శ్రీధర్ (ఫైల్)
కొందుర్గు(షాద్‌నగర్): ఉన్నత చదువులు చదివించడానికి తల్లిదండ్రులకు ఆర్థిక స్తోమత లేక ఇంటర్‌తోనే విద్యను ఆపేయాలనుకున్న సమయంలో విద్య నేర్పే గురువులు ముందుకొచ్చి వారి ఖర్చులతో ఉన్నత చదువులు చదివించారు. గురువులు ఆశించిన లక్ష్యం చేరుకోక ముందుగానే ఆ యువకుడు తనను క్షమించాలని కోరుతూ సూసైడ్‌నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం తిరుమలదేవునిపల్లి గ్రామానికి చెందిన ఉప్పల బుచ్చయ్య, లక్ష్మమ్మలకు ఇద్దరు కుమారులు శ్రీధర్, శ్రీకాంత్‌తోపాటు కూతురు సరిత ఉన్నారు. వీరు శ్రీధర్‌ను ఇంటర్ వరకు చదివించారు.
అనంతరం ఆర్థిక పరిస్థితుల రీత్యా చదువు మాన్పించాలని భావించారు. అప్పట్లో శ్రీధర్ గురువులు శ్యామ్‌సుందర్, మంజుల సహాయమందించి శ్రీధర్‌ను పీజీ వరకు చదివించారు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని పోషించాలని సూచించారు. ప్రస్తుతం శ్రీధర్ హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ఓ ఫార్మా కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ (కెమిస్ట్రీ) విభాగంలో ఉద్యోగం చేస్తున్నాడు. మూడేళ్లుగా ఈ ఉద్యోగం నుంచి వచ్చే డబ్బులతో తల్లిదండ్రులను పోషిస్తూ, తమ్ముడు శ్రీకాంత్‌ను చదివిస్తున్నాడు.
మనస్తాపంతో ఆత్మహత్య..
ఈ నెల 18న రాత్రి శ్రీధర్ విధులు ముగించుకొని కంపెనీ నుంచి బయలుదేరి జీడిమెట్లలోనే ఉంటున్న అద్దె ఇంటికి బైక్‌పై వెళుతున్నాడు. దారిలో ఓ మహిళకు బైక్ తగలడంతో ఆమె కాలు విరిగింది. బాధిత మహిళ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో శ్రీధర్‌ను పోలీసులు మందలించారు. మరుసటిరోజు మహిళ కాలు బాగుచేయించడానికి రూ.2 లక్షలు ఇవ్వాలని మహిళ తరఫు బంధువులు డిమాండ్ చేశారు. దీంతో శ్రీధర్ మనస్తాపానికి గురయ్యాడు. తన అద్దె ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు, గురువులు తన ను క్షమించాలని కోరుతూ, అమ్మనాన్నల బాగోగు లు చూసుకోవాలని తమ్ముడు శ్రీకాంత్‌కు సూచిస్తూ సూసైడ్‌నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.
శ్రీధర్ మృతికి పోలీసులే కారణమా..
శ్రీధర్ ఆత్మహత్యకు పోలీసులే కారణమని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడిని పోలీసులు బాధించారని, దెబ్బలు కూడా కొట్టారని తెలిపారు. వారి భయంతోనే శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment