వాటా పెంచండి | Telangana wants relook on water sharing | Sakshi
Sakshi News home page

వాటా పెంచండి

Published Sat, Sep 13 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 1:16 PM

Telangana wants relook on water sharing

* మరో 400 టీఎంసీల కృష్ణా నీరివ్వండి  
* బ్రిజేశ్ ట్రిబ్యునల్‌ను కోరనున్న తెలంగాణ సర్కార్
* ప్రాజెక్టులవారీగా కేటాయింపులు జరగాలి
* పాలమూరు, జూరాల-పాకాలకే 130 టీఎంసీలు
* ఉమ్మడి రాష్ర్టంలో తెలంగాణకు ఆది నుంచీ అన్యాయమే
* బలమైన వాదనలతో నివేదిక సిద్ధం చేసిన సర్కారు
* రాష్ర్టం తరఫు లాయర్‌తో చర్చలకు నేడు ఢిల్లీకి అధికారులు
 
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై రాష్ర్ట ప్రభుత్వం దృష్టి సారించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సరైన వాదనలు వినిపించకపోవడంతో తెలంగాణకు అన్యాయం జరిగిందని సర్కారు భావిస్తోంది. కృష్ణా నదీ జలాల్లో ప్రస్తుతం తగిన వాటా దక్కనందున ఇకపై జాగ్రత్త పడాలని నిర్ణయించుకుంది. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట గట్టి వాదనలు వినిపించడానికి సిద్ధమైంది. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేశ్ ట్రిబ్యునల్ పునః పరిశీలన చేయనున్న సంగతి తెలిసిందే.

దీంతో గతంలో జరిగిన అన్యాయాన్ని సమర్థంగా వివరించి ఎక్కువ లబ్ధి పొందాలని రాష్ర్ట ప్రభుత్వం యోచిస్తోంది. తెలంగాణకు ప్రస్తుతమున్న కే టాయింపులకు తోడు అదనంగా 400 టీఎంసీల నీటిని ఇవ్వాలని సమర్థంగా వాదించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు కొత్తగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల వివరాలను ట్రిబ్యునల్ ముం దుంచనుంది. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలోనే అధికంగా ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా లేవనెత్తనుంది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే అదనపు నీటి కేటాయింపులు సమంజసమేనన్న వాదనను రాష్ర్ట ప్రభుత్వం వినిపించనుంది.

17న ట్రిబ్యునల్‌కు నివేదిక
రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 89(ఎ), సెక్షన్ 89(బి)లకు సంబంధించి ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు ఎలా ఉండాలి? లోటు ఉన్నప్పుడు నీటి కేటాయింపులు ఎలా జరపాలన్న అంశాలను బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తాజాగా నిర్ణయించాల్సి ఉంది. దీనిపై చేపట్టిన విచారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల అభిప్రాయాలను ఆరు వారాల్లో తెలపాలని ట్రిబ్యునల్ కోరింది.

అయితే నిర్ణీత సమయం మించిపోవడంతో రాష్ట్రాలు మరో రెండు వారాల అదనపు సమయం కోరడంతో ట్రిబ్యునల్ అందుకు అంగీకరించింది. దీని ప్రకారం ఈ నెల 17న రాష్ట్రాలు తమ అభిప్రాయాలతో కూడిన నివేదికను బ్రిబ్యునల్‌కు సమర్పించాల్సి ఉంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు దీనిపై కసరత్తును పూర్తి చేశాయి. తెలంగాణ సర్కారు సైతం తన వాదనలపై కసరత్తు పూర్తి చేసింది. ఈ నివేదికను రాష్ట్రం తరఫు న్యాయవాది వైద్యనాథన్‌కు అందించి, ఆయనతో చర్చలు జరిపేందుకు సంబంధిత అధికారులు శనివారం నాడు ఢిల్లీ వెళుతున్నారు.

పరీవాహక ప్రాంతం, ఆయకట్టును బట్టి వాటా
విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు ఉండాలని టీ సర్కారు కోరుకుంటోంది. ప్రాజెక్టుల సామర్థ్యం, వాటికింద ఉన్న ఆయకట్టును పరిగణనలోకి తీసుకొని కేటాయింపులు చేయాలని వాదించనుంది. ఇదే సమయంలో నీటి లోటు ఉన్నప్పుడు ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకల్లోని ప్రాజెక్టుల నుంచి దిగువ ప్రాంతాలకు ఎంత నీటిని విడుదల చేస్తారన్నది ట్రిబ్యునల్ తేల్చాలని కోరనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలకాంశాలను ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లనుంది.

* కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 68.5 శాతం ఉన్నా.. మొత్తం కేటాయింపుల్లో కేవలం 35 శాతమే నీటి కేటాయింపులు ఉన్నాయి.
* తెలంగాణలోని 62.5 శాతం ఆయకట్టును లెక్కలోకి తీసుకుంటే ప్రస్తుత కేటాయింపులు ఏమాత్రం సరిపోవు.

* ఆంధ్రప్రదేశ్‌లో పరీవాహక ప్రాంతం 31.5 శాతం, ఆయకట్టు 37.5 శాతమే అయినప్పటికీ మొత్తం జలాల్లో 60 శాతానికి పైగా నీటి కేటాయింపులు జరిపారు.
* మొత్తం జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 512.04 టీఎంసీలు దక్కగా, తెలంగాణకు కేవలం 298.96 టీఎంసీలు మాత్రమే కేటాయించారు. పరీవాహకం, ఆయకట్టును లెక్కలోకి తీసుకున్నా తెలంగాణకు దక్కిన వాటా మరింత పెరగాల్సి ఉందన్నది రాష్ట్ర ప్రభుత్వ వాదన.

నీటి అవసరాలూ పరిగణనలోకి..
ఆయకట్టును వృద్ధిలోకి తెచ్చే ప్రాజెక్టులకు, ప్రజల తాగునీటి అవసరాలకు కేటాయింపులు పెంచాలని కూడా రాష్ర్ట ప్రభుత్వం వాదిస్తోంది. నాగార్జునసాగర్ నుంచి కృష్ణా డెల్టాకు అవసరానికి మించి నీటి కేటాయింపులు జరిపారని, అవసరమైతే ఇందులో కోత పెట్టి హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మరిన్ని జలాలు కేటాయించాలని ట్రిబ్యునల్‌ను సర్కారు కోరనుంది. ఇందుకు 15 టీఎంసీల అదనపు కేటాయింపులు కోరాలని నిర్ణయించింది.

అలాగే కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులకు 77 టీఎంసీల నీటి కేటాయింపుల కోసం గత ట్రిబ్యునల్ వాదనల్లోనే విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని, దీనిపై పునఃసమీక్ష చేసి కేటాయింపులు జరపాలని కూడా సర్కారు అభ్యర్థించనుంది. ఇవేగాక రాష్ట్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జూరాల-పాకాల, పాలమూరు ఎత్తిపోతలకు సుమారు 130 టీఎంసీల మేర నీటి కేటాయింపులు కోరుతూ నివేదిక సిద్ధం చేసింది. స్థూలంగా మిగులు జలాలు, నికర జలాలు కలుపుకొని మొత్తంగా మరో 400 టీఎంసీల అదనపు కేటాయింపులు కోరేందుకు రాష్ర్టం సన్నద్ధమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement