అత్యంత దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీల్చిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను సీమాంధ్ర ప్రజలు క్షమించరని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు.
సాక్షి, హైదరాబాద్: అత్యంత దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీల్చిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను సీమాంధ్ర ప్రజలు క్షమించరని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. అసెంబ్లీ తీర్పును గౌరవిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ... రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా, లోక్‌సభ సాక్షిగా కాంగ్రెస్‌తో కుమ్మక్కైందని ఆరోపించారు. శనివారం ఏపీఎన్జీవో భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన జరిగిపోయినందున రాష్ట్ర అభివృద్ధికి ముందుకు వచ్చిన నేతలకు తాము మద్దతుగా నిలుస్తామని పేర్కొన్నారు. జరిగిన అన్యాయం గురించి కలత చెంద కుండా, నష్టాన్ని పూడ్చుకోవడంపై దృష్టి పెడతామన్నారు. ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నేతలు మోసం చేసినందున, వచ్చే ఎన్నికల్లో స్వార్థపరులైన నాయకులను దూరం పెట్టాలన్నారు.
తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు..
పార్లమెంట్‌లో రాష్ట్ర విభజనకు ఆమోదం లభించినందున తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఏపీఎన్జీవోల సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. తాము రాష్ట్ర సమైక్యత కోసం ఉద్యమించామేగానీ, తెలంగాణ ప్రజలను ఎన్నడూ ద్వేషించలేదన్నారు.