వీళ్లింతే..!
అధిష్టాన దేవత అనుగ్రహిస్తే చాలు.. దాని ముందు జనాగ్రహం ఏపాటి?.. వారి ఆకాంక్షలతో పనేటి??.. అన్నట్లుంది మన ప్రజాప్రతినిధుల తీరు. లోక్‌సభలో రాష్ట్ర విభజన బిల్లును యూపీఏ సర్కారు ఆమోదింపజేసుకున్న దుర్దినాన సభలో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న కేంద్ర మంత్రులతోపాటు.. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేశారయ్యా.. అంటే..
‘రాణి’గారి చిద్విలాసం..రాజావారి మౌనవ్రతం
తమ సహచర తెలుగు మంత్రులు స్పీకర్ వెల్‌లోకి వెళ్లి బిల్లుపై నిరసన వ్యక్తం చేస్తుంటే.. జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న కృపారాణమ్మ, కిశోర్‌చంద్రదేవ్ రాజావారితోపాటు బొత్స ఝాన్సీలక్ష్మీ గారు.. సీట్లకే అతుక్కుపోయి చిద్విలాసం ఒలకబోస్తూ షిండేగారి ప్రసంగాన్ని వింటూ చోద్యం చూశారు.
కోండ్రువారి సోనియా స్తుతి.. స్పందన లేని ‘శత్రు’చర్ల
పదవిని కాపాడుకునే యావలో రాష్ట్ర మంత్రివర్యులైన కోండ్రువారు సోనియమ్మ స్తుతిని వీడలేదు. ఇక సమైక్యవాదినంటూ సన్నాయి నొక్కులు నొక్కిన శత్రుచర్లవారు విభజన తీరుపై స్పందించనేలేదు.
సిక్కోలు మనసు వికలమైంది. అత్యున్నత ప్రజాస్వామ్య సౌధమైన పార్లమెంటు సాక్షిగా ప్రజా ఆకాంక్షకు సంకెళ్లు వేసి.. మందబలంతో మమ.. అనిపించి, తెలుగుజాతిని నిలువునా చీల్చిన తీరును చూసి ఆగ్రహంతో రగిలిపోయింది. తరాలుగా పెనవేసుకున్న ఆత్మీయ బంధాన్ని అధికార మదం నిర్ధాక్షిణ్యంగా తెంచేయడాన్ని సహించలేకపోయింది. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కోట్లాది ప్రజల గొంతు నొక్కడాన్ని.. సంప్రదాయాల పీక పిసికేయడాన్ని నిరసించింది. జిల్లా కేంద్రం నుంచి గ్రామస్థాయి వరకు పార్టీలు, సంఘాలు, ప్రజలు అన్న తేడా లేకుండా.. అందరూ రోడ్లపైకి వచ్చారు. దిష్టిబొమ్మల దహనాలు, మానవహారాలు, కొవ్వొత్తుల ప్రదర్శనలతో తెలుగు ప్రజల గండెలపై కాంగ్రెస్ కొట్టిన చీకటి దెబ్బకు నిరసనగా బ్లాక్ డే పాటించారు. కళ్లెదురుగానే ఇంత ఘోరం జరిగిపోతున్నా.. రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు తెగబడుతున్న తమ పెద్దలను ఆపేందుకు జిల్లా ప్రజా ప్రతినిధులు కనీస ప్రయత్నం కూడా చేయకపోవడం చూసి.. వీళ్లేనా మన ప్రతినిధులు.. ఇటువంటి భీరువులనా.. మనం ఎన్నుకున్నది?!.. అని ఛీత్కరించుకున్నారు. జిల్లాకు చెందిన ముగ్గురు కేంద్ర మంత్రులు మంత్రించిన బొమ్మల్లా.. అధిష్ఠాన దేవత చేతిలో కీలుబొమ్మల్లా సీట్లకు అతక్కుపోయారే తప్ప.. ఇతర తెలుగు ప్రతినిధులు చూపినంత చొరవ కూడా చూపకపోవడం జిల్లాకే అవమానం. మన రాష్ర్ట మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం.. మేం మాత్రం తక్కువ తిన్నామా.. అన్నట్లు మన్నుతిన్న పాముల్లా పడి ఉన్నారే తప్ప అధిష్టానం చేసిన తప్పిదాన్ని తెగిడేందుకు కూడాసాహసించలేకపోవడం సిగ్గుచేటు.
నేడు జిల్లా బంద్
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా యూపీఏ సర్కారు రాష్ర్ట విభజన బిల్లును లోక్‌సభలో ఆమోదింపజేసుకున్నందుకు నిరసనగా బుధవారం జిల్లా బంద్ పాటించాలని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షుడు జగన్ ఇచ్చి న పిలుపు మేరకు పార్టీకి చెందిన అన్ని స్థాయిల నాయకులు, కార్యకర్త లు బంద్ విజయవంతానికి కృషి చేయాలని కోరారు. ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర అన్ని వర్గాల ప్రజలు బంద్‌కు సహకరించి, రాష్ట్ర విభజనపై తమ వ్యతిరేకతను తెలియజేయాలన్నారు.
శ్రీకాకుళం: విభజనను నిరసిస్తూ బుధవారం బంద్ పాటిస్తున్నట్లు ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు స్కూళ్ల సంఘం కూడా ప్రకటించింది. అన్ని పాఠశాలల యాజమాన్యాలు బంద్‌లో పాల్గొనాలని ఆ సంఘం నాయకులు ఎన్.వి.రమణ, శ్రీకాంత్ పిలుపునిచ్చారు.
బ్లాక్ డే.. సిక్కోలులో నిరసన
Published Wed, Feb 19 2014 2:40 AM | Last Updated on Wed, Apr 3 2019 4:10 PM
Advertisement
Advertisement