
రాజీనామాలపై వెనక్కి తగ్గిన సీమాంధ్ర కేంద్రమంత్రులు
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించనందుకు నిరసనగా రాజీనామాలు అంటూ హడావుడి చేసిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాలపై వెనక్కి తగ్గారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామాలపై కొత్త నాటకానికి తెర తీశారు. ప్రధానమంత్రిని కలిసి గతంలో ఇచ్చిన రాజీనామాలు ఆమోదించాలని మాత్రం కోరాలని నలుగురు కేంద్రమంత్రులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. మిగిలిన కేంద్ర మంత్రులు మాత్రం రాజీనామాలపై నోరు మెదపటం లేదు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు చర్చకు వచ్చేవరకూ రాజీనామాలు అవసరం లేదని సీమాంధ్ర ఎంపీలు కొత్త పల్లవి అందుకున్నారు.
కాగా కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో నిన్న సమావేశమైన మంత్రులు పళ్లంరాజు, చిరంజీవి, పురందేశ్వరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన గురించి చర్చించుకున్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ అధినాయకత్వం నిరాకరించటం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. ఈ నలుగురు మంత్రులు గతంలో తమ రాజీనామా లేఖలను ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అందజేయటం తెలిసిందే.
మన్మోహన్ సింగ్ ఈ మంత్రుల రాజీనామాలను ఇంతవరకు తిరస్కరించలేదు. అవి ఇప్పటికీ ఆయన వద్దే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించనందుకు నిరసనగా తమ రాజీనామాలను మన్మోహన్‌కు అందజేయటం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు కాబట్టి నేరుగా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలిసి రాజీనామా పత్రాలను ఆందజేసి ఆమోదింపజేసుకోవాలని సీమాంధ్ర మంత్రులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.