kanagal
-
పెళ్లి కుదిరింది.. 9 రోజుల్లో నిశ్చితార్థం ఉందని చెప్పిన వినలేదు..
సాక్షి, నల్గొండ: తనకు పెళ్లి కుదిరింది.. మరో తొమ్మిది రోజుల్లో నిశ్చితార్థం ఉందని చెప్పినా.. ఆ ప్రేమోన్మాది వినిపించుకోలేదు.. పైగా ఇంట్లో యువతి ఒంటరిగా ఉన్న సమయంలో వెళ్లి నన్నే ప్రేమించాలని ఒత్తిడి చేశాడు.. ఆపై శారీరకంగా కలవాలంటూ అత్యాచారయత్నం చేశాడు. బాధితురాలు కేకలు వేయడంతో పరారయ్యాడు. అయితే పరువు పోయిందని భావించిన ఆ యువతి గడ్డిమందు తాగి చివరకు ప్రాణాలు విడిచింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలిలా.. నల్లగొండ జిల్లా కనగల్ మండలం లింగాలగూడెం గ్రామానికి చెందిన కదిరే శంకర్, మంగమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. చిన్న కూతురు మౌనిక(20) నల్లగొండలోని మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం ఫైనలియర్ చదువుతోంది. చదవండి: Viveka Case: కావాలనే ఇరికించారు.. బెయిల్ ఇవ్వండి ప్రేమించాలని మూడు నెలలుగా వేధింపులు నల్లగొండ మండల పరిధిలోని జి.చెన్నారం గ్రామానికి చెందిన బొల్లం శ్రవణ్ మూడు నెలల నుంచి మౌనికను ప్రేమించమని వెంటపడుతున్నాడు. ఆమె ఫోన్ నంబర్ తీసుకుని అసభ్యకరంగా మెసేజ్‌లు పెడుతున్నాడు. ప్రేమించకపోతే చంపుతానంటూ బెదిరింపులకు దిగాడు. ఇదే క్రమంలో శ్రవణ్ ఈ నెల 9న మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో మౌనిక ఇంటికి చేరుకున్నాడు. ప్రేమించమని, శారీరకంగా కలవాలని చేయి పట్టుకోవడంతో మౌనిక కేకలు వేసింది. దీంతో శ్రవణ్ పారిపోతుండగా చుట్టు పక్కలవారు, తండ్రి శంకర్ గమనించి అతన్ని మందలించారు. ఈ ఘటనతో పరువుపోయిందని తీవ్ర మనస్తాపం చెందిన మౌనిక అదే రోజు సాయంత్రం గడ్డి మందు తాగింది. వాంతులు చేసుకుంటుండగా మౌనిక తమ్ముడు జాని గమనించి నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. అక్కడ చికిత్స పొందుతున్న మౌనిక శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందింది. మృతురాలి తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు శ్రవణ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అంతిరెడ్డి తెలిపారు. -
సినిమా స్టోరీని తలదన్నే నిజ జీవిత ఘటన..
నాటకీయ పరిణామాల మధ్య 24 గంటల వ్యవధిలో ఓ యువతి రెండు పెళ్లిళ్లు చేసుకోవడం చర్చనీయాంశమైంది. ప్రేమ, పెళ్లి విషయంలో ఈ తరం పిల్లలు ఎంత కచ్చితంగా ఉంటున్నారో, వాళ్లను అర్థం చేసుకునే విషయంలో తల్లిదండ్రులు కూడా మారుతున్నారనడానికి ఉదాహరణ. కనగల్: ఇదో విచిత్రం.. ఓ యువతికి పెద్దలు కుదిర్చిన పెళ్లి జరిగిన మర్నాడు ప్రియుడితో మరోసారి వివాహం జరిగింది. రెండు రోజుల వ్యవధిలోనే ఆమెకు రెండు పెళ్లిళ్లు జరిగాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా కనగల్ మండలంలో చోటుచేసుకుంది. శాబ్దులాపురానికి చెందిన మౌనిక కుటుంబం పదేళ్లుగా కురంపల్లిలో నివాసం ఉంటోంది. దేవరకొండకు చెందిన యువకుడితో మౌనికకు పెద్దలు కుదిర్చిన పెళ్లి శుక్రవారం జరిగింది. అయితే వరుసకు మామ అయిన కొండభీమనపల్లికి చెందిన రాజేశ్, మౌనిక కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వారి ప్రేమకు పెద్దలు అంగీకరించకలేదు. దీంతో మౌనిక పెద్దల నిర్ణయానికి కట్టుబడి వారు నిశ్చయించిన వరుడితో తాళి కట్టించుకుంది. సాయింత్రం అప్పగింతల సమయంలో తాను ఎప్పటినుంచో ప్రేమిస్తున్న వరుసకు మామ అయిన రాజేశ్‌ను చూసి తట్టుకోలేక అందరి సమక్షంలో అతడిని పట్టుకుని ఏడ్చింది. ఇది చూసి కంగుతిన్న మౌనిక భర్త పంచాయితీ పెట్టాడు. ఈ వ్యవహారం పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లింది. చివరకు పెద్ద మనుషుల సమక్షంలో పెళ్లిని రద్దు చేసుకుని వాళ్లు వెళ్లిపోయారు. కాగా, శనివారం మౌనిక–రాజేశ్‌లకు గుడిలో ఇరువురి బంధువుల సమక్షంలో ప్రేమపెళ్లి జరిపించారు. -
పొదుపు పేర.. మోసం!
సాక్షి, నల్లగొండ: మూడేళ్ల పాటు పొదుపు చేసుకుంటే అదనంగా డబ్బులు వస్తాయి అంటూ వృద్ధులకు మాయ మాటలు చెప్పాడు ఓ పోస్టల్ అధికారి. ఆయన మాటలు నమ్మి దాదాపు వంద మంది వృద్ధులు పెన్షన్ డబ్బులతో మరికొన్ని కలిపి ఇచ్చారు. ఇలా పదినెలలుగా కడుతూ వస్తున్నారు. సదరు పోస్టల్ అధికారి తీసుకెళ్లి జమ చేస్తున్నానని ఆ వృద్ధులను నమ్మించాడు. మూడు నెలలుగా సదరు అధికారి రాకపోవడంతో అనుమానం వచ్చి పోస్టాఫీస్‌కు వెళ్లి ఆరా తీయగా మీ అకౌంట్లలో ఎటువంటి డబ్బులు జమ కాలేదు.. డబ్బులు వసూలు చేసిన పోస్టల్ అధికారిని విధులనుంచి తొలగించామని చెప్పడంతో వృద్ధులు లబోదిబోమని కన్నీటి పర్యంతమయ్యారు. తాము మోసపోయామని గ్రహించి సోమవారం కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్‌లో జాయింట్ కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ ముందు గోడు వెల్లబోసుకున్నారు. ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... కనగల్ మండలం బోయినపల్లి గ్రామంలో పోస్టల్ అధికారి ప్రసాద్ ప్రతి నెలా వివిధ రకాల సామాజిక పెన్షన్లను పంపిణీ చేసేవాడు. ఈ క్రమంలో పింఛన్ తీసుకుంటున్న వృద్ధులను మాయమాటలతో నమ్మించాడు. ‘ప్రతి నెలా పోస్టాఫీస్‌లో రూ.వెయ్యి చొప్పున మూడేళ్ల పాటు జమ చేసుకుంటే మీరు కట్టిన డబ్బులతో కలిపి అదనంగా మొత్తం రూ.50వేలు వస్తాయి.. మీరు చేతగాని వేళల్లో హాయిగాబతికేందుకు పనికి వస్తాయి’ అంటూ మాటలు చెప్పి వారి నుంచి పొదుపు కట్టించాడు. గ్రామంలో దాదాపు వంద మంది మహిళలు రూ.500 నుంచి రూ.3వేల వరకు ప్రతి నెలా పొదుపు డబ్బులు కడుతూ వస్తున్నారు. ప్రతి నెలా పెన్షన్లు అక్కడే వారికి ఇవ్వడం, ఇచ్చిన డబ్బులనే తిరిగి పొదుపు పేర పోస్టల్ అధికారి ప్రసాద్ లబ్ధిదారులనుంచి కట్టించుకున్నాడు. పోస్టాఫీసుల్లో కొందరికి అకౌంట్ బుక్‌లు తీశాడు. ఆ బుక్కుల్లోనే ప్రతి నెలా వారు కట్టిన డబ్బులకు సంబంధించి బుక్కులో ఎంత కట్టారు, ఎంత జమ అవుతుంది రాస్తూ వస్తున్నాడు. కొందరి మహిళల మొత్తం పొదుపు చేసుకున్నవి రూ.5వేల నుంచి రూ.40 వేల వరకు ఉన్నాయి. మూడు నెలలుగా రాని పోస్టల్ అధికారి మూడు మాసాలుగా వృద్ధాప్య పెన్షన్లు పంచేం దుకు ప్రసాద్ రావడం లేదు. అతనికి ఫోన్ చేసినా ఫోన్ కలవడంలేదు. కొత్త వ్యక్తులు వస్తున్నారు. దీంతో కనగల్ మండల కేంద్రంలో ఉన్న పోస్టాఫీస్‌కు వెళ్లి తమ పాస్ బుక్‌లలో ఉన్న డబ్బులు కావాలని అడిగారు. వాటిని పరిశీలించిన అధికారులు అకౌంట్లలో జమ కాలేదని చెప్పడంతో తెల్లముఖం వేశారు. ‘ప్రతి నెలా మీరు పంపిన వ్యక్తే వచ్చి ఒక చేత్తో పెన్షన్లు ఇచ్చి మరో చేత్తో పొదుపు కట్టించుకున్నాడు... డబ్బులు లేవంటే ఎలా’ అని ప్రశ్నించారు. ‘అతన్ని ఉద్యోగంనుంచి తీసేశాం. మీరు చండూరు పోస్టాఫీస్‌కు వెళ్లి అడగండి’ అని సలహా ఇచ్చారు. దీంతో వృద్ధులు చండూరు వెళ్లి అడగగా, పరిశీలించిన అధికారులు అకౌంట్లలో జమ కాలేదని చెప్పారు. కేవలం మీ దగ్గర ఉన్న పాస్‌బుక్కుల్లో రాశాడు కానీ అకౌంట్లలో జమ చేయలేదని తెలిపారు. దీంతో మోసపోయామని తెలుసుకుని సింగం లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. జాయింట్ కలెక్టర్ వనమాల చంద్రశేఖర్‌ను కలిసి గోడును వెల్లబోసుకున్నారు. పోస్టల్ అధికారి మోసం చేశాడని, న్యాయం చేయాలంటూ అభ్యర్థించారు. జేసీ.. వెంటనే పోస్టల్ సూపరింటెండెంట్‌ను ఫోన్లో సంప్రదించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం వారు ఎస్పీ ఏవీ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన పూర్వాపరాలు తెలుసుకుని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని డీఎస్పీకి ఆదేశించారు. మోసం చేశాడు.. పెన్షన్ డబ్బులు ఇచ్చే వ్యక్తే కదా ఆయనే పొదుపు కట్టించుకుంటే మా డబ్బులు ఎక్కడికి వెళ్తాయి అనుకున్నాం. నమ్మకంతో పొదుపు చేశాం. పాస్ పుస్తకాల్లో డబ్బులు కట్టించుకున్నట్లు రాశాడు. పోస్టాఫీస్ వాళ్లు డబ్బులు లేవంటున్నారు. వచ్చిన పెన్షన్ అంతా తినీ తినక పొదుపు చేసుకుంటే మోసం చేశాడు. – దేవకమ్మ, బోయినపల్లి, కనగల్ ఈడంగ ఇచ్చి ఆడంగ తీసుకున్నడు పెన్షన్ డబ్బులు ఈడంగ ఇచ్చి ఆడంగ తీసుకున్నడు. పొదుపు చేసుకుంటే మరిన్ని డబ్బులు వస్తాయన్నాడు. డబ్బులు తీసుకుందామని వెళ్తే వారు లేవంటున్నారు. మాకు న్యాయం చేయాలి. – జెట్టి వీరమ్మ, బోయినపల్లి, కనగల్ మాకు న్యాయం చేయాలి గవర్నమెంట్ ఇచ్చిన పెన్షన్ డబ్బులు దాచుకుని పొదుపు చేసుకుంటే పోస్టల్ అధికారి మోసం చేశాడు. మా డబ్బులు తీసుకొని పోస్టాఫీస్‌లో కట్టలేదు. మాకు మూడు నెలల నుంచి డబ్బులు తీసుకెళ్తలేడని పోస్టాఫీస్‌కు వెళ్తే ఆయన లేడని తెలిసింది. డబ్బులు ఇవ్వమంటే కట్టలేదంటున్నారు. డబ్బులు స్వాహా చేసిన అధికారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలి. – సైదమ్మ, బోయినపల్లి, కనగల్ -
హత్యకు కలిసొచ్చిన పార్టీ మీటింగ్..!
సాక్షి, కనగల్ (నల్లగొండ) : వివాహిత హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అదనపు కట్నం కోసమే కట్టుకున్న భర్తే ఘాతుకానికి తెగబడ్డాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. హత్యోదంతానికి సహకారం అందించిన ప్రధాన నిందితుడి తల్లిదండ్రితో పాటు ఇద్దరు సోదరులను కూడా అరెస్ట్ చేశారు. శనివారం స్థానిక పోలీస్‌స్టేషనలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రవీందర్ కేసు వివరాలు వెల్లడించారు. ప్రేమించి పెళ్లి చేసుకుని... శేరిలింగోటం గ్రామానికి చెందిన కన్నెబోయిన సైదులు అదే గ్రామంలో ఉంటున్న కవిత(21)ను ఏడాది క్రితం మే నెలలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరు అన్నల పెళ్లిళ్లు కాకముందే సైదులు మొదట వివాహం చేసుకోవడం అప్పట్లో గ్రామంలో చర్చనీయాంశమైంది. ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం కావడంతో రెండు కుటుం బాలు మిన్నకున్నాయి. వరకట్నం రాలేదని.. ఈ క్రమంలో సైదులు ఇద్దరు సోదరుల వివాహాలు అయ్యాయి. అయితే వారికి వరకట్నం రావడంతో సైదులుకు కట్నంపై ఆశ కలిగింది. కవితను పెళ్లి చేసుకోవడంతోనే తనకు కట్నం రాలేదనుకున్న సైదులు ఆరునెలల కాపురం తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్న కవితను కట్నం కోసం చిత్రహింసలకు గురిచేయడం మొదలుపెట్టాడు. సైదులు చేస్తున్నది తప్పు అని చెప్పాల్సిన అతని తల్లిదండ్రులతోపాటు ఇద్దరు అన్నలు సహకరించారు. గ్రామంలోనే ఉంటున్న కవిత తల్లిదండ్రులు తరచు తమ కూతురిని కొట్టడంతో పలుమారు గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఎన్నికల తర్వాత మట్లాడుదామని గ్రామపెద్దలు చెప్పడంతో కవిత పుట్టింటికీ వెళ్లిపోయింది. పంచాయితీలోనే పరుశ పదజాలంతో సైదులుతోపాటు కుటుంబ సభ్యులు దూషించారు. అప్పటి నుంచి కవిత అడ్డుతొలగించుకునేందుకు పథకం పన్నారు. హత్యకు కలిసొచ్చిన మీటింగ్ హత్య జరిగిన రోజు జిల్లాకేంద్రంలో ఓ పార్టీ ఎన్నికల బహిరంగ సభ ఉండటంతో మెజార్టీ గ్రామస్తులు అక్కడకు వెళ్లారు. అదేరోజు కవిత తల్లిదండ్రులు అబ్బరబోయిన నాగయ్య, వెంకటమ్మలు తమ బంధువుల ఇంట్లో జరిగే ఓ కార్యానికి వెళ్లారు. గ్రామంలో జనం పలుచగా ఉండటం, కవిత తల్లిదండ్రులు ఊర్లో లేకపోవడం, ఒంటరిగా ఉన్న కవితను హత్య చేసేందుకు ఇదే అదునుగా సైదులు భావించాడు. మధ్యాహ్న సమయంలో తల్లిదండ్రులు కౌలు చేస్తున్న పత్తిచేను వద్ద ఉన్న పశువులకు నీళ్లు తాపేందుకు వెళుతుండగా మార్గమధ్యలో కవితను అటకాయించిన సైదులు నీతో మాట్లాడాలని చెప్పి ఆమె వెంట పత్తిచేను వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటలు పెరిగి ఘర్షణ జరిగింది. అప్పటికే అంతం చేయాలని భావించిన సైదులు కవిత ఛాతిపై పిడిగుద్దులు గుద్ది దారుణానికి ఒడిగట్టాడు. హత్య జరిగిన అనంతరం సైదులు రెండో అన్న పరమేశ్ కొద్ది దూరంలో బైక్‌పై ఉండగా అక్కడకు చే రుకుని అన్నదమ్ములిద్దరు అక్కడ నుంచి పారిపోయారు. అప్పటికే సైదులు కుటుంబ సభ్యులకు సమాచారం చేరడంతో అదేరోజు పశువులు, జీవాలను తోలుకుని వెళ్లి శివన్నగూడెంలో విక్రయించారు. అప్పటి నుంచి అందరూ పరారీలో ఉన్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు. సైదులు తోపాటు ఇద్దరు అన్నలు నరేశ్, పరమేశ్, తల్లిదండ్రులు అం జయ్య, శంకరమ్మలను రి మాండ్‌కు తరలించి నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో కనగల్ ఎస్సై ఎన్. శ్రీను, కాని స్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు. -
ఆ గ్రామంలో అన్నీ సమస్యలే..!
సాక్షి, కనగల్ : మండలంలోని అమ్మగూడెం పరిధి కుమ్మరిగూడెంకు వెళ్లే దారిలో కంపచెట్లు రహదారికి ఇరుపక్కల పెరగడంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఊరు తూర్పు రోడ్డు మొత్తం కంపచెట్లుతో అల్లుకుపోవడంతో స్థానికులతోపాటు ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. గ్రామంలోకి వెళ్లాలంటే కంపచెట్లు అడ్డుగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొటున్నారు.చెరువు కట్టకు ఇరువైపులా పెరిగిన చెట్లు కంపచెట్లకుతోడు చిన్నపాటి వర్షానికే మట్టి రోడ్డు అంతా బురదమయం అవుతుండడంతో ప్రయాణం ప్రాణసంకటంగా మారింది. కంపచెట్లు తొలగించి రోడ్డును అభివృద్ధి చేయాలని గ్రామస్తులు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పాలకులు పట్టించుకోవడంలేదు. దీనితోపాటు గ్రామానికి ఎగువన ఉన్న చెరువు కట్టపై నుంచి నిత్యం వందలాది మంది రైతులు రాకపోకలు సాగిస్తుంటారు. కట్టపై ఇరుపక్కల కంపచెట్లు పెరగడంతో రైతులు వ్యవసాయ భూములకు వెళ్లేందుకు ఆటంకంగా మా రింది. కంపచెట్లను తొలగించాలని అమ్మగూడెం, కుమ్మరిగూడెం గ్రామాల ప్రజలు కోరుతున్నారు. సమస్యలతో సావాసం: కుమ్మరిగూడెంలో ఒక్క డ్రెయినేజీ లేదు. దీంతో మురుగు వీధుల్లో పారుతుండడంతో ఈగలు, దోమలు ప్రబలుతున్నాయి. నల్లా పైపులు పలుచోట్ల పగిలి నీరు కలుషితం అవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామంలోకి కృష్ణాజలాల పైపులైన్ వేసినప్పటికీ రెండేళ్లుగా ప్రజలకు కృష్ణాజలాలు అందడంలేదు. ఎయిర్ వాల్వ్ దగ్గర నీళ్లు రా కుండా చేయడంతో పలుమార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిత్యం రూ. 10 వెచ్చింది శుద్ధ జలాలు కొనుక్కొని తాగాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో సీసీ రోడ్లతోపాటు డ్రెయినేజీలు నిర్మించి, కంపచెట్లను తొలగించి గ్రామానికి దారి సౌకర్యం మెరుగుపర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. అదేవిధంగా గ్రామానికి కృష్ణాజలాలు సరఫరా అయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కంపచెట్లను తొలగించాలి: గ్రామంలోకి వచ్చే దారిలో ఇరుపక్కల కంపచెట్ల పెరిగాయి. చెరువుకట్టపై సైతం కంపచెట్లు పెరిగి రాకపోకలకు అడ్డంకిగా మారింది. కంపచెట్లను తొలగించి గ్రామంలోకి వచ్చే రోడ్డును అభివృద్ధి చేయాలి. –లక్ష్మీనారాయణ, కుమ్మరిగూడెం కృష్ణాజలాలు అందించాలి: గ్రామంలోకి కృష్ణాజ లాలు రాకపోవడంతో తాగునీటికి అవస్థలు పడుతున్నాం. గ్రామంలోకి కృష్ణాజలాలను స రఫరా చేయాలి. మా గ్రామం దాటి ఎం.గౌరారంకు కృష్ణాజలాలు వెళుతున్నా మాకు మాత్రం కృష్ణాజలాలు అందడంలేదు. సమస్యలను పరిష్కరించాలి. –తిరుమలేశ్, కుమ్మరిగూడెం -
పొనుగోడు చెరువుకు నీరందించేందుకు కృషి
కనగల్ : ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వకు లిప్టు ఏర్పాటు చేసి పొనుగోడు చెరువుకు నీరందిస్తామని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి అన్నారు. శనివారం ఆయన ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వపై లిప్టు ఏర్పాటు చేసే ప్రదేశంతోపాటు చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా దుబ్బాక మాట్లాడుతూ తలాపున నీరున్నా తాగడానికి చుక్కలేదు అన్నచందంగా పొనుగోడు ప్రజల పరిస్థితి మారిందన్నారు. గ్రామ చెరువుకు నీరందించాలంటే లిప్టు ఏర్పాటు చేయడమెక్కటే మార్గమైనందున లిప్టు మంజూరుకు కృషి చేస్తానన్నారు. అంతకుముందు దోరెపల్లికి చెందిన నకిరెకంటి బచ్చమ్మ మృతి చెందడంతో మృతురాలి కుటుంబ సభ్యులను దుబ్బాక పరామర్శించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎస్కే. కరీంపాష, పొనుగోడు సర్పంచ్ పులకరం క్షేత్రయ్య, మాజీ ఎంపీటీసీ, అడిషనల్ పీపీ నాంపల్లి నర్సింహ, నాయకులు దోటి శ్రీను, జోగు వెంకటేశం, ఊశయ్య, శ్రీనివాస్‌రెడ్డి, జ్వాల వెంకన్న, వెంకట్‌రెడ్డి, దిలీప్‌రెడ్డి, బాల్‌రెడ్డి, కట్ట స్వామి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
చెరువు నీటితో ఇక్కట్లు..!
కనగల్ : అన్ని గ్రామాల ప్రజలు చెరువులు నిండక అసంతృప్తితో ఉంటే కురంపల్లి ప్రజలు మాత్రం చెరువు నిండి ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి ఆనుకుని ఎగువ భాగంలో చెరువు ఉంది. ఇటీవల మిషన్ కాకతీయ పనుల్లో చెరువును అభివృద్ధి చేశారు. చెరులోకి భారీగా వరద నీరు చేరడంతో చెరువు అలుగుపోస్తుంది. ఈ క్రమంలో చెరువు అలుగు నీరంతా గ్రామం మధ్యలోంచి పారుతున్నందున ఇళ్లలోకి రావడంతోపాటు రోడ్లుపై భారీగా వరద ప్రవహిస్తోంది. దీంతో గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కనగల్ –చండూరు ప్రధాన రహదరికి అడ్డంగా నీరంతా పారతుండటంతో రోడ్డు కొతకు గురికావడంతోపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. చెరువు నిర్మాణం సమయంలో అలుగు నీరు పారే ప్రాంతంలో ఇళ్లు లేనప్పటికీ క్రమంగా గ్రామ జనాభా పెరుగుతూ నీరు పారే ప్రదేశంలో సైతం ఇళ్లును నిర్మించుకున్నారు. తమ పరిస్థితి కక్కాలేక మింగాలేక అన్న చందంగా దాపురించిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెవులు అలుగునీరు పోయేందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటుచేయాలని కోరుతున్నారు. -
అంత్యక్రియలకు వెళుతూ..
కనగల్(నల్గొండ): అంత్యక్రియలకు వెళుతూ మరో కుటుంబం అనంతలోకాలకు వెళ్లింది. ఈ సంఘటన కనగల్ మండలం సాగర్రోడ్డులోని బాబసాహెబ్‌గూడెం స్జేజీ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. చండూర్ సీఐ రమేశ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... హాలియాలో బంధువు మృతి చెందడంతో డిండి మండలం గోనబోయినపల్లి, బొగ్గులదొనలకు చెందిన 9 మంది ఆటోలో నల్లగొండ నుంచి సాగర్ రోడ్డులో వెళుతుండగా బాబసాహెబ్‌గూడెం స్టేజీ సమీపంలోకి రాగానే ముందుగా వెళుతున్న బైక్ ఆకస్మికంగా కిందపడింది. దీనిని తప్పించబోయే క్రమంలో ఆటో అదుపుతప్పి ఫల్టీలు కొడుతూ ఎదురుగా వస్తున్న కారుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న డిండి మండలం గోనబోయినపల్లికి చెందిన పదర రాము(30), అతని భార్య రేణుక(24) కొడుకు వెంకట్(3) మృతి చెందారు. రేణుక అక్కడికక్కడే మృతిచెందగా రాము, వెంకట్ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందారు. రాము పెద్ద కొడుకు చరణ్‌తేజ్ తలకు గాయమై ప్రాణాలతో బయటపడగా వదిన పుష్పకు తీవ్రగాయాలయ్యాయి. అదే మండలం బొగ్గులదొనకు చెందిన రాము అత్త ముప్పళ్ల చంద్రకళ, ముప్పళ్ల విజయతోపాటు వారి పిల్లలు హరిప్రసాద్, హారికలకు తీవ్రగాయాలయ్యాయి. రాము తన కుటుంబంతో గత కొంత కాలంగా హైదరాబాద్‌లో ఉంటూ సొంత ఆటోను నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ప్రమాదంతో ఆటో నుజ్జు నుజ్జు కావడంతోపాటు కారు ముందు భాగం దెబ్బతింది. సంఘటనా స్థలాన్ని నల్లగొండ డీఎస్పీ సుధాకర్ పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. -
ఆలయంలో బంగారు రంగు కూర్మము ప్రత్యక్షం
కనగల్ : మండలంలోని శేరిలింగోటం చెరువు కట్టపై ఉన్న శ్రీ కట్టమైసమ్మ అమ్మవారి ఆలయంలోకి మంగళవారం బంగారు రంగుతో ఉన్న తాబేలు వచ్చింది. పక్కనే చెరువు ఉన్నందున అందులోంచి తాబేలు వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. కూర్మానికి స్థానికులు కుంకుమ చల్లి పూజలు చేశారు. విష్ణుమూర్తి దశావతారాల్లో కూర్మావతారం ఒకటైనందున ఆలయంలో తాబేలు ప్రత్యక్షం కావడంతో భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పోషమల్ల లింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు ఎంచుకున్న రంగాల్లో రాణించాలి
కనగల్ : విద్యార్థులు ఎంచుకున్న రంగాల్లో రాణించాలని హైదరాబాద్ జేఎన్టీయూ కోఆర్డినేటర్ పి.చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం చర్లగౌరారం పరిధిలోని ఎస్‌ఆర్‌టీఐఎస్‌టీ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతి«థిగా హాజరై మాట్లాడారు. ఇంజనీరింగ్‌లో ప్రవేశం పొందిన మొదటి సంవత్సరం విద్యార్థులు సబ్జెక్టులపై అవగాహన కలిగి విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. అనంతరం కళాశాల వైస్ చైర్మన్ ఎంసీ కోటిరెడ్డి, కళాశాల డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మూల దయాకర్‌రెడ్డి, యానాల ప్రభాకర్‌రెడ్డిలు మాట్లాడుతూ స్వామి రామానంద తీర్థ ఎడ్యుకేషనల్ సొసైటీలో అభ్యసించిన విద్యార్థులు దేశవిదేశాల్లో మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారన్నారు. అంతకుముందు జేఎన్టీయూ కోఆర్డినేటర్‌ను శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బి.హరినాథరెడ్డి, హెచ్ఓడీలు గిరీశ్‌రెడ్డి, హైమావతి, టి.మధు, శశిదర్‌రెడ్డి, శ్రీనివాస్‌కుమార్, ధర్మ, భార్గవ్‌కుమార్, టీపీఓ, శ్రీనివాస్, రవికుమార్, రాజారాంరెడ్డి, బాబా నసీరోద్దీన్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
మంత్రులు రాజీనామా చేయాలి: గోలి
కనగల్ : రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతతోనే ఎంసెట్ పేపర్ –2 లీకైనందున నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితోపాటు ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిలు తక్షణమే రాజీనామా చేయాలని బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈనెల 7వ తేదీన హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే మోదీతో మనం మహాసమ్మేళనం విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం మండలకేంద్రంలో వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోలి మాట్లాడుతూ భారత ప్రధాని ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు మిషన్ భగీరథతోపాటు ఇతర ప్రభుత్వ పథకాలను ప్రారంభించేందుకు గజ్వేల్‌కు వస్తున్నట్లు వివరించారు. అనంతరం ఎల్బీ స్టేడియంలో బీజీపీ కార్యకర్తలు, నాయకులతో మహా సమ్మేళనం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం ఎరువుల ధరలు తగ్గించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో డీలర్లు అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తున్నారని తెలిపారు. ఈనెల 4వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అధ్యక్ష హోదాలో నల్లగొండకు మొదటిసారి వస్తున్నట్లు తెలిపారు. ఆదే రోజు జిల్లా అధ్యక్షుడిగా సంకినేని వెంటేశ్వర్రావు ఎన్నిక కానున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పోతెపాక సాంబయ్య, చెదురుపల్లి సైదులు, తిరందాసు కనకయ్య, పోలోజు భిక్షమాచారి, పోతెపాక లింగస్వామి, యాకాలపు కొండల్, చేపూరు షణ్ముకాచారి, నందకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
యువకుడి దారుణ హత్య
కనగల్ :మండలంలోని తొరగల్ పరిధిలోని గజంగరాయగూడెం (సీతమ్మగూడెం) సమీపంలో ఆదివారం రాత్రి యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. రోడ్డువెంట మృతదేహం పడిఉండడాన్ని సోమవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో హత్య ఉదంతం వెలుగు చూసింది. స్థాని కులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తొరగల్ గ్రామానికి చెందిన పోశంరెడ్డి గోవర్దన్‌రెడ్డి(29)ని గుర్తు తెలియని వ్యక్తులు తొరగల్-తేలకంటిగూడెం గ్రామాల మధ్య రోడ్డు పక్కన హత్య చేశారు. హత్య జరిగిన ప్రదేశంలో మద్యం సీసాలు పడి ఉండడంతో మద్యం మత్తులో హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. హతుడి స్వస్థలం నాంపల్లి మండలంలోని పెద్దమాందాపురం. అతడి తల్లి నారమ్మ రెండు దశాబ్దాల క్రితం భర్తను వదిలేసి ఇద్దరు పిల్లలతో కలిసి తన తండ్రివద్దకు వచ్చి ఉంటోంది. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చండూరు సీఐ సుబ్బిరామిరెడ్డి, కనగల్ ఎస్సై పరమేశ్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. హతుడు గతం లో చేసిన నేరాల నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చని వారు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అతి కిరాతంగా హత్య గుర్తు తెలియని వ్యక్తులు గోవర్దన్రెడ్డిని అతి కిరాతకంగా హత్య చేసినట్లు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తే తెలుస్తోంది. మెడ , ముఖం, తలపై గోడ్డలితో విచక్షణా రహితంగా నరికారు. తలపై బండ రాయిని మోది హత్య చేశారు. చాలా సేపు చిత్రహింసలు పెట్టి మరీ చంపినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. హతుడి మర్మాంగంపై, ఎడ మ చేయి, నడుముపై పలు చోట్ల కత్తి గాట్లు ఉన్నాయి. పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్వాడ్‌తో హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. గత చరిత్ర నేరమయం హతుడు ప్రస్తుతం లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడి గత చరిత్ర పూర్తిగా నేరమయంగా ఉంది. కౌమార దశలోనే కృష్ణపట్టె దళానికి సానుభూతి పరుడిగా పనిచేసి లొంగిపోయాడు. తొమ్మిది సంవత్సరాల క్రితం కతాల్‌గూడెం సమీపంలో పెద్దమాందాపురానికి చెందిన సొంత బాబాయిని హత్య చేసిన కేసులో నిందితుడుగా ఉన్నాడు. పానగల్‌కు చెందిన ఆర్ఎంపీపై హత్యాయత్నం కేసులోనూ కీలక నిందితుడు. గ్రామంలోని మహిళలను వేధింపులకు గురి చేస్తుండే వాడని గ్రామస్తులు తెలిపారు. గతంలో గ్రామానికి చెందిన పలువురు మహిళలను కిడ్నాప్ చేసిన కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నాడు. -
వెంటాడి.. వేటాడి..
కనగల్ :కనగల్ మండలం చిన్నమాదారం గ్రామ పరిధిలోని కుమ్మరిగూడెంలో మంగళవారం ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. హతులు నల్లగొండకు చెందిన ఎస్కే గౌసొ ద్దీన్(35), బొంద రవికుమార్ (36)గా పోలీసు లు గుర్తించారు. నిందితులు పదునైన ఆయు దాలతో దాడి చేసి అతి కిరాతకంగా గొడ్డలిలో నరికి చంపారు. కళ్లలో కారం కొట్టి మెడ, ము ఖంపై విచక్షణారహితంగా గొడ్డలితో నర కడంతో రక్తపుమడుగులో కొట్టుకుంటూ అ క్కడికక్కడే మృతిచెందారు.నల్లగొండ డీఎస్పీ రాంమోహన్‌రావు సంఘటన స్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అయితే ఈ హత్యలకు ఆర్థిక లావాదేవీలే కారణంగా తెలుస్తోంది. జిల్లా కేం ద్రానికి చెందిన ఎస్కే గౌసొద్దీన్ కనగల్ మం డలం కుమ్మరిగూడేనికి చెందిన మల్లికంటి వెం కన్న అలియాస్ వెంకటేశ్వర్లుకు మూడేళ్ల క్రితం రూ. 6 లక్షలు అప్పుగా ఇచ్చాడు. అయితే వెం కన్న ఫైనాన్స్ ఎత్తివేయడంతో తన డబ్బులు ఇవ్వాలని గౌసొద్దీన్ ఒత్తిడి పెంచసాగాడు. ఈ నేపథ్యంలో వెంకన్న రూ. 4లక్షల వరకు గౌసొ ద్దీన్‌కు ముట్టజెప్పాడు. మిగతా డుబ్బు ఈ నెల 5వ తేదీన చెల్లించేలా ఒప్పందం కుదుర్చు కున్నారు. దీంతో గౌసొద్దీన్ రామగిరికి చెందిన తన స్నేహితుడు రవికుమార్‌తో కలిసి ఉదయం బైక్‌పై కుమ్మరిగూడేనికి వచ్చారు. అయితే డ బ్బుల విషయంలో వెంకన్నకు గౌసొద్దీన్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో వెంకన్న అతడి తండ్రి రాములు, సోదరుడు యాదగిరి కలిసి గొడ్డళ్లు ఇతరత్రా ఆయుధా లతో గౌసొద్దీన్, అతడి స్నేహితుడు రవికుమా ర్‌పై దాడిచేశారు. దీంతో వారు అక్కడి కక్కడే మృతిచెందారు. విషయం బయటకు పొక్క క ముందే నిందితులు అక్కడి నుంచి పరార య్యా రు. ఇరుగుపొరుగు వారు చూసి పోలీసు లకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలాన్ని డీఎ స్పీ రాంమోహన్‌రావు పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కనగ ల్ మండలం కుమ్మరిగూడెంలో మంగళవారం జరిగిన దారుణ హత్యలకు ఆర్థిక లావాదేవీలే కారణంగా తెలుస్తోంది. జిల్లా కేంద్రానికి చెం దిన గౌసొద్దీన్ ఫైనాన్స్ నిర్వాహకుడైన కుమ్మరిగూడెం గ్రామానికి చెందిన వెంకన్నకు మూ డేళ్ల క్రితం 6 లక్షలు అప్పుగా ఇచ్చాడు. తదనంతరం నాలుగు లక్షల రూపాయలను వెంకన్న చెల్లించాడు. మిగతా రెండు లక్షల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వెంకన్న పథకం ప్రకారం గౌసొద్దీన్‌ను కుమ్మరిగూడేనికి పిలిపించి తన సోదరుడు, తండ్రితో కలిసి హత్య చేసినట్లు తెలుస్తోంది. పథకం ప్రకారమే.. జంట హత్యలు పథకం ప్రకారమే జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఫైనాన్స్ నిర్వాహకు డు వెంకన్నతో పాటు అతడి తండ్రి రాములు, తమ్ముడు యాదగిరి హత్యలో పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట ప్రాంతంలో హత్యలు జరిగినట్లు తెలిపారు. పదునైన ఆయుధాలు సిద్ధం చేసుకుని హతమార్చేందుకు పథకం పన్నినట్లు తెలుస్తోంది. మొదట పెనుగులాట జరి గిన అనంతరం ఇంట్లోనే గౌసొద్దీన్ కళ్లలో కా రం చల్లి వెంకన్న అతడి తండ్రి, తమ్ముడు కలిసి గొడ్డలితో మెడ, ముఖంపై బలంగా నరకడంతో రక్తపు మడుడుతో కొట్టుకుంటూ ప్రాణాలు వదిలాడు. గమనించిన గౌసొద్దీన్ స్నేహితుడు రవికుమార్ ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగెత్తగా సుమారు కిలోమీటర్ వెంటాడి కిరాతకంగా నరికి చంపారు. మృతుల కుటుంబాల్లో విషాదం ఇరువురు హత్యకు గురికావడంతో మృతుల కుటుం బాల్లో విషాదం అలముకుంది. హతులు గౌసొద్దీన్, రవికుమార్‌లు స్నేహితులు. ఇద్దరు హీరోహోండా షోరూంలో గౌసొద్దీన్ మోకానిక్‌గా, రవికుమార్ స్పేర్‌పార్ట్స్ విక్రయం వద్ద పనిచేశారు. రెండు సంవత్సరాల క్రితం గౌసొద్దీన్ షోరూంలోంచి బయటకు వచ్చి సొంతంగా జిల్లాకేంద్రంలోని రామగిరిలో బైక్ మోకానిక్ దుకాణం నిర్వహిస్తున్నాడు.సంవత్సరం క్రితం గౌసొద్దీన్‌కు వివాహం అయింది. రవికుమార్ సైతం షోరూంలోంచి బయటకు వచ్చి ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా గౌసొద్దీన్ స్వ గ్రామం తిప్పర్తి మండలం ఇందుగుల గ్రామం. పది సంవత్సరాల క్రితం నుంచి నల్లగొండలో స్థిరపడ్డాడు. -
అరుణకు కన్నీటి వీడ్కోలు
సాక్షి, నల్లగొండ/కనగల్, న్యూస్‌లైన్: ప్రేమోన్మాది చేతిలో కిరోసిన్ దాడికి గురై మృత్యువుతో ఆరు రోజులు పోరాడి ఆదివారం ప్రాణాలు కోల్పోయిన బీటెక్ విద్యార్దిని తలారి అరుణ(21) అంత్యక్రియలు సోమవారం ఆమె స్వగ్రామమైన కనగల్ మండలం కురంపల్లిలో అశ్రునయనాల మధ్య జరిగాయి. వివిధ పార్టీలు, దళిత సంఘాల నాయకులతోపాటు ప్రజలు పెద్దఎత్తున అంతిమ యాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు పలువురు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కనగల్‌లో 5 ఎకరాల ప్రభుత్వ భూమి మంజూరు చేయిస్తానని వారికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అరుణ కుటుంబసభ్యులను పరామర్శించిన వారిలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతా సాంబమూర్తి, గోలి మధుసూదన్‌రెడ్డి, టీడీపీ నేతలు మాదగోని శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి, వెంకటనారాయణగౌడ్, భిక్షంయాదవ్, అనూప్‌రెడ్డి, జియాఉద్దీన్, వెంకన్న, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ పెంటయ్య, లక్ష్మారెడ్డిలు ఉన్నారు. తెరుచుకోని విద్యాసంస్థలు ప్రేమోన్మాది నకిరేకంటి సైదులు చేతిలో దాడికి గురైన అరుణ మృతికి సంతాపంగా జిల్లాలో విద్యాసంస్థలు సోమవారం బంద్ పాటించాయి. నిందితులకు ఉరిశిక్ష విధించాలని ప్రభుత్వాన్ని విద్యార్థి లోకం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే మహిళలపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. ఆర్థిక చేయూత.. అరుణ తల్లిదండ్రులు ఈశ్వరయ్య, పిచ్చమ్మలకు ప్రభుత్వం తరఫున రూ. 2.50 లక్షల చెక్‌ను సాంఘిక సంక్షేమ శాఖ డీడీ వెంకటనర్సయ్య అందజేశారు. అంతేగాాక ఆరురోజులపాటు చికిత్స అవసరమైన డబ్బులు కూడా ప్రభుత్వమే భరించిందని ఆయన తెలిపారు. నిరసనలు... టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీలో బంద్ పాటించారు. ఆధ్యాపకులు, విద్యార్ధులు మౌనం పాటించారు. దీంతో యూనివర్సిటీలో జరుగుతున్న సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. డిపో నుంచి ఆర్టీసీ బస్సులు బయలుదేరకుండా ఆందోళనకారులు ధర్నా నిర్వహించారు. నల్లగొండ బార్ అసోసియేషన్ కోర్టు విధులు బహిష్కరించింది. అరుణ మృతికి కారణమైన నిందితునికి న్యాయసాయం అందించకూడదని న్యాయవాదులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు. భువనగిరిలోని ఎస్సీ దళిత మోర్చా ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షకు రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం సంఘీభావం తెలిపారు. ఎంఎస్ఎఫ్, ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. వలిగొం డలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో, కోదాడలో బీజే పీ మహిళా మోర్చా నిందితుడి దిష్టిబొమ్మకు నిప్పు పెట్టా రు. అరుణ మృతికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆర్డీఓకు విన తిపత్రం అందజేశారు. దామరచర్లలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించిన నిరసన తెలిపారు. నకిరేకల్‌లో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మానవహారం ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యాసంస్థలు బంద్‌చేశారు. నార్కట్పలిలో యూత్ కాంగ్రెస్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిం చారు. చిట్యాలలో టీఆర్ఎస్వీ, తెలంగాణ జాగృతి, టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ర్యాలీ చేపట్టారు.