'కాంగ్రెస్, బీజేపీలు మూల్యం చెల్లించుకోక తప్పదు'
తమ ప్రాంతానికి న్యాయం చేస్తామంటూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీమాంధ్ర గొంతు కోసిందని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు ఆరోపించారు. శనివారం ఆయన హైదరాబాద్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సీమాంధ్రకు న్యాయం చేయకపోతే విభజన బిల్లును అడ్డుకుంటామన్న బీజేపీ క్షణాల్లోనే మాటమార్చిందని విమర్శించారు. లోక్సభలో కేవలం 20 నిముషాల్లోనే బిల్లు పాస్ చేసేందుకు బీజేపీ సహకరించిందన్నారు. రాష్ట్ర అసెంబ్లీ తిరస్కరించిన బిల్లు పార్లమెంట్ ఎలా ఆమోదించిందో సీమాంధ్ర ప్రజలు చూశారని ఆయన పేర్కొన్నారు.
విభజనపై కాంగ్రెస్ తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న రీతిలో వ్యవహరిస్తే అందుకు బీజేపీ సహకరించిందని ఆ పార్టీలపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీలను క్షమించేది లేదన్నారు. సీమాంధ్రుల జీవితాన్ని ఆ రెండు పార్టీలు ఫణంగా పెట్టాయని, త్వరలో ఆ పార్టీలు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తాము తుది వరకు పోరాడిన సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. విభజనతో సీమాంధ్ర ప్రాంతంలోని రైతులు, విద్యార్థులు, యువత కోలుకోలేని దెబ్బతిన్నారన్నారు. సీమాంధ్ర కోలుకోవడానికి 10 నుంచి 15 ఏళ్లు పడుతుందని చెప్పారు.