
నగదును పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ
కడప అర్బన్: కడపలో ఏటీఎం వ్యాన్‌లోని డబ్బుల చోరీ కేసులో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కడపలో ఆదివారం ఎస్పీ అన్బురాజన్ ఈ కేసు వివరాలు చెప్పారు. ఖాజీపేట మండలం పుల్లూరు గ్రామానికి చెందిన చెన్నూరు మహబూబ్‌బాషా (36), కడపలోని సత్తార్ కాలనీకి చెందిన షేక్ ఉమర్ ఫరూక్ స్నేహితులు. ఇద్దరు కలిసి సులభంగా డబ్బులు సంపాదించాలని భావించారు. ఫరూక్ ఎస్‌బీఐ ఏటీఎంలలో నగదు లోడ్ చేసే సీఎంఎస్ కంపెనీ వ్యాన్‌కు గతంలో యాక్టింగ్ డ్రైవర్‌గా వెళ్లాడు.
వ్యాన్ డ్రైవర్‌గా మళ్లీ అవకాశం వస్తే నగదు చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 16న ఫరూక్ యాక్టింగ్ డ్రైవర్‌గా వెళ్లాడు. అతను పథకం ప్రకారం ముందుగానే ఓ కారు అద్దెకు తీసుకుని వినాయక్‌నగర్ సమీపంలో పార్కింగ్ చేసి వెళ్లాడు. లోహియానగర్‌లోని ఏటీఎంలో సీఎంఎస్ సంస్థ ఉద్యోగులు నగదు లోడ్ చేసే సమయంలో ఫరూక్ వ్యాన్‌ను రివర్స్ చేసి పెట్టుకుంటానని చెప్పి అందులో మిగిలి ఉన్న రూ.56 లక్షలతో ఉడాయించాడు.
వినాయక్‌నగర్ సమీపంలో సిద్ధంగా ఉంచిన కారులోకి డబ్బుల పెట్టెను మార్చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. వైవీయూ సమీపంలో వేచి ఉన్న మహబూబ్‌బాషా నగదు పెట్టెను పగులగొట్టి నగదును కారులో నింపి ఫరూక్‌ను బెంగళూరుకు వెళ్లాలని చెప్పాడు. సీఎంఎస్ కార్యాలయంలో ఏటీఎంకు కస్టోడియన్‌గా ఉన్న ఎం.సునీల్‌కుమార్ తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వ్యాన్‌కు ఉన్న జీపీఎస్ సహాయంతో వినాయక్‌నగర్ దగ్గర షెడ్డులో ఉన్నట్లు గుర్తించారు.
కారులో పారిపోయిన ఫరూక్ సెల్ నంబర్, సీడీఆర్ డేటా, సీసీ కెమెరాలను పరిశీలించి కర్ణాటకలోని బాగేపల్లి టోల్‌గేటు వద్ద ఉన్నట్లు నిర్ధారించి అక్కడ ఉద్యోగులను అప్రమత్తం చేశారు. దీన్ని పసిగట్టిన ఫారూక్ టోల్‌గేటుకు కొంతదూరంలో కారును, నగదును వదిలేసి పారిపోయాడు. పోలీసులు వెళ్లి కారును, రూ.53.50లక్షలు స్వా«దీనం చేసుకున్నారు. చెన్నూరు మహబూబ్‌బాషాను ఆదివారం కడప నగర శివారులో అరెస్ట్ చేశారు. షేక్ ఉమర్ ఫరూక్ కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment