గోదావరిలో ఇంజినీరింగ్‌ విద్యార్థి గల్లంతు | - | Sakshi
Sakshi News home page

గోదావరిలో ఇంజినీరింగ్‌ విద్యార్థి గల్లంతు

Published Thu, Oct 17 2024 12:12 AM | Last Updated on Thu, Oct 17 2024 12:21 PM

-

గోపులంక పుష్కరఘాట్‌ వద్ద ఘటన

విహారయాత్రకు వచ్చిన ఏడుగురు యువకులు

తాళ్లరేవు: ఇంజినీరింగ్‌ విద్యార్థుల విహారయాత్ర విషాదాంతమైంది. యానాం సందర్శనకు వచ్చిన విద్యార్థుల్లో ఒక యువకుడు గోదావరిలో గల్లంతయ్యాడు. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు.. శశి వేలివెన్ను ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్న ఎల్లిన శివరామ్‌, మల్లిపూడి నిఖిల్‌ లక్ష్మణ్‌, మండా వంశీ, వెంపటి సంతోష్‌, కుతాని సాయిచంద్ర, కార్తిక్‌, మిజోన్స్‌ అనే యువకులు కారులో బుధవారం విహారయాత్రకు బయలుదేరారు. 

ఉదయమే రాజమహేంద్రవరం వచ్చి అక్కడ అన్నీ ప్రదేశాలను చూశారు. మధ్యాహ్నం కేంద్రపాలిత ప్రాంతమైన యానానికి వచ్చారు. యానాంలోని పలు ప్రదేశాలు సందర్శించిన అనంతరం తిరిగి వెళుతూ గౌతమి గోదావరి చెంతన గల గోపులంక పుష్కరఘాట్‌ వద్ద ఫొటోలు తీసుకునేందుకు ఆగారు. వీరిలో కుతాని సాయిచంద్ర ఫొటోలు తీసుకుంటూ అదుపు తప్పి గోదావరిలో పడిపోయాడు. అతడిని రక్షించేందుకు ప్రయత్నించిన శివరామ్‌ కూడా గోదావరిలో కొట్టుకుపోసాగాడు.

 మిగిలిన విద్యార్థులు వెంటనే స్పందించి వారిని రక్షించడానికి ప్రయత్నించారు. శివరామ్‌ను కాపాడారు గానీ గోదావరి ప్రవాహానికి సాయిచంద్ర (21) కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న కోరంగి పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని స్థానిక మత్స్యకారులతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చీకటి కారణంగా గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడింది. రాజమహేంద్రవరానికి చెందిన సాయిచంద్ర శశి వేలివెన్ను కళాశాలలో ఇంజనీరింగ్‌ ఫైనలియర్‌ చదువుతున్నాడు. శివరామ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.

గతేడాది ఇదే నెలలో..

ఇదే ప్రదేశంలో గతేడాది అక్టోబరు 21న ఇలాంటి ఘటనే జరిగింది. తణుకు పట్టణంలోని సజ్జాపురానికి చెందిన ఏడుగురు యువకులు పుట్టినరోజు వేడుకల కోసం యానాం వచ్చి తిరిగి వెళుతూ గోపులంక వద్ద స్నానానికి దిగారు. వారిలో నలుగురు యువకులు గల్లంతై మృతి చెందారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement