seemandhra cabinet ministers
-
తెలంగాణ బిల్లుపై లోక్‌సభలో చర్చ ప్రారంభం
న్యూఢిల్లీ : సీమాంధ్ర సభ్యుల తీవ్ర నిరసనల మధ్యే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును పరిశీలించి ఆమోదించాలని హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే మంగళశారం లోక్‌సభను కోరారు. వాయిదా అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన లోక్‌సభలో 41వ అంశంగా తెలంగాణ బిల్లు వ్యవహారం వచ్చింది. సీమాంధ్ర సభ్యుల తీవ్ర నినాదాలు, గందరగోళం మధ్య ఇప్పటికే ప్రవేశపెట్టిన విభజన బిల్లును పరిశీలించి ఆమోదం తెలపాలని షిండే సభకు విజ్ఞప్తి చేశారు. కీలకమైన బిల్లు పరిశీలనకు వచ్చిందని... ఈ సమయంలో సభలో శాంతియుత వాతావరణం ఉండాలని స్పీకర్ మీరా కుమార్ పదే పదే విజ్ఞప్తి చేసినా సభ్యులెవరూ వెనక్కి తగ్గకపోవడంతో... ఆమె సభను మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు వాయిదా వేశారు. -
లోక్‌సభలో సీమాంధ్ర కేంద్ర మంత్రుల నిరసన
-
రేపు లోక్‌సభలో బిల్లును అడ్డుకుంటాం: చిరంజీవి
-
లోక్‌సభలో సీమాంధ్ర కేంద్ర మంత్రుల నిరసన
న్యూఢిల్లీ : లోక్‌సభలో తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రులు, సీమాంధ్ర ఎంపీలు తమ గళం విప్పారు. సభలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పల్లం రాజు, పురందేశ్వరి, చిరంజీవి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తమ నిరసన తెలియచేస్తున్నారు. ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేస్తున్నారు. మరోవైపు స్పీకర్ వెల్లోనికి దూసుకు వెళ్లిన సీమాంధ్ర ఎంపీలు కనుమూరి బాపిరాజు, హర్షకుమార్, బొత్స ఝాన్సీ ఆందోళన కొనసాగిస్తున్నారు. -
కాంగ్రెస్ కనుసన్నల్లో సీమాంధ్ర కేంద్రమంత్రులు
హైదరాబాద్ : కాంగ్రెస్ అధిష్టానం కనుసన్నల్లో సీమాంధ్ర కేంద్ర మంత్రులు పనిచేస్తున్నారని ఏపీ ఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి విరుచుకు పడ్డారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ కేబినెట్లో తెలంగాణ బిల్లును అడ్డుకోలేకపోయిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీమాంద్ర జిల్లాల్లో నేడు అన్ని మండల కేంద్రాల్లో కేంద్రమంత్రుల దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తామని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. 10న కేంద్ర కేంద్రాలయాలు మూసివేత, 12న జాతీయ రహదారులు ముట్టడిస్తామన్నారు. మరోవైపు ఏపీ ఎన్జీవోల సమ్మె కొనసాగుతోంది. సమ్మెలో సుమారు 4 లక్షల మంది పాల్గొన్నారు. సీమాంధ్రలో పాలన స్తంభించింది. -
వారు 'రక్తకన్నీరు నాగభూషణం'లే!
హైదరాబాద్ : 'ఏది పోయినా ఫర్వాలేదు... పదవి పోతే బతకలేం' అని రక్తకన్నీరు సినిమాలో నాగభూషణం చెప్పిన ఈ డైలాగు సీమాంధ్ర కేంద్ర మంత్రుల విషయంలో సరిగ్గా సరిపోతుందని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు వ్యాఖ్యానించారు. తమ మంత్రి పదవిని కాపాడుకునే ప్రయత్నంలో నోరు మెదపకుండా ఉండిపోయిన సీమాంద్ర కేంద్ర మంత్రుల నిర్వాకం కారణంగానే రాష్ట్ర విభజనకు కేంద్రం సిద్ధమైందని ఆయన విమర్శించారు. ఈ పరిస్థితిలో ప్రజల ఆగ్రహావేశాలను చూస్తుంటే వారితోపాటు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలపై భౌతిక దాడులు జరిగినా ఆశ్చర్యపోనక్కరలేదని అన్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి కీలకమైన ఉద్యమం ప్రారంభమవుతుందని అశోక్ బాబు తెలిపారు. కేంద్ర కేబినెట్ రాష్ట్ర విభజన బిల్లుకు ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ ఏపీ ఎన్జీవో సంఘం శుక్రవారం సీమాంధ్రలో బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. -
'ప్రజలకు ముఖం చూపించలేక హస్తినలోనే'
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనను అడ్డుకోవడంలో ఘోరంగా విఫలమైన సీమాంధ్ర కేంద్రమంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు ఇప్పుడేం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. సీమాంధ్రలో మళ్లీ సమైక్య ఉద్యమం రాజుకున్న నేపథ్యంలో ప్రజలకు ముఖం చూపించలేక హస్తినలోనే ఉండిపోయిన సీమాంధ్ర కేంద్రమంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు భవిష్యత్తుపై తర్జనభర్జన పడుతున్నారు. నిన్నటివరకూ రాజీనామాలు చేస్తామంటూ బీరాలు పలికిన వారు ...తెల్లారేసరికి మాట మార్చారు. సమైక్యాంధ్ర కోసం తామంతా చిత్తశుద్ధితో కృషి చేశామని, మంత్రి పదవులను కూడా త్యజించామని ఆయన చెప్పినా, అదంతా డొల్ల వాదనేనని తేలిపోయింది. వాస్తవానికి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల ఎంపీలు నిజాయితీగా రాజీనామాలు చేసి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి తగినంత బలం ఉండేది కాదు, ఈ పాటికి పడిపోయి కూడా ఉండేది. ఏకంగా తొమ్మిది మందికి కేంద్ర మంత్రిపదవులు లభించిన వైనాన్ని చూస్తే, వీళ్లందరికీ పదవుల ఎర వేసి.. కేంద్రం ముందుగానే వీళ్లందరినీ జేబుల్లో వేసుకుందన్న ప్రచారం గట్టిగా ఉంది. కేంద్రం ప్రభుత్వం నుంచి ఇంత స్థాయిలో ప్రకటన వచ్చిన తర్వాత కూడా కేంద్ర మంత్రుల నుంచి ఏమాత్రం స్పందన రాకపోవడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా కనపడుతోంది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ముందు కొంతమంది మంత్రులు తమ డిసెంట్ నోట్ ఇస్తామని చెప్పినట్లు సమాచారం వినిపించింది. దాన్ని కూడా కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. దీన్ని బట్టి చూస్తే.. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు ఉత్త చవటలన్న విమర్శలు సీమాంధ్ర ప్రాంతంలో వినిపిస్తున్నాయి. సీమాంధ్ర ప్రాంత ప్రజలు కేంద్ర మంత్రుల చేతగానితనంపై నిప్పులు చెరుగుతున్నారు. సీమాంధ్ర ప్రజల హక్కులు కాపాడడంలో ఈ ప్రాంత నేతలు ఘోరంగా విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
రాజీనామాలపై వెనక్కి తగ్గిన సీమాంధ్ర మంత్రులు
-
రాజీనామాలపై వెనక్కి తగ్గిన సీమాంధ్ర కేంద్రమంత్రులు
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించనందుకు నిరసనగా రాజీనామాలు అంటూ హడావుడి చేసిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాలపై వెనక్కి తగ్గారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామాలపై కొత్త నాటకానికి తెర తీశారు. ప్రధానమంత్రిని కలిసి గతంలో ఇచ్చిన రాజీనామాలు ఆమోదించాలని మాత్రం కోరాలని నలుగురు కేంద్రమంత్రులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. మిగిలిన కేంద్ర మంత్రులు మాత్రం రాజీనామాలపై నోరు మెదపటం లేదు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు చర్చకు వచ్చేవరకూ రాజీనామాలు అవసరం లేదని సీమాంధ్ర ఎంపీలు కొత్త పల్లవి అందుకున్నారు. కాగా కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో నిన్న సమావేశమైన మంత్రులు పళ్లంరాజు, చిరంజీవి, పురందేశ్వరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన గురించి చర్చించుకున్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ అధినాయకత్వం నిరాకరించటం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. ఈ నలుగురు మంత్రులు గతంలో తమ రాజీనామా లేఖలను ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అందజేయటం తెలిసిందే. మన్మోహన్ సింగ్ ఈ మంత్రుల రాజీనామాలను ఇంతవరకు తిరస్కరించలేదు. అవి ఇప్పటికీ ఆయన వద్దే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించనందుకు నిరసనగా తమ రాజీనామాలను మన్మోహన్‌కు అందజేయటం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు కాబట్టి నేరుగా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలిసి రాజీనామా పత్రాలను ఆందజేసి ఆమోదింపజేసుకోవాలని సీమాంధ్ర మంత్రులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. -
కావూరి నివాసంలో సీమాంధ్ర కేంద్రమంత్రుల భేటీ
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో సీమాంధ్ర కేంద్రమంత్రులు మంగళవారమిక్కడ సమావేశం అయ్యారు. హైదరాబాద్, రాయల తెలంగాణ, జీవోఎం భేటీ తదితర అంశాలపై వారు చర్చిస్తున్నారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) తుది విడతగా నేడు భేటీ కానున్న నేపథ్యంలో సీమాంధ్ర నేతలు భేటీ అయ్యారు. ఇక జీవోఎం ఆమోదించనున్న నివేదికలో రాష్ట్ర విభజనపై సిఫారసులు ఎలా ఉంటాయనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రతిపత్తి, ఉమ్మడి రాజధాని పరిధి, ఆర్టికల్ 371డీ, ఈ, నీటి సమస్యల పరిష్కారం అంశాలతో పాటు రాయల తెలంగాణ విషయమై జీవోఎం సిఫారసులు ఫలానా విధంగా ఉన్నాయని కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్న పలు కథనాలతో తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో సిఫారసుల అసలు స్వరూపం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. -
రాష్ట్ర విభజన అనివార్యం : చిరంజీవి
-
రాష్ట్ర విభజన అనివార్యం : చిరంజీవి
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన అనివార్యమని కేంద్ర మంత్రి చిరంజీవి స్పష్టం చేశారు. ఇక కలిసుండాలని కోరుకోవటంలో ప్రయోజనం లేదని ఆయన బుధవారమిక్కడ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాల్సిందేనని చిరంజీవి అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్‌పై వెనక్కి తగ్గేది లేదని ఆయన అన్నారు. విభజన ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసిందని చిరంజీవి తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశల్లోనే తెలంగాణ బిల్లు వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. కాగా అంతకు ముందు సీమాంధ్ర కేంద్ర మంత్రులు జీవోఎం సభ్యుడు జైరాం రమేష్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌పైనే వారు ప్రధానంగా చర్చించారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్ర కేంద్రమంత్రులు విజ్ఞప్తి చేశారు. -
'సీమాంధ్ర కేంద్ర మంత్రులది గోబెల్ ప్రచారం'
తిరుపతి : రాష్ట్రం విడిపోయిందంటూ సీమాంధ్ర కేంద్ర మంత్రులు గోబెల్ ప్రచారం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ కో ఆర్డినేటర్ వి.లక్ష్మణ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్టికల్-3ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. అసెంబ్లీలో తీర్మానం, చర్చ లేకుండా విభజనకు పూనుకోవటం రాజ్యాంగ విరుద్ధమని లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజన వల్ల కలిగే నష్టాలను..తెలుగుజాతికి తెలియచెప్పేందుకు డిసెంబర్ 2 నుంచి 29 వరకూ సీమాంధ్రలో సమైక్య కళాభేరి నిర్వహించనున్నట్లు లక్ష్మణ్ రెడ్డి వెల్లడించారు. సీమాంధ్రలోని అన్ని మండల కేంద్రాల్లో కళాభేరి కార్యక్రమాలు ఉంటాయన్నారు. -
ఎస్కే యూనివర్శిటీలో కేంద్రమంత్రులకు సమాధి
అనంతపురం : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సీమాంధ్రలో ఆందోళనలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అనంతపురం జిల్లాలో సమైక్య ఆందోళనలు నేటికి 50వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్శిటీ విద్యార్థులు, ఉద్యోగులు వినూత్నంగా తమ నిరసనలు తెలిపారు. ప్రజల మనోభీష్టం కన్నా... పదవులు పట్టుకుని వేలాడుతున్న కేంద్ర మంత్రులకు విద్యార్థులు, ఉద్యోగులు బుధవారం ఉదయం సమాధి కట్టి నిరసనలు తెలియచేశారు. కేంద్రమంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక ఉరవకొండలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి సమైక్యవాదులు వంద టెంకాయలు కొట్టారు. అలాగే జిల్లా వ్యాప్తంగా సమైక్య నినాదాలు మోర్మోగుతున్నాయి. అనంతపురం నగరంలో జాక్టో ఆధ్వర్యంలో నిన్న రిలే దీక్షలు కొనసాగించిన ఉపాధ్యాయులు... కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించారు. సప్తగిరి సర్కిల్లో మానవహారం నిర్మించి... దిష్టిబొమ్మలను దహనం చేశారు. ‘మొద్దునిద్రలో ఉన్న మంత్రులను గునపాలతో గుచ్చి లేపుతున్నట్లు’గా ఉపాధ్యాయులు స్థానిక టవర్‌క్లాక్ సర్కిల్లో వినూత్న ప్రదర్శన చేపట్టారు. -
'రాజీనామా చేసేందుకు సీమాంధ్ర కేంద్రమంత్రులు సిద్ధం'
ఢిల్లీ: సమైక్య రాష్ట్రం కోసం కేంద్ర మంత్రులు పోరాడతామని హామి ఇచ్చినట్లు ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. సీమాంధ్ర మంత్రులతో ఏపీఎన్జీవోల భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజీనామా చేసేందుకు సీమాంధ్ర కేంద్ర మంత్రులు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.ఆరు నెలల్లో పోయే పదవుల కోసం పట్టుకుని ఉండలేమని మంత్రులు తెలపారన్నారు. సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు, ఉద్యోగ సంఘాలతో కోర్ కమిటీ ఏర్పాటు చేస్తామని అశోక్ బాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సేవ్ పేరుతో సెప్టెంబరు 7వ తేదీన తలపెట్టే సభకు కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకుంటామన్నారు. ఏపీ ఎన్జీవోల సంఘం నాయకులు గురువారం న్యూఢిల్లీలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులతో సమావేశమైయ్యారు. అనంతరం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎన్జీవోల సంఘం నాయకులు ప్రసంగించారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు వ్యవహారిస్తున్న తీరు పట్ల వారు ఆగ్రహాం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రులు రాజీనామా చేస్తే కేంద్రం తప్పక దిగివస్తుందని వారు అభిప్రాయపడ్డారు. అనంతరం వారు సమైక్య రాష్ట్రం కోసం గట్టి పోరాటం చేయాలని వారు పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కొందరు మాట్లాడటం సరికాదని ఏపీఎన్జీవోల సంఘం నాయకులు ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు.