
సెల్ చార్జర్ పేలి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
- భోజనం చేస్తుండగా ఫోన్
- సెల్ అందుకుని ఎడమచేత్తో ప్లగ్ నొక్కడంతో పేలుడు
బి.కొత్తకోట, న్యూస్‌లైన్: ఫోన్ చార్జర్ పేలడంతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. మండలంలోని బండారువారిపల్లె పంచాయతీ పెద్దపల్లెలో శనివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. పెద్దపల్లెకు చెందిన మిట్టపల్లె శ్రీనివాసులురెడ్డి, సుశీల దంపతులకు గోవర్దన్‌రెడ్డి (22) ఒక్కడే కుమారుడు. అనంతపురంలో పాలిటెక్నిక్ పూర్తిచేసి, అంగళ్లులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చేస్తున్నాడు.
శనివారం ర్రాతి సెల్‌ఫోన్‌ను చార్జ్‌కు ఉంచాడు. అనంతరం భోజనం చేస్తుండగా ఫోన్‌కాల్ వచ్చింది. అన్నం పూర్తిగా తినకుండానే సెల్‌ఫోన్‌ను కుడి చేతితో అందుకున్నాడు. చార్జర్ ప్లగ్ నుంచి ఊడిపోతుండటంతో ఎడమ చేత్తో ప్లగ్‌ను విద్యుత్ సరఫరా పిన్‌లోకి నెట్టాడు. చార్జర్ ఒక్కసారిగా పేలింది. అందులోని రెండు సరఫరా పిన్నులు గోవర్దన్ ఎడమ అరచేతిలోకి చొచ్చుపోయి కరెంట్ షాక్‌కు గురయ్యాడు. చికిత్స నిమిత్తం మదనపల్లెకు తరలిస్తుండగానే మార్గమధ్యంలో మృతి చెందాడు.
నా బిడ్డను విడిచి ఉండలేను దేవుడా
గోవర్దన్ మరణంతో తల్లి సుశీల రోదించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. నా బిడ్డను విడిచి వుండలేను దేవుడా.. అంటూ బోరున విలపించింది. సోదరి హరిత అన్నను కోల్పోయిన దుఃఖంలో సొమ్మసిల్లి పడిపోయింది. ఆర్థిక స్థోమత అంతంత మాత్రమే అయినప్పటికీ కష్టపడి గోవర్దన్‌ను చదివిస్తున్నారు. ఈ ఏడాదితో చదువు పూర్తవుతుంది. జీవితంలో స్థిరపడతాడని కుటుంబీకులు ఆశలు పెట్టుకున్నారు. అంతలోనే ఆ ఇంట్లో చీకట్లు అలుముకున్నాయి.