ఏపీపీఎస్సీ ఉద్యోగులపై హెచ్చార్సీలో ఫిర్యాదు
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలోనికి అక్రమంగా చొరబడిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయ సిబ్బందిపై తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ కో కన్వీనర్ కొంతం గోవర్దన్‌రెడ్డి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయంలోకి చొరబడి కీలకమైన రికార్డులను ఏపీపీఎస్సీ ఉద్యోగులు చిందర వందర చేసి, తారుమారు చేశారని, ఈ సంఘటనపై న్యాయ విచారణ జరపాలని హెచ్చార్సీని కోరారు.
బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన హెచ్చార్సీ సెప్టెంబరు 21 లోగా సంఘటనకు సంబంధించి సమగ్రమైన నివేదికను అందజేయాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీని ఆదేశించారు.