![Banjara Hills:Student Commits Suicide Over Mother Not Give Money For Studies - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/10/student.jpg.webp?itok=NYzbGRB8)
కె.దివ్యసత్యసాయిశ్రీ (ఫైల్)
సాక్షి, హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం డబ్బులు కావాలని తల్లిని అడగగా ఆర్థిక ఇబ్బందులతో ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నంబర్–10లోని నూర్‌నగర్‌లో నివసించే కె.ధనలక్ష్మి రోడ్డు పక్కన టిఫిన్లు విక్రయించుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఆమె కూతురు కె.దివ్యసత్యసాయిశ్రీ (21) నెల రోజులుగా తాను చదువుకుంటానని రూ. 60 వేలు కావాలంటూ తల్లి మీద ఒత్తిడి తీసుకొస్తోంది.
చదవండి: పక్కా ప్లాన్.. భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య
ఇడ్లీలు అమ్ముకుంటూ పొట్ట పోసుకుంటున్న తన వద్ద అంత డబ్బు లేదని.. ఆర్థికంగా చితికిపోయామని.. అప్పు కూడా తెచ్చే పరిస్థితి లేదని తల్లి చెప్పింది. దీంతో తాను ఇక ఉన్నత చదువులు చదవలేమోనని భావించిన దివ్య గత నెల 31న రాత్రి 7.30 గంటలకు మస్కిటో రిప్లెంట్ లిక్విడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో బాధితురాలిని మొదట విన్ ఆస్పత్రిలో చేర్చి ఈ నెల 7వ తేదీన పంజగుట్ట నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె శనివారం రాత్రి కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: పందుల దొంగల ముఠా.. బొలేరోతో ఢీకొట్టి.. ఎంత పనిచేశారంటే..
Comments
Please login to add a commentAdd a comment