భారత స్టార్ క్రికెటర్, రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2025లో తాను కేవలం బ్యాటర్‌గానే బరిలోకి దిగుతాననే సంకేతాలు ఇచ్చాడు. వికెట్ కీపర్ బాధ్యతలను ఓ యువ ఆటగాడికి అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నాడు. కాగా 2021లో రాజస్తాన్ రాయల్స్ సారథిగా పగ్గాలు చేపట్టాడు సంజూ శాంసన్.
కెప్టెన్‌గా హిట్
ఆ మరుసటి ఏడాదే అంటే.. 2022లో రాజస్తాన్‌ను ఫైనల్ చేర్చి సత్తా చాటాడు. 2008 తర్వాత ఆ జట్టు మళ్లీ తుదిపోరుకు అర్హత సాధించడం అదే తొలిసారి. అయితే, 2023లో మాత్రం ప్లే ఆఫ్స్ చేర్చలేకపోయినప్పటికీ ఐదో స్థానంలో నిలపగలిగాడు. ఇక తాజా ఎడిషన్‌లో మాత్రం రాజస్తాన్‌ను మరోమారు ఆఫ్స్‌లో నిలబెట్టాడు సంజూ.
అతడి కోసం త్యాగం చేసేందుకు సిద్దం
ఇలా గత మూడేళ్లుగా రాజస్తాన్‌ను మెరుగైన స్థితిలో నిలపడంలో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే, వచ్చే ఏడాది మాత్రం ధ్రువ్ జురెల్ కోసం వికెట్ కీపర్‌గా తన స్థానాన్ని త్యాగం చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు సంజూ తాజాగా వెల్లడించాడు.
నాకు ఇదొక పెద్ద సవాలే.. అయినా
‘‘ధ్రువ్ జురెల్ ప్రస్తుతం టెస్టుల్లో సెకండ్ వికెట్ కీపర్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్‌లోనూ అతడు కీపింగ్ బాధ్యతలు నిర్వహిస్తే అతడి అంతర్జాతీయ కెరీర్‌కు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విషయం గురించి మేము చర్చలు జరుపుతున్నాం.
జురెల్‌తో కలిసి కీపింగ్ బాధ్యతలు పంచుకోవాలనే ఆలోచనలో ఉన్నాను. నిజానికి.. నేను కేవలం ఓ ఫీల్డర్‌గా ఎప్పుడూ కెప్టెన్సీ చేయలేదు. కాబట్టి నాకు ఇదొక పెద్ద సవాలే. అయితే.. ధ్రువ్ విధుల పట్ల మాత్రం స్పష్టతతో ఉన్నాను.
నాయకుడిగా నా బాధ్యత.. అందుకే ఈ నిర్ణయం
నేను అతడితో ఇప్పటికే ఈ విషయం గురించి మాట్లాడాను. ‘‘చూడు ధ్రువ్.. నాయకుడిగా నేను నీ గురించి తప్పక ఆలోచిస్తాను. ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లలో కీపింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండు’’ అని చెప్పాను. ఏదేమైనా మాకు జట్టు ప్రయోజనాలే ముఖ్యం.
అయితే, ఆటగాళ్ల వ్యక్తిగత ఎదుగుల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. అందుకే వికెట్ కీపింగ్ బాధ్యతలు పంచుకునే దిశగా ఆలోచనలు చేస్తున్నాం’’ అని సంజూ శాంసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ సంజూ ఈ మేరకు తన ఆలోచినలు, నిర్ణయం గురించి వెల్లడించాడు.
రూ. 18 కోట్లకు
కాగా ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు రాజస్తాన్.. సంజూ శాంసన్‌ను రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుంది. అతడితో పాటు యశస్వి జైస్వాల్(రూ. 18 కోట్లు ), రియాన్ పరాగ్(రూ. 14 కోట్లు)ధ్రువ్ జురెల్(రూ. 14 కోట్లు), హెట్‌మైర్(రూ. 11 కోట్లు), సందీప్ శర్మ(రూ. 4 కోట్లు)లను అట్టిపెట్టుకుంది.
ఐపీఎల్ వేలం-2025 తర్వాత రాజస్తాన్ జట్టు
యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, షిమ్రన్ హెట్‌మైర్, సందీప్‌శర్మ, జోఫ్రా ఆర్చర్ (రూ.12.50 కోట్లు), తుషార్ దేశ్‌పాండే (రూ.6.50 కోట్లు), వనిందు హసరంగ (రూ.5.25 కోట్లు),మహీశ్ తీక్షణ (రూ.4.40 కోట్లు), నితీశ్ రాణా (రూ. 4.20 కోట్లు), ఫజల్‌హక్ ఫారూకీ(రూ. 2 కోట్లు), క్వెనా మఫాక (రూ. 1.50 కోట్లు), ఆకాశ్ మధ్వాల్ (రూ.1.20 కోట్లు), వైభవ్ సూర్యవంశి (రూ. 1.10 కోట్లు), శుభమ్ దూబే (రూ. 80 లక్షలు), యుద్‌వీర్ చరక్ (రూ. 35 లక్షలు), కుమార్ కార్తికేయ (రూ.30 లక్షలు), అశోక్ శర్మ (రూ. 30 లక్షలు), కునాల్‌సింగ్ (రూ. 30 లక్షలు).
చదవండి: పాకిస్తాన్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో తొలి జట్టుగా ఘనత
Comments
Please login to add a commentAdd a comment