సాక్షి, అనంతపురం: ‘పెళ్లయినా ఫర్వాలేదు. కానీ నన్ను ప్రేమించాలి. చిన్ననాటి నుంచి నిన్నే ప్రేమిస్తున్నా. నువ్వు నాతో మాట్లాడడం మానేస్తే ఎలా? ప్రేమించకపోతే కత్తితో గొంతు కోసుకుంటా’ అని ఓ వివాహితను బెదిరిస్తున్న యువకుడు చివరకు అన్నంత పనీ చేశాడు. కత్తితో తన గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటన శుక్రవారం అనంతపురం నగరంలోని కళ్యాణదుర్గం రోడ్డు పాపంపేటలో చోటు చేసుకుంది.
అనంతపురం రూరల్ పరిధిలోని ఎల్‌బీ నగర్‌కు చెందిన గోపాల్‌నాయక్ కుమారుడు బాలాజీ నాయక్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పూర్తి చేశాడు. అతని చిన్ననాటి స్నేహితురాలు పాపంపేటలో ఉంటోంది. ఆమెకు నాలుగేళ్ల క్రితమే వివాహమైంది. కానీ, బాలాజీ నాయక్ ప్రేమ పేరుతో ఆమెను వేధించేవాడు. విసిగిపోయిన ఆమె రెండు నెలల నుంచి మాట్లాడడం మానేసింది.
బాలాజీనాయక్ శుక్రవారం పాపంపేట చేరుకుని ఆమె స్నేహితురాలి భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లగానే లోపలికి వెళ్లి తనను ప్రేమించాలని మరోసారి వేధించాడు. తనకు వివాహమైందని, వేధించడం మానుకోవాలని చెప్పినా వినలేదు. చివరకు అదే ఇంట్లోని కత్తి తీసుకుని గొంతు కోసుకున్నాడు. భయాందోళనలకు గురైన ఆమె విషయాన్ని బాలాజీ నాయక్ సోదరులు ఎం.రవీంద్ర నాయక్, మని నాయక్‌కు తెలియజేసింది. వారు వెళ్లి చూడగా బాలాజీ నాయక్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. పోలీసుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: ఆర్‌జీఎఫ్.. ఇది మన కేజీఎఫ్)
Comments
Please login to add a commentAdd a comment