అమిత్ షా సభ అందుకే: సురవరం
హైదరాబాద్: తెలంగాణ సాయుధ విప్లవ లక్ష్యాలు ఇంకా పూర్తికావాల్సి ఉందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి అన్నారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న పెట్టుబడిదారుల విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. హిందువులు, ముస్లింల పేరుతో సమాజాన్ని చీల్చాలని బీజేపీ చూస్తోందని సురవరం విమర్శించారు.
రజాకారులు సృష్టించిన మజ్లీస్ పార్టీ మాటను నమ్ముతూ.. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్లు విమాచన దినోత్సవాన్ని జరపకపోవడం అన్యాయమని సురవరం అన్నారు. నిజాం నిరంకుశ పాలన, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగానే కమ్యూనిస్టులు తెలంగాణ సాయుధ పోరాటాన్ని నిర్వహించారని సురవరం గుర్తు చేశారు. అయితే.. ఈ పోరాటాన్ని ముస్లిం రాజుకు, హిందూ ప్రజలకు మధ్య జరిగినదిగా బీజేపీ చిత్రీకరిస్తుందని, తమ భావజాలాన్నే అందరూ అంగీకరించాలనే మూర్ఖత్వంతో ఆ పార్టీ వ్యవహరిస్తుందని, అందుకే వరంగల్లో అమిత్ షా సభ నిర్వహిస్తున్నారని సురవరం విమర్శించారు.
హిందువులు, ముస్లింల పేరుతో సమాజాన్ని చీల్చడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సురవరం అన్నారు. తెలంగాణ విమోచన ఉద్యమాన్ని భూస్వామ్య వ్యతిరేక పోరాటంగా చేయాలన్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన శక్తులతో నాటి భారత ప్రభుత్వం చర్చలు జరిపి ఉండాల్సింది అని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైన తరువాత కొన్నిచోట్ల ముస్లింలపై దాడులు జరిగాయని, అయితే దానిని సాకుగా చూపుతూ విలీన దినం జరపకూడదని మజ్లీస్ అభ్యతరం పెడుతుందని సురవరం అన్నారు.