
'ప్రజలకు ముఖం చూపించలేక హస్తినలోనే'
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనను అడ్డుకోవడంలో ఘోరంగా విఫలమైన సీమాంధ్ర కేంద్రమంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు ఇప్పుడేం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. సీమాంధ్రలో మళ్లీ సమైక్య ఉద్యమం రాజుకున్న నేపథ్యంలో ప్రజలకు ముఖం చూపించలేక హస్తినలోనే ఉండిపోయిన సీమాంధ్ర కేంద్రమంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు భవిష్యత్తుపై తర్జనభర్జన పడుతున్నారు.
నిన్నటివరకూ రాజీనామాలు చేస్తామంటూ బీరాలు పలికిన వారు ...తెల్లారేసరికి మాట మార్చారు. సమైక్యాంధ్ర కోసం తామంతా చిత్తశుద్ధితో కృషి చేశామని, మంత్రి పదవులను కూడా త్యజించామని ఆయన చెప్పినా, అదంతా డొల్ల వాదనేనని తేలిపోయింది. వాస్తవానికి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల ఎంపీలు నిజాయితీగా రాజీనామాలు చేసి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి తగినంత బలం ఉండేది కాదు, ఈ పాటికి పడిపోయి కూడా ఉండేది. ఏకంగా తొమ్మిది మందికి కేంద్ర మంత్రిపదవులు లభించిన వైనాన్ని చూస్తే, వీళ్లందరికీ పదవుల ఎర వేసి.. కేంద్రం ముందుగానే వీళ్లందరినీ జేబుల్లో వేసుకుందన్న ప్రచారం గట్టిగా ఉంది.
కేంద్రం ప్రభుత్వం నుంచి ఇంత స్థాయిలో ప్రకటన వచ్చిన తర్వాత కూడా కేంద్ర మంత్రుల నుంచి ఏమాత్రం స్పందన రాకపోవడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా కనపడుతోంది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ముందు కొంతమంది మంత్రులు తమ డిసెంట్ నోట్ ఇస్తామని చెప్పినట్లు సమాచారం వినిపించింది. దాన్ని కూడా కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు.
దీన్ని బట్టి చూస్తే.. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు ఉత్త చవటలన్న విమర్శలు సీమాంధ్ర ప్రాంతంలో వినిపిస్తున్నాయి. సీమాంధ్ర ప్రాంత ప్రజలు కేంద్ర మంత్రుల చేతగానితనంపై నిప్పులు చెరుగుతున్నారు. సీమాంధ్ర ప్రజల హక్కులు కాపాడడంలో ఈ ప్రాంత నేతలు ఘోరంగా విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.