సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఏపీ పెట్టుబడుల విషయంపై టీడీపీ-బీజేపీ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అనంతపురంలో కియో మోటార్స్ రాష్ట్ర ప్రభుత్వం చొరవ వల్లే వచ్చిందని, అయితే కర్నాటక ఎన్నికల ప్రచారంలో మాత్రం కియో బీజేపీ వల్ల వచ్చిందని చెప్పుకుంటోందని మంత్రి పల్లె రఘనాథరెడ్డి వ్యాఖ్యానించారు. అయితే మంత్రి ప్రసంగానికి అడ్డుతగిలిన బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ప్రధాని నరేంద్రమోదీ కారణంగానే కియో వచ్చిందని అనడంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం మొదలైంది. దీంతో కొద్దిసేపు సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేస్తారా..?లేదా..?
ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేస్తారా..?లేదా..? అని ఎమ్మెల్సీ కరణం బలరాం ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రకాశం జిల్లాలో పేపర్ మిల్లుల ఏర్పాటుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఏపీ పటంలో ప్రకాశం జిల్లాను పక్కన పెట్టారని, పరిశ్రమలు పెడతామని వచ్చేవారిని వెనక్కు పంపుతున్నారని కరణం బలరాం విమర్శించారు.
ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేస్తున్నారు..
ప్రైవేట్ పాఠశాలల్లో ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేస్తున్నారని, ఫీజుల వసూలుపై ప్రభుత్వానికి నియంత్రణ లేదని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు విమర్శించారు. శాసనమండలిలో ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు - సంక్షేమ చర్యలు అంశంపై జరిగిన చర్చలో వారు మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఏం జరుగుతుందోనన్న సమాచారం ప్రభుత్వానికి లేదన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులకు భద్రత లేదని, కార్మిక చట్టాలు పని చేయడం లేదని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులందరికి గుర్తింపు కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. జీ.ఓ నెం వన్ అమలు కావడం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment