రాష్ట్ర విభజన బిల్లుకు ప్రతిపాదిత సవరణలపై ఓటింగ్‌ను అంగీకరించబోమంటూ తెలంగాణ నేతలు అభ్యంతరం చెప్పడాన్ని సీమాంధ్ర నేతలు తప్పుపట్టారు.
-
టీ-నేతల అభ్యంతరంపై సీమాంధ్ర మంత్రుల ధ్వజం
-
ఓటింగ్ హక్కు ఉంటుందని సీఎం, స్పీకర్ చెప్తేనే చర్చకు సిద్ధమయ్యాం
-
అందుకు మీరూ అంగీకరించారు.. ఇప్పుడు వద్దంటూ మోకాలడ్డితే ఎలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుకు ప్రతిపాదిత సవరణలపై ఓటింగ్‌ను అంగీకరించబోమంటూ తెలంగాణ నేతలు అభ్యంతరం చెప్పడాన్ని సీమాంధ్ర నేతలు తప్పుపట్టారు. విభజనపై చర్చ జరగాలని, ఎవరెన్ని అభిప్రాయా లు చెప్పుకున్నా, సవరణలను ప్రతిపాదించినా అభ్యంతరం లేదని చెప్పిన నేతలు ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరించడమేమిటని సీమాంధ్ర మంత్రులు ప్రశ్నించారు. విభజనకు తాము వ్యతిరేకమైనప్పటికీ సవరణల పేరుతో ఓటింగ్ కోరే హక్కు సభ్యులకు ఉంటుందని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్ చెప్పినందనే తాము చర్చకు సిద్ధమయ్యామని మంత్రులు శైలజానాథ్, పితాని సత్యనారాయణ తదితరులు పేర్కొన్నారు. సవరణలపై ఓటింగ్ పేరుతో విభజన బిల్లును వ్యతిరేకించవచ్చన్నదే తమ లక్ష్యమన్నారు. వైఎస్సార్‌సీపీ మినహా సీమాంధ్రకు చెందిన ఇతర పార్టీల సభ్యులంతా ఇదే అభిప్రాయంతో చర్చకు సిద్ధమవుతున్న తరుణంలో తెలంగాణ నేతలు సవరణలే వద్దంటూ మోకాలడ్డితే ఎలాగని ప్రశ్నించారు.
తెలంగాణ నేతల తీరు చూస్తుంటే సభలో చర్చ జరగకూడదనే భావనతో ఉన్నట్లు కన్పిస్తోందని విమర్శించారు. చర్చ జరిగితే సభలో మెజారిటీ సభ్యులు విభజనకు వ్యతిరేకమని తేలిపోతుం దని, తద్వారా రాష్ట్రపతి విభజన బిల్లును పార్లమెంటుకు పంపే విషయంలో పునరాలోచించే అవకాశముందని తెలిసే చర్చకు అడ్డుపడుతున్నారని వారు ధ్వజమెత్తారు. మరోవైపు సీఎం కిరణ్ సైతం మంగళవారం తన చాంబర్లో కొందరు సీమాంధ్ర మంత్రులతో మాట్లాడుతూ అందరూ చర్చకు సహకరించాలని కోరినట్లు తెలిసిం ది. చర్చ కొనసాగితే విభజన బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు చెప్పడంతో పాటు బిల్లులోని అంశాలపై పలు సవరణలను ప్రతిపాదించి ఓటింగ్ కోరదామని ప్రతిపాదించారు.
విభజనపై అభిప్రాయాలు మాత్రమే చెప్పాలని, సవరణలు, ఓటింగ్ వద్దని చెప్తున్న తెలంగాణ నేతల వ్యాఖ్యలపై స్పంది స్తూ.. ‘‘ప్రజాస్వామ్యంలో అభిప్రాయమంటే అర్థమేమిటి? వాటిని ఏ రూపంలో తీసుకుంటారు? ఓటింగ్ ద్వారానే కదా! అదే వద్దంటే ఎలా?’’ అని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు మరుసటి రోజుకు వాయిదా పడిన అనంతరం సీఎం వెళుతూ వెళుతూ మీడియాతో మాట్లాడారు. ‘‘మేం చర్చకు నూటికి నూరుశాతం సిద్ధంగా ఉన్నాం. ఇకపై ప్రతి నిమిషాన్ని మనమంతా సద్వినియోగం చేసుకోవాలి. అందుకోసం అన్ని రాజకీయ పార్టీలు చర్చకు అంగీకరించి శాసనసభ స్పీకర్‌కు పూర్తిగా సహకరించాలి’’ అని వ్యాఖ్యానించారు.