అభిమానులపై ‘పంజా’! | Pawan Kalyan Confusion Comments On The Post Of CM, More Details Inside - Sakshi
Sakshi News home page

అభిమానులపై ‘పంజా’!

Published Sat, Dec 23 2023 5:11 AM | Last Updated on Sat, Dec 23 2023 12:49 PM

Pawan Kalyan on the post of CM - Sakshi

సాక్షి, అమరావతి:  పదేళ్ల కిందట పెట్టిన పార్టీ. కానీ... ఇప్పటిక్కూడా వేదిక ఎక్కి మాట్లాడే నాయకుడు ఒక్కడే!!. మరీ ముఖ్యమైన సందర్భాల్లో అయితే అటుపక్క సోదరుడు... ఇటుపక్క తన వ్యవహారాలన్నీ చక్కబెట్టే ఓ కార్యదర్శి స్థాయి నాయకుడు. ఏ జిల్లాకెళ్లినా అంతా అభిమానులే తప్ప వాళ్లలో ఒక్కరూ నాయకులుండరు. అసలు జనసేన రాజకీయ పార్టీయేనా? అలాగైతే పదేళ్లుగా ఎక్కడా ఒక్క బలమైన నాయకుడూ ఎందుకు తయారు కాలేదంటారు? ఎందుకంటే ఆ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఉద్దేశమే అది. తనకు అధికారం అక్కర్లేదని పదేపదే ఆవేశాన్ని అభినయిస్తూ చెప్పే పవన్‌ కళ్యాణ్‌ మాటల్ని సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనేది రాజకీయ విశ్లేషకుల మాట.

ఎందుకంటే 2014 ఎన్నికల్లో ఆయన చంద్రబాబుకు బేషరతుగా మద్దతు ప్రకటించారు. చంద్రబాబు గెలిచారు. కానీ 2019 వచ్చేసరికి బాబు ప్రభుత్వంపై వ్యతిరేకత బాగా పెరిగిపోవటంతో... ఆ వ్యతిరేక ఓట్లన్నీ వైఎస్సార్‌ సీపీకి గంపగుత్తగా పడకుండా చీల్చాలని చంద్రబాబు ఆదేశించటంతో... కొత్త పాత్ర పోషిస్తూ బాబు స్నేహితుడి నుంచి బాబు ప్రతినాయకుడి పాత్రలోకి మారిపోయారు. లేని ఆవేశాన్ని తెచ్చుకుని, చంద్రబాబును చెడామడా తిట్టేస్తూ... ఆగ్రహంతో ఊగిపోయారు. రక్తి కట్టించాననుకున్నారు. కానీ సినిమా ఫ్లాపయింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అఖండమైన మెజారిటీతో గెలిచారు.  

మరి ఇప్పుడూ అదే చంద్రబాబు కదా? అప్పటికీ ఇప్పటికీ ఆయనలో ఏం మారింది? ఏం మారిందంటే చంద్రబాబు పాత్ర మారింది. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చారు. మళ్లీ ఎన్నికలొస్తున్నాయి. ఒంటరిగా అయితే జగన్‌ను ఎదుర్కోలేనన్నది చంద్రబాబు ఉద్దేశం. పవన్‌ కళ్యాణ్‌ తనతో ఉంటే ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓట్లన్నీ గంపగుత్తగా వచ్చేస్తాయనే ఆశ. కాబట్టి పొత్తు పెట్టుకోవటం ద్వారా వాటన్నిటినీ తనకు బదిలీ చేయాలని పవన్‌కు ఆదేశించారు.

మళ్లీ పవన్‌ వేషం మారింది. కాకపోతే రెండుసార్లు ఈయన్ను నమ్మి మోసపోయిన ఆ సామాజికవర్గం మళ్లీ నమ్ముతుందా? అది కూడా తమను పదేపదే మోసం చేసిన చంద్రబాబుకు అనుకూలంగా ఓట్లేయమంటే వేసేస్తారా? అందుకే పవన్‌ రకరకాల అభినయాలకు దిగుతున్నారు. ‘నేను ఎవరినీ ముఖ్యమంత్రిని చేయడానికి లేను’. ‘సీఎం పదవి చేపట్టేందుకు సిద్ధం’ సీఎం పదవి ఇస్తే ఎవరైనా వద్దంటారా?’  ‘జనసేన గెలిచే సీట్లను బట్టి ముఖ్యమంత్రి ఎవరన్నది ఎన్నికల తరవాత తేలుతుంది’.

‘మనకు తగిన బలం లేనప్పుడు ఒక మెట్టు దిగటంలో తప్పులేదు’ అనే పంచ్‌ డైలాగ్‌లు విసిరివిసిరి.. ఇప్పుడు దార్లోకి వచ్చారు. తెలుగుదేశంతో పొత్తును వ్యతిరేకించేవారు తనకు అక్కర్లేదని, పొత్తుకు కట్టుబడ్డవారే తనతో ఉండాలని, తెలుగుదేశం కోసం జనసేన కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పనిచేయాల్సి ఉంటుందని కుండబద్దలుగొట్టేశారు. ప్రీ రిలీజ్‌ ఫంక్షన్లకే కోట్లకు కోట్లు ఖర్చుచేసిన సినిమా రిలీజయ్యాక డిజాస్టరని తెలిస్తే ఎలా ఉంటుందో అంతకన్నా దారుణంగా తయారయింది జనసేన అభిమానుల పరిస్థితి.  

బాంబు పేల్చిన ‘తమ్ముడు’ లోకేశ్‌  
సీఎం ఎవరన్నదీ అసెంబ్లీ ఎన్నికల తరవాత టీడీపీ– జనసేన చర్చించి నిర్ణయాలు తీసుకుంటాయని పవన్‌ కళ్యాణ్‌ చెబుతుంటే... అసలే గందరగోళంలో ఉన్న జనసేన అభిమానులపై చంద్రబాబు తనయుడు లోకేశ్‌ ఓ పిడుగు వేశాడు. ఇన్నాళ్లు పవన్‌ చెబుతున్న మాట పచ్చి అబద్ధమని తేల్చేశారు. ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ... ‘‘పొత్తులో చంద్రబాబే సీఎం అభ్యర్థి. దీన్లో రెండో ఆలోచనే లేదు’’ అని తెగేసి చెప్పారు. అంతేకాదు. 150 సీట్లలో తమ అభ్యర్థులు ఖరారైపోయారని మరో బాంబు పేల్చారు.

ఈ ఇంటర్వ్యూ చూసి జనసేన అభిమానులు హతాశులయ్యారు. ఇన్నాళ్లూ తమ ‘బ్రో’ చెప్పినవన్నీ అబద్ధాలేనా అంటూ చర్చించుకుంటున్నారు. లోకేశ్‌ వ్యాఖ్యలపై జనసేన పార్టీ పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ కూడా అనుమానాస్పదంగానే మాట్లాడారు. శుక్రవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో 15 మందితో కలిసి నాదెండ్ల విలేకరులతో మాట్లాడారు. లోకేశ్‌ వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా.. ‘నా దృష్టిలో లేదు, తెలియదు’ అని తప్పించుకున్నారు. నిబంధనల ప్రకారం ఎన్నికల తర్వాతే  ఎమ్మెల్యేలు సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తారని చెప్పారు.

నిజానికి పొత్తుపై టీడీపీతో ఏ చర్చ జరిగినా, జనసేన తరుఫున పవన్‌ పక్కన నాదెండ్ల మనోహర్‌ మాత్రమే ఉంటారు. సీఎం అభ్యర్థిత్వంపై రెండు పార్టీల మధ్య నిర్ణయం జరగకుండా ఉంటే లోకేశ్‌ వ్యాఖ్యలను ఆయన ఖండించే వారు. కానీ, సీఎం అభ్యర్థి చంద్రబాబు అని పవన్‌ కూడా చాలాసార్లు చెప్పారని లోకేశ్‌ స్పష్టంగా చెప్పారు. దీన్ని మనోహర్‌ ఖండించలేదు. మనోహర్‌ ఇలా మాట్లాడటంతో... పవన్‌ ఉద్దేశపూర్వకంగానే సీఎం అభ్యర్థిత్వంపై అబద్ధాలు చెబుతూ మోసం చేస్తున్నారని జనసేన నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.

2014లో జనసేన పార్టీ ఏర్పాటు నుంచీ పవన్‌ రాజకీయ కార్యక్రమాలన్నీ చంద్రబాబు ప్రయోజనాల చుట్టూనే తిరుగుతున్నాయనే వాదనకు మరింత బలాన్నిచ్చేలా పవన్‌ తీరు ఉన్నట్టు వారు పేర్కొంటున్నారు. ఈ సారి కూడా చంద్రబాబు కోసమే తమ నాయకుడు పనిచేస్తున్నారని, చంద్రబాబు సీఎం అభ్యర్థిగా అంతర్గతంగా అంగీకరించి ఉంటారని, అయినా నిండా 20 సీట్లు కూడా ఇవ్వలేమని లోకేశ్‌ చెబుతుండగా ఇక సీఎం వంటి పదాలను పలకడం వృథా అని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

పొత్తులో సీఎం అభ్యర్థిపై లోకేశ్‌ ఏమన్నారంటే.. 
విలేకరి ప్రశ్న: ఓట్లను పంచుకుంటున్నారు. సీట్లను పంచుకుంటున్నారు. సీఎం పదవిని కూడా జనసేనతో పంచుకుంటారా? 
లోకేశ్‌: చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. దేర్‌ ఈజ్‌ నో సెంకడ్‌ థాట్‌ (రెండో మాటే లేదు). పవన్‌ కళ్యాణ్‌ కూడా అనేక సార్లు చెప్పారు. సమర్ధవంతమైన నాయకత్వం కావాలి. అనుభవం ఉన్న నాయకుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరమని చాలా స్పష్టంగా చెప్పారు. 
దేర్‌ ఈజ్‌ నో యాంబిగ్యుటీ (ఈ విషయంలో ఎలాంటి సందేహాలు లేవు) 

లోకేశ్‌ వ్యాఖ్యలపై విలేకరుల సమావేశంలో నాదెండ్ల మనోహర్‌ స్పందన.. 
విలేకరి ప్రశ్న: టీడీపీ – జనసేన పొత్తులో చంద్ర­బాబే ముఖ్యమంత్రి అభ్యర్థి అని లోకేశ్‌ ఓ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు. పవన్‌ ఇన్నాళ్లుగా ఎన్నికల తర్వాతే సీఎం అభ్యర్థి ఎవరన్నది చర్చించి నిర్ణయం ఉంటుందంటున్నారు కదా? 
నాదెండ్ల : నేను పర్టిక్యులర్‌గా వినలేదు. మీరు అనేది నిజమే అయితే, పొత్తులో భాగంగా పరస్పరం గౌరవించుకోవాలి. కొన్ని ఆలోచనలు సరైన సమయానికి ఇరు పార్టీల నాయకులు కూర్చోని, ఇరు పార్టీల ఎమ్మెల్యేలు కూర్చొని ఆ సందర్భంగా వారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. నా దృష్టిలో అయితే, (దీనిపై నిర్ణయం జరిగినట్టు) లేదు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement