తెలంగాణ మంత్రులు, నేతల భేటీలో నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ బుధవారం ఉదయం సీఎం కిరణ్ సహా సీమాంధ్ర మంత్రులు, నేతలు ఢిల్లీలోని ఇందిర సమాధి శక్తిస్థల్ వద్ద దీక్ష చేసేందుకు సిద్ధమవుతుండగా.. అదే సమయంలో నెహ్రూ సమాధి శాంతివనం వద్ద దీక్ష చేసేందుకు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు సమాయత్తమయ్యూరు. డిప్యూటీ సీఎం దామోదర్‌తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి, ఆర్టికల్ 3 ప్రకారం విభజన ప్రక్రియ పూర్తి చేయూలని డిమాండ్ చేయనున్నారు. సోమవారం ఢిల్లీకి చేరుకున్న నేతలు సమావేశమై ముఖ్యమంత్రికి పోటీగా దీక్ష చేసే విషయమై సుదీర్ఘంగా చర్చించుకున్నారు. మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, ప్రసాద్‌కుమార్, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డిలు ఈ మేరకు ప్రతిపాదించగా మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇందుకు ఆమోదం తెలిపారు. ఇదే విషయమై కేంద్ర మంత్రులు జైపాల్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్‌లతో సైతం మంత్రులు విడివిడిగా చర్చించారు. ముఖ్యమంత్రికి దీటైన సమాధానం చెప్పాలంటే దీక్షే సరైన విధానమని అభిప్రాయపడిన జైపాల్‌రెడ్డి సహా ఇతర కేంద్ర మంత్రులు దీక్షకు తాము సైతం హాజరవుతామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
టీ కాంగ్రెస్ పోటీ దీక్ష
Published Tue, Feb 4 2014 1:43 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM
Advertisement