హత్య కేసు నిందితులతో పోలీసులు (ఫైల్ )
పులివెందుల : భవిష్యత్‌లో మంచి జీవితాన్ని గడపాల్సిన నిరుద్యోగ యువత ఇటీవల కాలంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులలో అనుకున్న లక్ష్యాన్ని చేరకపోగా వారి దారి పెడదారిపడుతోంది. ఇందుకు ఆర్థికపరమైన అంశాలు, దురలవాట్లకు లోనై తాము తల్లిదండ్రులను డబ్బులు అడగలేని పరిస్థితులలో చెడు సహవాసలతో మద్యం, గుట్కా, గంజాయి, డ్రగ్స్ తదితర దురలవాట్లకు బానిసలవుతున్నారు. డబ్బును అవలీలగా సంపాదించుకోవాలన్న పరిస్థితులలో యువత అసాంఘిక కార్యలాపాల వైపునకు దారి మళ్లుతోంది. అంతేకాక ఇటీవల కాలంలో కొంతమంది యువకులు దురదృష్టవశాత్తు కిరాయి హంతకులుగా మారుతున్న వైనాన్ని గమనిస్తున్నాం. ఇలాంటి పరిస్థితులలో పులివెందుల పట్టణంలో ఇటీవల జరిగిన కొన్ని హత్యల పరంపరలో 20 నుంచి 25 ఏళ్ల వయస్సుగల యువకులు కీలకంగా ఉండటం గమనార్హం.
నేరస్తులుగా మారుతున్న యువత: ఈ మధ్య కాలంలో పట్టణంలోని జయమ్మకాలనీలో రెండు హత్యలతోపాటు పెద్ద మసీదు వద్ద యువకుని గొంతు కోసి హతమార్చిన కేసులోనూ, వారం రోజుల క్రితం రంగేశ్వరరెడ్డి హత్య కేసులోనూ పాలుపంచుకున్నది అంతా 25 ఏళ్లలోపు ఉన్న యువకులే కావడం విశేషం. మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో శాంతి భద్రతల విషయంలో ప్రశాంతంగా ఉన్న పులివెందుల పట్టణంలో జరిగిన హత్యల ఉదంతాలు తార్కాణంగా నిలుస్తున్నాయి. ఇందులో ప్రేమ వ్యవహారాలు, పాత కక్షలు, ఆర్థికపరమైన చిన్నపాటి తగదాలు కూడా కారణాలుగా ఉండటం పరిస్థితి దయనీయమైన గుర్తుకు తెస్తోంది. ఇందుకు కొన్ని సహవాస దోషాలతో యువకుల తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో తమ కన్నబిడ్డలు భవిష్యత్‌లో తమకు ఆసారగా ఉంటారన్న ఆశతో వారికి అడినవన్నీ ఇస్తున్నా కొంతమంది యువకులు కొన్ని పరిస్థితులలో ఇలాంటి పరిస్థితుల వైపునకు దారి మళ్లడం దురదృష్టకరమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఇం దుకు చాలావరకు సంబంధిత యువకులు పుట్టి పెరి గిన వాతావరణం వారి తల్లిదండ్రుల జీవన శైలి, వారి తల్లిదండ్రుల అమిత ప్రేమ, సమాజంలో వారిని బాగుపరచాలన్న ఉద్దేశం, వారి కుటుంబా లకు దగ్గరగా ఉన్న వారికి కూడా లేకపోవడం తది తర కారణాలు కారణ భూతాలుగా కనిపిస్తున్నాయి.
మద్యానికి అలవాటు: పదవ తరగతిలో ఉండగానే కొంతమంది విద్యార్థి దశ నుంచి మద్యం, ధూమ పానానికి, నిషేధిత మందుల వాడకానికి, ప్రమాదకరమైన గుట్కా, గంజాయి లాంటి డ్రగ్స్‌కు అలవాటుపడటం తదితర కారణాలు కూడా ప్రస్తుతం యువత పెడదారి పట్టేందుకు కారణమవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణాంశాలుగా ఉన్న వాటిని నిర్మూలించేందుకు సంబంధిత యువకుల కుటుంబ నేపథ్యం నుంచి సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో కీలకపాత్ర వహిస్తున్న పోలీసు యంత్రాంగం సమాజంలో కీలక భూమికను పోషిస్తున్నా... ప్రభుత్వం కూడా యువతను పెడదారి పట్టించే అంశాలకు కట్టడి చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అలాగే కొంతమంది యువకులు కొన్ని కారణాలవల్ల మాదక ద్రవ్యాలకు అలవాటుపడి గతి తప్పిన పరిస్థితులలో వారిని మానసిక వైద్యశాలల్లో మానసిక వైద్య నిపుణులచే సకాలంలో సరైన చికిత్సను అందిస్తే వారు మళ్లీ సాధరణ జన జీవన స్రవంతిలో కలిసిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment