ఏపీకి నామినేటెడ్ ఎమ్మెల్సీల కేటాయింపుల్లో స్వల్ప గందరగోళం
చట్టం వచ్చిన తర్వాత నామినేటెడ్ ఖాళీల భర్తీతో మారిన అంకెలు
ఎమ్మెల్యే కోటా స్థానాల సంఖ్య 16 నుంచి 17కు పెరిగిన వైనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనలో భాగంగా శాసనమండలి సభ్యులను ఇరు రాష్ట్రాలకు కేటాయిం పులో ఒకింత గందరగోళం చోటుచేసుకుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. చట్టంలో పేర్కొన్న దానికి భిన్నంగా సభ్యుల కేటాయింపు ఉన్నట్లు తాజాగా ఆయా మండళ్లలోని సభ్యుల జాబితాను చూస్తే స్పష్టమవుతోంది. సమైక్యాంధ్రప్రదేశ్ శాసనమండలిలో 90 స్థానాలు ఉండగా అందులో ఆంధ్రప్రదేశ్‌కు 50 కేటాయించారు. ఇందులో ఎమ్మెల్యే కోటాలో 17, స్థానిక సంస్థల కోటాలో 17, ఉపాధ్యాయ నియోజకవర్గ స్థానాలు 5, పట్టభద్రుల నియోజకవర్గ స్థానాలు 5, నామినేటెడ్ కోటా స్థానాలు 6 చొప్పున కేటాయించారు. విభజన చట్టం రూపొందిచే నాటికి సభలో ఉన్న సభ్యుల జాబితానుఢ కూడా ఆ చట్టంలో చేర్చారు. ఆ ప్రకారంగా ఎమ్మెల్యే కోటాలో 16, స్థానిక సంస్థల కోటాలో 11, ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాల్లో ఐదేసి చొప్పున, నామినేటెడ్ స్థానాల్లో ఐగురు ఎమ్మెల్సీల పేర్లను చేర్చారు.
స్థానిక కోటాలో 6, ఎమ్మెల్యే, నామినేటెడ్ కోటాలో చెరొకటి చొప్పున 2 ఖాళీలను చూపించారు. అయితే తాజాగా అసెంబ్లీ వెబ్‌సైట్లో మండలి సభ్యుల జాబితాను చూస్తే చట్టంలో పేర్కొన్న దానికి భిన్నంగా కనిపిస్తోంది. చట్టంలో ఎమ్మెల్యే కోటాలో 17 స్థానాలు చూపించగా ఇప్పుడు అది 16కు తగ్గింది. అదే సమయంలో గవర్నర్ నామినేట్ చేసే కోటా కింద 6 స్థానాలు కేటాయించగా అది ప్రస్తుతం ఏడుకు పెరిగింది. విభజన చట్టం తయారైన తరువాత నామినేటెడ్ కోటాలో ఖాళీగా ఉన్న స్థానాలకు అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నియామకాలు చేయించారు. అందులో కంతేటి సత్యనారాయణరాజు, రత్నాబాయిలు ఇద్దరూ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు కావడంతో వారిద్దరినీ ఏపీకే కేటాయించారు. దీంతో నామినేటెడ్ సభ్యుల సంఖ్య చట్టంలో పేర్కొన్న దానికి భిన్నంగా ఏడు అయ్యింది. ఈ కోటాలో ఒక స్థానం పెరగడంతో ఎమ్మెల్యే కోటా స్థానాలను 17 నుంచి 16 కుదించాల్సి వచ్చింది. ఎమ్మెల్యే కోటాలో ఉన్న విజయనగరం జిల్లాకు చెందిన కోలగట్ల వీరభద్రస్వామి రాజీనామా చేయడంతో ఆ స్థానాన్ని ఖాళీగా చూపించారు. దీంతో ఎమ్మెల్యే కోటా తగ్గింది.
ఎమ్మెల్సీ స్థానాల ఖాళీలపై టీడీపీ కసరత్తు
ఎమ్మెల్సీ స్థానాలు 9 ఖాళీగా ఉండడంతో తెలుగుదేశం పార్టీ వాటిపై దృష్టి సారించింది. వాటిని కైవసం చేసుకొనే కసరత్తును ప్రారంభించింది. ఈ తొమ్మిది ఖాళీల్లో ఒకటి ఎమ్మెల్యే కోటాది కాగా 8 స్థానిక సంస్థల కోటాలో ఉన్నాయి.