పొదలకూరు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన జరిగితే తీవ్రంగా నష్టపోయేది రైతులేనని, జిల్లాలోని సోమశిల, కండలేరు జలాశయాలు ఎడారిలా మారుతాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సమైక్య ఉద్యమంలో భాగంగా బుధవారం పొదలకూరు పట్టణంలోని సంగం రోడ్డు సెంటర్ నుంచి రామ్‌నగర్ గేట్ సెంటర్ వరకు 100 ట్రాక్టర్లతో రైతులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న కాకాణి మాట్లాడారు.
బిజేష్ ట్రిబ్యూనల్ తీర్పు ఈ పాటికే సీమాంధ్ర రైతులకు గొడ్డలిపెట్టుగా మారిందన్నారు. మిగులు జలాలు ఆంధ్రాకు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇలాంటి తీర్పు వెలువడిన నేపథ్యంలో రాష్ట్రం విడిపోతే సీమాంధ్రలోని ప్రాజెక్ట్‌లకు చుక్కనీరు రాదన్నారు. మహానేత వైఎస్సార్ శ్రీశైలం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ వెడల్పు పెంచడం వల్ల సోమశిలకు 22 వేల క్యూసెక్కుల నీరు వస్తున్నాయని తెలిపారు. వైఎస్సార్ సజీవంగా ఉండి ఉంటే 60 వేల క్యూసెక్కులకు పెంచేవారన్నారు.
వ్యవసాయం శుద్ధ దండగంటూ తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన చంద్రబాబునాయుడు రైతులను నిలువునా ముంచారని ఆరోపించారు. వైఎస్సార్ సీఎం అయిన తర్వాత వ్యవసాయం పెద్దపండగంటూ రైతులను ఆదుకున్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల వారు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని చెప్పారు. సోనియాగాంధీ తన కుమారుడు రాహుల్‌గాంధీని ప్రధాన మంత్రిని చేయాలనే దుష్టసంకల్పంతో రాష్ట్రవిభజనకు పూనుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కొడిగడుతున్న కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన వైఎస్సార్ కుటుంబంపై ఆ పార్టీ నేతలు విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ ఉసురు తగిలి కాంగ్రెస్ పార్టీ దేశంలోనే భూస్థాపితం కాబోతోందని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందంటూ ఆ పార్టీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించడాన్ని ప్రజలు గమనించాలన్నారు. చంద్రబాబునాయుడు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ పెదమల్లు రమణారెడ్డి, పొదలకూరు సర్పంచ్ తెనాలి నిర్మలమ్మ, నాయకులు మద్దిరెడ్డి రమణారెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డి, డీ విజయభాస్కర్‌రెడ్డి, ఏనుగు శశిధర్‌రెడ్డి, గూడూరు శ్రీనివాసులు, వెన్నపూస దయాకర్‌రెడ్డి, తుమ్మల వెంకటకిషోర్, తదితరులు పాల్గొన్నారు.
విభజనతో రైతులకు తీరని నష్టం
Published Thu, Dec 12 2013 4:40 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement