
వారు 'రక్తకన్నీరు నాగభూషణం'లే!
హైదరాబాద్ : 'ఏది పోయినా ఫర్వాలేదు... పదవి పోతే బతకలేం' అని రక్తకన్నీరు సినిమాలో నాగభూషణం చెప్పిన ఈ డైలాగు సీమాంధ్ర కేంద్ర మంత్రుల విషయంలో సరిగ్గా సరిపోతుందని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు వ్యాఖ్యానించారు. తమ మంత్రి పదవిని కాపాడుకునే ప్రయత్నంలో నోరు మెదపకుండా ఉండిపోయిన సీమాంద్ర కేంద్ర మంత్రుల నిర్వాకం కారణంగానే రాష్ట్ర విభజనకు కేంద్రం సిద్ధమైందని ఆయన విమర్శించారు.
ఈ పరిస్థితిలో ప్రజల ఆగ్రహావేశాలను చూస్తుంటే వారితోపాటు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలపై భౌతిక దాడులు జరిగినా ఆశ్చర్యపోనక్కరలేదని అన్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి కీలకమైన ఉద్యమం ప్రారంభమవుతుందని అశోక్ బాబు తెలిపారు. కేంద్ర కేబినెట్ రాష్ట్ర విభజన బిల్లుకు ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ ఏపీ ఎన్జీవో సంఘం శుక్రవారం సీమాంధ్రలో బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.