రాష్ట్ర విభజనకు సంబంధించిన ముసాయిదా బిల్లు రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో ఇంటెలిజెన్స్ విభాగం అప్రమత్తమైంది. బిల్లు అసెంబ్లీలోచర్చకు రానుండటంతో సమైక్యవాదులు, సీమాంధ్ర నాయకులు, ఏపీఎన్జీవోల నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం అయ్యే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర నిఘా అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు.
అంతేగాక సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల నివాసాల వద్ద నిఘాను పెంచారు. విభజన బిల్లు వస్తే అసెంబ్లీని ముట్టడిస్తామని ఏపీఎన్జీవోల నాయకుడు అశోక్‌బాబు హెచ్చరించిన నేపథ్యంలో.. ఆ సంఘం నాయకుల కదలికలపైనా కన్నేసి ఉంచాలని అధికారులకు ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.
కాగా, సీమాంధ్ర నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రధాన మార్గాలపై భారీ సంఖ్యలో సాయుధ పోలీసులను మోహరించారు. తెలంగాణ వాదులు ఒక పక్క, సమైక్య వాదులు మరోపక్క హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉందని నిఘా అధికారులు అనుమానిస్తున్నారు. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఇరు ప్రాంతాల నేతల ఇళ్లు, ఆయా పార్టీల కార్యాలయాల వద్ద కూడా నిఘాను విస్తృతం చేయాలని ఆ విభాగం చీఫ్ అధికారులకు అంతర్గత ఆదేశాలను జారీ చేశారు.