
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టా సాగునీటి అవసరాలకు సరిపడా మళ్లించుకోవచ్చు కదా అని ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ సూచించింది. దీని వల్ల నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల నీరు అవసరం ఉండదు కదా అని వ్యాఖ్యానించింది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలకు సంబంధించి జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ తరఫు సాక్షి కె.వి. సుబ్బారావును తెలంగాణ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలపై పలు ప్రశ్నలు అడిగారు. గోదావరి జలాలను మళ్లించడం ద్వారా డెల్టా అవసరాలను తీర్చుకోవచ్చు కదా అని వైద్యనాథన్ సూచించగా ఆ ప్రతిపాదనను సుబ్బారావు తిరస్కరించారు.
ఏపీ నూతన రాజధాని ప్రాంతం వల్ల కృష్ణా జలాల ద్వారా సాగులో ఉన్న 7 లక్షల ఎకరాలు ప్రభావితమవుతున్నాయి కదా అని అడిగిన ప్రశ్నకు.. రాజధాని ప్రాంతం కేవలం 217 చ.కి.మీ. పరిధిలోనే ఉందని సమాధానమిచ్చారు. 217 చ.కి.మీ. పరిధి రాజధానిగా నిర్ణయిస్తే మౌలిక సదుపాయల అభివృద్ధి, కారిడార్ జోన్, పరిశ్రమల జోన్, అర్బన్ జో¯న్ల వల్ల పరిధి పెరిగే అవకాశం ఉంది కదా అని వైద్యానాథన్ ప్రశ్నించగా.. అన్ని జోన్లు ప్రతిపాదిత ప్రణాళికలోనే ఉంటాయని సుబ్బారావు తెలిపారు.
ఇక డెల్టాలో పంటకాలం 180 నుంచి 130 రోజులకు తగ్గించినందు వల్ల నీటి అవసరాలు కూడా తగ్గినట్టే కదా అని అడిగిన ప్రశ్నకు.. పంటకాలం తగ్గింపు వల్ల నీటి ఆవశ్యకత తగ్గలేదని సుబ్బారావు సమాధానమిచ్చారు. కృష్ణా డెల్టాలో పంటకాలాన్ని 112 రోజులకు తగ్గించుకుంటే సాగునీటి అవసరం తగ్గుతుంది కదా అనగా.. అది అంగీకారం కాదన్నారు. గోదావరి నుంచి పులిచిం తల ప్రాజెక్టు ద్వారా సాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు ఎంత నీరు మళ్లిస్తారని అడిగిన ప్రశ్నకు.. దానిపై అధ్యయనం జరుగుతోందని సుబ్బారావు సమాధానమిచ్చారు. కాగా, కృష్ణా జలాల పంపకాలపై తదుపరి విచారణ గురువారం జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment