యువకుడి దారుణ హత్య
కనగల్ :మండలంలోని తొరగల్ పరిధిలోని గజంగరాయగూడెం (సీతమ్మగూడెం) సమీపంలో ఆదివారం రాత్రి యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. రోడ్డువెంట మృతదేహం పడిఉండడాన్ని సోమవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో హత్య ఉదంతం వెలుగు చూసింది. స్థాని కులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తొరగల్ గ్రామానికి చెందిన పోశంరెడ్డి గోవర్దన్‌రెడ్డి(29)ని గుర్తు తెలియని వ్యక్తులు తొరగల్-తేలకంటిగూడెం గ్రామాల మధ్య రోడ్డు పక్కన హత్య చేశారు.
హత్య జరిగిన ప్రదేశంలో మద్యం సీసాలు పడి ఉండడంతో మద్యం మత్తులో హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. హతుడి స్వస్థలం నాంపల్లి మండలంలోని పెద్దమాందాపురం. అతడి తల్లి నారమ్మ రెండు దశాబ్దాల క్రితం భర్తను వదిలేసి ఇద్దరు పిల్లలతో కలిసి తన తండ్రివద్దకు వచ్చి ఉంటోంది. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చండూరు సీఐ సుబ్బిరామిరెడ్డి, కనగల్ ఎస్సై పరమేశ్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. హతుడు గతం లో చేసిన నేరాల నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చని వారు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
అతి కిరాతంగా హత్య
గుర్తు తెలియని వ్యక్తులు గోవర్దన్‌రెడ్డిని అతి కిరాతకంగా హత్య చేసినట్లు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తే తెలుస్తోంది. మెడ , ముఖం, తలపై గోడ్డలితో విచక్షణా రహితంగా నరికారు. తలపై బండ రాయిని మోది హత్య చేశారు. చాలా సేపు చిత్రహింసలు పెట్టి మరీ చంపినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. హతుడి మర్మాంగంపై, ఎడ మ చేయి, నడుముపై పలు చోట్ల కత్తి గాట్లు ఉన్నాయి. పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్వాడ్‌తో హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.
గత చరిత్ర నేరమయం
హతుడు ప్రస్తుతం లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడి గత చరిత్ర పూర్తిగా నేరమయంగా ఉంది. కౌమార దశలోనే కృష్ణపట్టె దళానికి సానుభూతి పరుడిగా పనిచేసి లొంగిపోయాడు. తొమ్మిది సంవత్సరాల క్రితం కతాల్‌గూడెం సమీపంలో పెద్దమాందాపురానికి చెందిన సొంత బాబాయిని హత్య చేసిన కేసులో నిందితుడుగా ఉన్నాడు. పానగల్‌కు చెందిన ఆర్‌ఎంపీపై హత్యాయత్నం కేసులోనూ కీలక నిందితుడు. గ్రామంలోని మహిళలను వేధింపులకు గురి చేస్తుండే వాడని గ్రామస్తులు తెలిపారు. గతంలో గ్రామానికి చెందిన పలువురు మహిళలను కిడ్నాప్ చేసిన కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నాడు.