట్టంలో ఉన్నప్పటికీ తాము నిర్మించే ప్రాజెక్టులేవీ కొత్తవి కావని వివరించింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో పాటు, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులను ఉమ్మడి రాష్ట్రంలోనే చేపట్టారని, ఆ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు సైతం వెలువడ్డాయని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది.
పాలమూరు, డిండి కొత్త ప్రాజెక్టులంటూ.., వాటి పనులను నిలిపిచేయాలని ఏపీకి చెందిన కొందరు రైతులు వేసిన పిటిషన్‌పై, సమాధానం చెప్పాలన్న సుప్రీం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. నిజానికి ఏపీ చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టుకు గతంలో ఎలాంటి అనుమతులూ లేవని, జీవోలు లేవని, అన్ని అనుమతులు ఉన్న తమ ప్రాజెక్టులను తప్పుపడుతోందని అందులో వివరించింది. కృష్ణా జలాల వినియోగం విషయంలో బచావత్ అవార్డు మేరకు ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులున్నాయని, వీటికి తోడు అదనంగా పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులను ఏపీ చేపడితే, తమకు కృష్ణాలో మరో 90 టీఎంసీలు వస్తాయని తెలిపింది. వీటితో పాటే మిగులు జలాలను ఎగువ రాష్ట్రాలకు పంచడాన్ని ప్రశ్నిస్తూ, గతంలో జరిగిన అన్యాయాన్ని సవరించాలని తాము బ్రజేష్ ట్రిబ్యునల్ ముందు పోరాడుతున్నామని ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది. జల వివాదాల చట్టంలోని సెక్షన్ 262 ప్రకారం నీటి పంపకాలలో వివాదాల అంశాన్ని ట్రిబ్యునల్ చూడాల్సి ఉంటుందని, ఇప్పటికే అక్కడ వాదనలు కొనసాగుతున్నందున దీన్ని విచారించాల్సిన అవసరం లేదని పేర్కొంది. కాగా, ఈ పిటిషన్ ఈ నెల 20న సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.