జలాల వివాదంపై 19న బ్రజేశ్ ట్రిబ్యునల్ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాదానికి సంబంధించిన విచారణను రెండు రాష్ట్రాలకే పరిమితం చేయాలా? లేదా నాలుగు రాష్ట్రాలను కలిపి విచారించాలా? అన్న అంశం ఈ నెల 19న తేలనుంది. దీనిపై బ్రజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తన నిర్ణయాన్ని వెలువరించనుంది. ఈ మేరకు ట్రిబ్యునల్ ఆఫీస్ హెడ్ హెచ్.ఎం.సింగ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అడ్వకేట్లకు సమాచారం అందించారు. ఇప్పటికే ఈ అంశంమై ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు వినిపించింది. కృష్ణా బేసిన్‌లో లభ్యతగా ఉన్న మొత్తం జలాలను సమీక్షించి నాలుగు రాష్ట్రాలకు మళ్లీ కేటాయించాలని వాదించింది. కృష్ణా జలాల వివాదాన్ని కేవలం ఏపీ, తెలంగాణ మధ్య వివాదంగా చూడరాదని, నీటిని నాలుగు రాష్ట్రాలు వినియోగించుకుంటున్నందున కేటాయింపుల్లోనూ అవన్నీ భాగస్వాములు అవుతాయని స్పష్టంచేసింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాలకే వాదనలను పరిమితం చేయాలని ట్రిబ్యునల్‌కు ఇప్పటికే కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఈనెల 19న ఉదయం 11 గంటలకు ట్రిబ్యునల్ తన నిర్ణయాన్ని వెలువరించనుంది.
‘కృష్ణా’పై ఏం తేలుస్తుందో?
Published Sat, Oct 8 2016 3:40 AM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM
Advertisement