నాకు భజన చేయడం చేతకాదు..!
► సంక్షేమ పథకాల వైఫల్యాలను ఏకరువు పెట్టిన సతీష్‌రెడ్డి
కడప రూరల్ : ‘నాకు భజన చేయడం చేతకాదు..అందుకే ఏ విషయమైనా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తా.. సంక్షేమ పథకాల అమలు సక్రమంగా ఉంటేనే కదా మనకు ఓట్లు పడేది.. ఇప్పుడున్న పథకాల అమలులో చాలా లోపాలున్నాయి.. వాటిని సరిదిద్దాల్సిన అవసరముంది’ అని శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక హరిత హోటల్‌లో శుక్రవారం తెలుగుదేశం పార్టీ అనుబంధ కమిటీల నియామక అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న బ్యాక్ ఎండ్ సబ్సిడీని ఎత్తేసి, అంతా ఒకేసారి ఇవ్వాలని సూచించారు. అలాగే ఇళ్ల కేటాయింపులు, గృహ నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం సవాలక్ష ఆంక్షలు విధించడం వల్ల నిరు పేదలకు దక్కడం లేదన్నారు. సతీష్‌రెడ్డి బహిరంగంగా అలా మాట్లాడడంతో అక్కడున్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి, మంత్రి ఆది నారాయణరెడ్డి అవాక్కయ్యారు.
దీంతో సోమిరెడ్డి కలుగజేసుకుని ‘సతీష్..మనం ప్రభుత్వంలో ఉన్నాం.. కొన్ని విషయాలను బహిరంగంగా మాట్లాడాలి.. మరికొన్ని నాలుగు గోడల మధ్య చర్చించుకోవాలి అన్నారు. అనంతరం కార్యకర్తలు మాట్లాడుతూ మరుగుదొడ్లు నిర్మించుకుని నెలలు గడుస్తున్నా బిల్లులు రాలేదని తెలిపారు.
మంత్రి సోమిరెడ్డికి సన్మానం
జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియమితులై మొదటిసారిగా శుక్రవారం కడపకు వచ్చిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో సంఘ సేవకులు సయ్యద్ సలావుద్దీన్ సన్మానించారు.