Govardan Reddy
-
ఏపీపీఎస్సీ ఉద్యోగులపై హెచ్చార్సీలో ఫిర్యాదు
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలోనికి అక్రమంగా చొరబడిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయ సిబ్బందిపై తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ కో కన్వీనర్ కొంతం గోవర్దన్‌రెడ్డి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. టీఎస్పీఎస్సీ కార్యాలయంలోకి చొరబడి కీలకమైన రికార్డులను ఏపీపీఎస్సీ ఉద్యోగులు చిందర వందర చేసి, తారుమారు చేశారని, ఈ సంఘటనపై న్యాయ విచారణ జరపాలని హెచ్చార్సీని కోరారు. బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన హెచ్చార్సీ సెప్టెంబరు 21 లోగా సంఘటనకు సంబంధించి సమగ్రమైన నివేదికను అందజేయాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. -
నీటి ఎద్దడిపై అప్రమత్తం కావాలి
వెంకటాచలం: వేసవిలో నీటి ఎద్దడిని నివారించేందుకు అధికారులు అప్రమత్తం కావాలని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సూచించారు. గురువారం మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రం అందజేసిన 13వ ఆర్థిక సంఘం నిధులు మందుగా తాగునీటి అవసరాలకు ఖర్చుచేయాలని అధికారుల నుంచి ఆదేశాలు జారీ చేశారన్నారు. మండలంలో గతంలో చేసిన ప్రతిపాదనల పనులు ఇప్పటికీ ప్రారంభంకాకపోవడంతో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చంద్రశేఖర్‌పైన ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ ఆఖరు వరకు 13వ ఆర్థిక సంఘం నిధులు మరే ఇతర పనులకు కేటాయించరాదని దీనిపట్ల ఎంపీడీఓ ఖచ్చితంగా వ్యవహరించాలన్నారు. వేసవిలో రోజుకు 12గంటలకు పైగా విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. తాగునీటి సమస్యలపై పార్టీలకతీతంగా ప్రజల ఇబ్బందులను గుర్తించి సమన్వయంగా వ్యవహరించాలన్నారు. మండలంలో అతి చిన్నగ్రామమైన అట్రంవారికండ్రిగలో తాగునీటి సమస్య ఉండటం సిగ్గు చేటన్నారు. అధికారులు అందుబాటులో ఉంటూ ప్రజా జమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మందల వెంకటశేషయ్య, ఎంపీపీ తలపల అరుణ, మండల ఉపాధ్యక్షుడు వల్లూరు శ్రీధర్‌నాయుడు, కోఆప్షన్ సభ్యులు షేక్ అక్బర్ భాష, పి.హుస్సేన్, ఎంపీడీఓ సుగుణమ్మ, తహశీల్దార్ సుధాకర్ పాల్గొన్నారు. పరిహారం కోసం క్రిభ్కో బాధితుల వేడుకోలు సర్వేపల్లి కాశీవారికండ్రిగలోని సర్వే నంబర్ 2508లో ప్రభుత్వం రైతుల వద్ద నుంచి భూమిని తీసుకొని ఎపీఐఐసీ ద్వారా క్రిభ్కో ఎరువుల సంస్థకు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే ఇంకా కొంతమందికి పరిహారం అందక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులు తమను ఆదుకోవాలంటూ గురువారం ఎమ్మెల్యే గోవర్ధన్‌రెడ్డికి మొరపెట్టుకున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని, దీని కారణంగానే నెల్లూరు ఆర్డీవో సుబ్రమణేశ్వరెడ్డిని బదిలీ చేశారని ఆయన వివరించారు. -
ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించాలి
ముత్తుకూరు: నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం వచ్చే బడ్జెట్లో ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి డిమాండ్ చేశారు. రూ 9.20 కోట్ల అంచనాలతో చేపట్టే ముత్తుకూరు-పంటపాళెం రోడ్డు పున ర్నిర్మాణ పనులకు బుధవారం కాకాణి పంటపాళెంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అభివృద్ధి పనులు చేస్తే ఎమ్మెల్యేలకు ప్రజల్లో పేరు వస్తుందేమోనని సర్కారు నిధులు కేటాయించడం లేదన్నారు. ప్రయోగాల పేరుతో సర్కారు జిమ్మిక్కులు చేస్తోందన్నారు. ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించకపోవడం, అభివృద్ధి పర్యవేక్షణకు గ్రామకమిటీలు ఏర్పాటు చేయడాన్ని ప్రయోగాలు అనుకోవాలా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగించకుండా నిధుల కోటా ఇవ్వాలన్నారు. ఈ అంశాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తామన్నారు. ముత్తుకూరుకు నాలుగు లేన్ల రోడ్డు నెల్లూరు నుంచి ముత్తుకూరు మీదుగా కృష్ణపట్నం పోర్టు రోడ్డు కలిసేలా నాలుగు లేన్ల రోడ్డు ఏర్పాటుకు కృషిచేస్తామని కాకాణి హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న రోడ్ల మరమ్మతుకు అంచనాలు, ప్రతిపాదనలు సిద్ధం చేస్తే, ప్రభుత్వం నుంచి నిధుల సాధనకు కృషిచేస్తామని ఆర్అండ్బీ ఎస్ఈకి సూచించారు. ప్రజలు తనపై పెట్టుకొన్న విశ్వాసం వమ్ముచేసేది లేదన్నారు. పంటకాల్వల పనులకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయని ప్రభుత్వంగా టీడీపీ సర్కారు గుర్తింపుపొందిందన్నారు. ఆర్అండ్బీ ఎస్ఈ విజయకుమార్, ఈఈ ఎల్ శివప్రసాద్‌రెడ్డి, డీఈఈ రామారావు, ఏఈ నెల్లూరు గోపీకృష్ణ, జెడ్పీటీసీ సభ్యుడు నెల్లూరు శివప్రసాద్, ఎంపీపీ తేట్ల వెంకటసుబ్బమ్మ, పార్టీ కన్వీనర్ మెట్టా విష్ణువర్థనరెడ్డి, నాయకులు మారు సుధాకర్‌రెడ్డి, దువ్వూరు చంద్రశేఖర్‌రెడ్డి, ఇసనాక చంద్రశేఖర్‌రెడ్డి, అనంతరాజు వేణుగోపాల్, ఆలపాక శ్రీనివాసులు, ఎంపీటీసీ సభ్యులు గండవరం సుగు ణ, మండల ఉపాధ్యక్షుడు సర్పంచ్‌లు రొయ్యల రంగనాథం, సుబ్రహ్మణ్యం, ట్రేడ్ యూనియన్ కన్వీనర్ గండవరం సూరి, కందలూరు వెంకట్రామరెడ్డి, బందెల వెంకటరమణయ్య, రాగాల వెంకటేశ్వర్లు, పోలిరెడ్డి చిన్నపరెడ్డి పాల్గొన్నారు. -
యువకుడి దారుణ హత్య
కనగల్ :మండలంలోని తొరగల్ పరిధిలోని గజంగరాయగూడెం (సీతమ్మగూడెం) సమీపంలో ఆదివారం రాత్రి యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. రోడ్డువెంట మృతదేహం పడిఉండడాన్ని సోమవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో హత్య ఉదంతం వెలుగు చూసింది. స్థాని కులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తొరగల్ గ్రామానికి చెందిన పోశంరెడ్డి గోవర్దన్‌రెడ్డి(29)ని గుర్తు తెలియని వ్యక్తులు తొరగల్-తేలకంటిగూడెం గ్రామాల మధ్య రోడ్డు పక్కన హత్య చేశారు. హత్య జరిగిన ప్రదేశంలో మద్యం సీసాలు పడి ఉండడంతో మద్యం మత్తులో హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. హతుడి స్వస్థలం నాంపల్లి మండలంలోని పెద్దమాందాపురం. అతడి తల్లి నారమ్మ రెండు దశాబ్దాల క్రితం భర్తను వదిలేసి ఇద్దరు పిల్లలతో కలిసి తన తండ్రివద్దకు వచ్చి ఉంటోంది. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చండూరు సీఐ సుబ్బిరామిరెడ్డి, కనగల్ ఎస్సై పరమేశ్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. హతుడు గతం లో చేసిన నేరాల నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చని వారు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అతి కిరాతంగా హత్య గుర్తు తెలియని వ్యక్తులు గోవర్దన్రెడ్డిని అతి కిరాతకంగా హత్య చేసినట్లు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తే తెలుస్తోంది. మెడ , ముఖం, తలపై గోడ్డలితో విచక్షణా రహితంగా నరికారు. తలపై బండ రాయిని మోది హత్య చేశారు. చాలా సేపు చిత్రహింసలు పెట్టి మరీ చంపినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. హతుడి మర్మాంగంపై, ఎడ మ చేయి, నడుముపై పలు చోట్ల కత్తి గాట్లు ఉన్నాయి. పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్వాడ్‌తో హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. గత చరిత్ర నేరమయం హతుడు ప్రస్తుతం లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడి గత చరిత్ర పూర్తిగా నేరమయంగా ఉంది. కౌమార దశలోనే కృష్ణపట్టె దళానికి సానుభూతి పరుడిగా పనిచేసి లొంగిపోయాడు. తొమ్మిది సంవత్సరాల క్రితం కతాల్‌గూడెం సమీపంలో పెద్దమాందాపురానికి చెందిన సొంత బాబాయిని హత్య చేసిన కేసులో నిందితుడుగా ఉన్నాడు. పానగల్‌కు చెందిన ఆర్ఎంపీపై హత్యాయత్నం కేసులోనూ కీలక నిందితుడు. గ్రామంలోని మహిళలను వేధింపులకు గురి చేస్తుండే వాడని గ్రామస్తులు తెలిపారు. గతంలో గ్రామానికి చెందిన పలువురు మహిళలను కిడ్నాప్ చేసిన కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నాడు. -
సెల్ చార్జర్ పేలి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
భోజనం చేస్తుండగా ఫోన్ సెల్ అందుకుని ఎడమచేత్తో ప్లగ్ నొక్కడంతో పేలుడు బి.కొత్తకోట, న్యూస్‌లైన్: ఫోన్ చార్జర్ పేలడంతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. మండలంలోని బండారువారిపల్లె పంచాయతీ పెద్దపల్లెలో శనివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. పెద్దపల్లెకు చెందిన మిట్టపల్లె శ్రీనివాసులురెడ్డి, సుశీల దంపతులకు గోవర్దన్‌రెడ్డి (22) ఒక్కడే కుమారుడు. అనంతపురంలో పాలిటెక్నిక్ పూర్తిచేసి, అంగళ్లులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చేస్తున్నాడు. శనివారం ర్రాతి సెల్‌ఫోన్‌ను చార్జ్‌కు ఉంచాడు. అనంతరం భోజనం చేస్తుండగా ఫోన్‌కాల్ వచ్చింది. అన్నం పూర్తిగా తినకుండానే సెల్‌ఫోన్‌ను కుడి చేతితో అందుకున్నాడు. చార్జర్ ప్లగ్ నుంచి ఊడిపోతుండటంతో ఎడమ చేత్తో ప్లగ్‌ను విద్యుత్ సరఫరా పిన్లోకి నెట్టాడు. చార్జర్ ఒక్కసారిగా పేలింది. అందులోని రెండు సరఫరా పిన్నులు గోవర్దన్ ఎడమ అరచేతిలోకి చొచ్చుపోయి కరెంట్ షాక్‌కు గురయ్యాడు. చికిత్స నిమిత్తం మదనపల్లెకు తరలిస్తుండగానే మార్గమధ్యంలో మృతి చెందాడు. నా బిడ్డను విడిచి ఉండలేను దేవుడా గోవర్దన్ మరణంతో తల్లి సుశీల రోదించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. నా బిడ్డను విడిచి వుండలేను దేవుడా.. అంటూ బోరున విలపించింది. సోదరి హరిత అన్నను కోల్పోయిన దుఃఖంలో సొమ్మసిల్లి పడిపోయింది. ఆర్థిక స్థోమత అంతంత మాత్రమే అయినప్పటికీ కష్టపడి గోవర్దన్‌ను చదివిస్తున్నారు. ఈ ఏడాదితో చదువు పూర్తవుతుంది. జీవితంలో స్థిరపడతాడని కుటుంబీకులు ఆశలు పెట్టుకున్నారు. అంతలోనే ఆ ఇంట్లో చీకట్లు అలుముకున్నాయి. -
బాలకార్మికులకు విముక్తి
వికారాబాద్, న్యూస్‌లైన్: ఓ బిస్కెట్ కంపెనీలో పనిచేస్తున్న బాల కార్మికులకు అధికారులు విముక్తి కల్పించారు. వికారాబాద్ పట్టణంలోని శివారెడ్డిపేట సమీపంలో ఉన్న జగదీశ్వర్ ఫుడ్స్ బిస్కెట్ కంపెనీలో చిన్న పిల్లలతో పనులు చేయిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు మండల విద్యాధికారి గోవర్ధన్ రెడ్డి, శివారెడ్డిపేట్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బీఎన్ రెడ్డి మంగళవారం కంపెనీకి చేరుకున్నారు. అక్కడ అబ్ధుల్ నవీద్, జావిద్‌పాషా, నవాజ్‌పాషా, సిద్ధిక్ అనే నలుగురు బాలకార్మికులు పనిచేస్తున్నట్లు గుర్తించారు. వారితో మాట్లాడుతుండగా సిద్దిక్ పారిపోయాడు. విషయాన్ని అధికారులు ఫోన్లో సబ్ కలెక్టర్ ఆమ్రపాలికి సమాచారం అందించారు. స్పందించిన ఆమె బాలకార్మికులను పనిలో పెట్టుకున్న యాజమాన్యంపై కేసులు నమోదు చేసి, పిల్లలను పాఠశాలలో చేర్పించాలని ఆదేశించారు. దీంతో అధికారులు సబ్‌కలెక్టర్ ఆదేశాల మేరకు పిల్లలను శివారెడ్డిపేట్ పాఠశాలలో చేర్పించారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం యాజమాన్యంపై కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. -
దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
నెల్లూరు(పొగతోట), న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించేలా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వైఎ స్సార్సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. నగరంలోని జయభారత్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ముదివర్తికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు కొండూరు వెంకటసుబ్బారెడ్డిని మంగళవారం కాకాణి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలమైన నాయకుడు వెంటసుబ్బారెడ్డిపై రెండోసారి హత్యాయత్నం జరిగిందన్నారు. వెంకటసుబ్బారెడ్డిపై హత్మాయత్నానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేలా ఎస్పీ ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కాకాణితో పాటు వైఎస్సార్సీపీ నాయకులు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి, బత్తిన పట్టాభిరామిరెడ్డి ఉన్నారు. -
చంద్రబాబు, కిరణ్‌లదే విభజన పాపం
ముత్తుకూరు, న్యూస్‌లైన్: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ డెరైక్షన్‌లో సీఎం కిరణ్ వేసిన డ్రామాలు, రెండు కళ్ల సిద్ధాంతంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన లేఖ వల్ల రాష్ట్ర విభజన జరుగుతోందని వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ముత్తుకూరులో సోమవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం బస్టాండ్ కూడలిలో కార్యకర్తలు మానవహారం నిర్వహించారు. కాకాణి మాట్లాడుతూ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానంటూ సీఎం కిరణ్ రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. కొబ్బరి కాయల కథలు చెప్పి చంద్రబాబు విభజనకు పూర్తి సహకరించారన్నారు. రాష్ట్ర చరిత్రలో విభజన ప్రక్రియ ఒక మాయనిమచ్చగా మిగిలిపోతుందన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు జరిగాయని, పార్టీ అధినేత వైఎస్ జగన్ రెండు సార్లు, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఒక సారి ఆమరణ దీక్షలు చేశారని గుర్తు చేశారు. పోరాడకుంటే భావితరాలు క్షమించవు: డాక్టర్ వరప్రసాద్ ముత్తుకూరులో సమైక్యాంధ్రకు మద్దతుగా జరి గిన భారీ ప్రదర్శన, మానవహారంలో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ వరప్రసాద్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం ఇతర పార్టీల నాయకులు ఇప్పటికైనా పోరాటం చేయకుంటే భావితరాలు క్షమించవన్నారు. భారీ ప్రదర్శనలో కార్యకర్తలు పార్టీ పతాకాలు చేపట్టి వైఎస్ జగన్ జిందాబాద్, జోహార్ వైఎస్సార్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి, మండల నాయకులు మారు సుధాకర్‌రెడ్డి, ఇసనాక చంద్రశేఖర్‌రెడ్డి, మునుకూరు జనార్దన్‌రెడ్డి, దువ్వూరు గోపాల్‌రెడ్డి, ఈపూరు కోటారెడ్డి, కొడవలూరు రామిరెడ్డి, యానాటి శశిధర్‌రెడ్డి, పార్లపల్లి దిలీప్‌రెడ్డి, ఎర్రంవేణు, టీ రాజ పాల్గొన్నారు. -
విభజనతో రైతులకు తీరని నష్టం
పొదలకూరు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన జరిగితే తీవ్రంగా నష్టపోయేది రైతులేనని, జిల్లాలోని సోమశిల, కండలేరు జలాశయాలు ఎడారిలా మారుతాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సమైక్య ఉద్యమంలో భాగంగా బుధవారం పొదలకూరు పట్టణంలోని సంగం రోడ్డు సెంటర్ నుంచి రామ్‌నగర్ గేట్ సెంటర్ వరకు 100 ట్రాక్టర్లతో రైతులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న కాకాణి మాట్లాడారు. బిజేష్ ట్రిబ్యూనల్ తీర్పు ఈ పాటికే సీమాంధ్ర రైతులకు గొడ్డలిపెట్టుగా మారిందన్నారు. మిగులు జలాలు ఆంధ్రాకు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇలాంటి తీర్పు వెలువడిన నేపథ్యంలో రాష్ట్రం విడిపోతే సీమాంధ్రలోని ప్రాజెక్ట్‌లకు చుక్కనీరు రాదన్నారు. మహానేత వైఎస్సార్ శ్రీశైలం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ వెడల్పు పెంచడం వల్ల సోమశిలకు 22 వేల క్యూసెక్కుల నీరు వస్తున్నాయని తెలిపారు. వైఎస్సార్ సజీవంగా ఉండి ఉంటే 60 వేల క్యూసెక్కులకు పెంచేవారన్నారు. వ్యవసాయం శుద్ధ దండగంటూ తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన చంద్రబాబునాయుడు రైతులను నిలువునా ముంచారని ఆరోపించారు. వైఎస్సార్ సీఎం అయిన తర్వాత వ్యవసాయం పెద్దపండగంటూ రైతులను ఆదుకున్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల వారు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని చెప్పారు. సోనియాగాంధీ తన కుమారుడు రాహుల్‌గాంధీని ప్రధాన మంత్రిని చేయాలనే దుష్టసంకల్పంతో రాష్ట్రవిభజనకు పూనుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కొడిగడుతున్న కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన వైఎస్సార్ కుటుంబంపై ఆ పార్టీ నేతలు విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ ఉసురు తగిలి కాంగ్రెస్ పార్టీ దేశంలోనే భూస్థాపితం కాబోతోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందంటూ ఆ పార్టీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించడాన్ని ప్రజలు గమనించాలన్నారు. చంద్రబాబునాయుడు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ పెదమల్లు రమణారెడ్డి, పొదలకూరు సర్పంచ్ తెనాలి నిర్మలమ్మ, నాయకులు మద్దిరెడ్డి రమణారెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డి, డీ విజయభాస్కర్‌రెడ్డి, ఏనుగు శశిధర్‌రెడ్డి, గూడూరు శ్రీనివాసులు, వెన్నపూస దయాకర్‌రెడ్డి, తుమ్మల వెంకటకిషోర్, తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి స్మగ్లింగ్ ముఠాకు చెక్
హయత్‌నగర్, న్యూస్‌లైన్: ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న ఓ అంతర్రాష్ట్ర ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. నలుగురి అరెస్టు చేసి రూ. 60 లక్షల విలువైన 10 క్వింటాళ్ల ‘సరుకు’తో పాటు డీసీఎం వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బును జల్సాలకు ఖర్చు చేయడంతో పాటు గత పంచాయితీ ఎన్నికల్లోను ఖర్చు చేశామని నిందితులు చెప్పడం గమనార్హం. ఎస్ఓటీ ఓఎస్డీ గోవర్దన్‌రెడ్డి గురువారం తెలిపిన వివరాల ప్రకారం... ఒడిశాకు చెందిన పాల్ మహారాష్ట్రలోని షిర్డీకి చెందిన గణేష్‌కు రెండేళ్లుగా గంజాయిని సరఫరా చేస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా తిప్పాయిగూడెంకు చెందిన డీసీఎం డ్రైవర్ వీరేష్గౌడ్తో పాల్‌కు వైజాగ్‌లో పరిచయమైంది. వీరేష్ తన వ్యాన్‌లో ఒడిశా నుంచి షిర్డీకి గంజాయిని తరలించేందుకు ఒప్పందం చేసుకున్నాడు. తన గ్రామానికి చెందిన బుర్ర వెంకటేష్‌గౌడ్, మహ్మద్ జాని, బోయ రవిల సహకారంతో ‘సరుకు’ను గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నాడు. పాల్ ఇతనికి ట్రిప్పుకు రూ. 50 వేలు కిరాయితో పాటు మరో రూ. లక్ష అదనంగా చెల్లిస్తున్నాడు. నెలకు రెండు లేదా మూడు ట్రిప్పులను వీరు తరలిస్తున్నారు. ఎస్ఓటీ పోలీసులకు ఈ సమాచారం అందడటంతో రెండు నెలలుగా వీరిపై దృష్టి పెట్టారు. గురువారం ఉదయం 7 గంటలకు పెద్దఅంబర్‌పేట ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద మాటువేసి... డీసీఎం వ్యాన్ (ఏపీ24ఎక్స్4533)లో తరలిస్తున్న 10 క్వింటాళ్ల గంజాయి పట్టుకున్నారు. డ్రైవర్ వీరేష్గౌడ్తో పాటు వెంకటేశ్‌గౌడ్, జాని, రవిలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 3 సెల్ఫోన్లు, రూ. 10 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితులు పాల్, గణేష్‌లు పరారీలో ఉన్నారని, నిందితులపై మారక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఓఎస్డీ చెప్పారు. ఈ ముఠా గుట్టురట్టు చేసిన సిబ్బందికి రివార్డు ఇస్తామన్నారు. కాగా, గంజాయి స్మగ్లింగ్ ద్వారా అక్రమంగా సంపాదించిన సొమ్మును జల్సాలకు ఖర్చు చేసినట్లు నిందితులు తెలిపారు. గత పంచాయితీ ఎన్నికల్లోనూ కొంతడబ్బును ఖర్చు చేశామని చెప్పారు.