ఉమ్మడిగా గిట్టి విడిగా.. పుట్టిన రోజు | andhra pradesh now divided into two states | Sakshi
Sakshi News home page

ఉమ్మడిగా గిట్టి విడిగా.. పుట్టిన రోజు

Published Mon, Jun 2 2014 1:35 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

ఉమ్మడిగా గిట్టి  విడిగా.. పుట్టిన రోజు - Sakshi

ఉమ్మడిగా గిట్టి విడిగా.. పుట్టిన రోజు

 సాక్షి, కాకినాడ : దాదాపు అరవై ఏళ్ల అనుబంధం తెగిపోయింది. ఆంధ్రప్రదేశ్ రెండుగా చీలింది. భౌగోళికంగా రాష్ర్టం రెండయిందన్న వేదనతో గుండె బరువెక్కుతున్నా తెలుగుజాతి మాత్రం ఎప్పుడూ ఒక్కటిగా ఉండాలని, కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి సీమాంధ్రులంతా అంకితం కావాలని జిల్లావాసులు ఆకాంక్షిస్తున్నారు.కొత్తగా పుట్టింది పేరుకు తెలంగాణ  రాష్ర్టమే అయినా కృత్యాద్యవస్థను చవి చూడనున్నది ‘ఆంధ్రప్రదేశ్’ అన్న పాతపేరును మిగుల్చుకున్న సీమాంధ్ర ప్రాంతమే.రాష్ర్టం కలిసే ఉండాలని, కలిసే ముందంజ వేయాలని కాంక్షిస్తూ సమైక్యవాదులు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఉద్యమించారు. అయినా కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలతో విభజన జరిగిపోయింది. విభజనకు కేంద్రం నిర్దేశించిన అపాయింటెడ్ డే సోమవారం నుంచి అమల్లోకి రానుంది.
 
 ప్రజాప్రతినిధులూ! ఇకనైనా ప్రగతికి పాటుపడండి!
 కొత్త ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చిత్తశుద్ధితో పాటుపడాలని జిల్లావాసులు అభిలషిస్తున్నారు. ‘ఇప్పటి వరకూ మనఆదాయంతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాం. ఇకనైనా మన ఆదాయంతో మన ప్రాంతాన్నే అభివృద్ధి చేసుకుందాం’ అన్న భావనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. మానవ వనరులతోపాటు సహజ వనరులు పుష్కలంగా ఉన్న మన జిల్లా రాష్ర్ట పునర్నిర్మాణంలో కీలక భాగస్వామి కావాలని కోరుకుంటున్నారు.  సహజ సిద్ధమైన యాంకరేజ్ పోర్టు, మానవ నిర్మితమైన డీప్ వాటర్ పోర్టులతో పాటు గ్యాస్, చమురు నిక్షేపాలు, లక్షలాది ఎకరాల్లో వ్యవసాయ, వాణిజ్య పంటలు జిల్లా సొంతం. జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు, భారీ పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటయ్యేలా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో కృషి చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు.
 
 ఇక దేని రాబడి దానిదే..
 తెలంగాణలో టీఆర్‌ఎస్ సర్కార్ మరికొద్ది గంటల్లోనే కొలువు దీరనుండడంతో అక్కడ పూర్తిస్థాయి పాలన సోమవారం నుంచే ప్రారంభం కానుంది. పాత పేరుతో కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం టీడీపీ సర్కార్ ఈ నెల 8న కొలువుతీరనుంది. అప్పటి వరకూ ఇక్కడ రాష్ర్టపతి పాలనే కొనసాగనుంది. ఇప్పటి వరకు రాష్ట్ర పాలన, రికార్డుల నిర్వహణ ఉమ్మడి ప్రభుత్వాధీనంలో సాగేవి. విభజనతో శాఖల వారీగా రెండు రాష్ట్రాలకు రెండేసి చొప్పున కొత్తగా వెబ్‌సైట్ల రూపకల్పన పూర్తయింది. సర్వర్లను కూడా వేర్వేరుగా సిద్ధం చేస్తుండడంతో ఆ మేరకు జిల్లా ప్రభుత్వ కార్యాలయాల్లో సాంకేతికపరంగా సమూలమైన మార్పులు రాబోతున్నాయి. శాఖల వారీగా ఏ రాష్ర్ట ఆదాయం ఆ రాష్ర్ట ఖాతాకు జమ కానుంది.
 
 ఏపీ-04 సిరీస్‌తో రిజిస్ట్రేషన్లు
 రవాణా శాఖకు సంబంధించి ఇప్పటి వరకు జిల్లాలో అమల్లో ఉన్న ఏపీ-05 సిరీస్‌కు బదు లు ఏపీ-04 సిరీస్‌తో రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాద్ చిరునామాతో అన్ని శాఖల్లో స్టాంపింగ్ జరిగేది. రాజధాని ఎక్కడో తేలకపోవడంతో రాజధాని పేరు లేకుండానే ఆంధ్రప్రదేశ్ పేరుతో స్టాంపింగ్ చేయనున్నారు. దాదాపు అన్ని శాఖల్లో ఆదాయ, వ్యయాలతో పాటు నిర్వహణలో కూడా అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇందుకోసం శుక్రవారం నుంచి వివిధ శాఖల  సర్వర్లు, వెబ్‌సైట్లను నిలిపేశారు. మీసేవా కేంద్రాలు సైతం మూతపడ్డాయ. కొత్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొలువైన తర్వాతే అవసరమైన నిధుల కోసం శాఖలవారీగా ప్రతిపాదనల రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. శాఖల వారీగా రాష్ర్ట కార్యాలయాలు, ఉన్నతాధికారులు కొత్తగా ఏర్పడనుండడంతో ఆయా కార్యాలయాల చిరునామాలను, అధికారుల ఫోన్ నంబర్లను వెబ్‌సైట్‌లో పొందుపర్చే పని జరుగుతోంది.
 
 రాజకీయాలకతీతంగా రాష్ట్రాభివృద్ధికి అంకితం కావాలి
 రాష్ట్రం విడిపోకూడదని అన్ని ప్రాంతాల నుంచీ వర్గాలకు అతీతంగా పోరాటాలు జరిగాయి. కోనసీమ నుంచి జేఏసీ తరఫున మేమూ ఉధృతంగా పోరాడాం. కానీ చివరకు రాష్ట్రం విడిపోయింది. జరిగిందాని గురించి బాధపడడం కంటే జరగాల్సిన దానికోసం పాలకులు విజ్ఞతతో ఆలోచిస్తే సీమాంధ్ర ప్రజలకు భవిష్యత్తులో న్యాయం జరుగుతుంది. రాష్ట్ర విభజనను నిరోధించడంలో విఫలమైన అన్ని పార్టీల నాయకులూ కనీసం రాష్ట్ర పునర్నిర్మాణంలోనైనా రాజకీయాల జోలికి వెళ్లకుండా కొత్త రాష్ట్రం అభివృద్ధికి అంకితభావంతో పని చేయాలి.
 - బండారు రామ్మోహనరావు, కన్వీనర్, కోనసీమ సమైక్యాంధ్ర జేఏసీ
 
 ఆదాయ వనరులను తక్షణమే తెచ్చుకోవాలి
 సీమాంధ్రకు రావాల్సిన ఆదాయ వరులను తక్షణమే తెచ్చుకోవాలి. సీమాంధ్రలో వ్యాపారాలు చేస్తూ  తెలంగాణ లో రిజిస్టర్డ్ కార్యాలయాలున్న పారిశ్రామికవర్గాలు తక్షణమే వాటిని సీమాంధ్రకు తెచ్చుకోవాలి. కేజీ బేసిన్‌లోని గ్యాస్ గుజరాత్‌కు తరలిపోకుండా చూడాలి. అనువైనచోట హైకోర్టు ను, మిగిలినచోట్ల బెంచ్ కోర్టులు ఏర్పాటు చేయాలి. విద్యుత్‌ను వాడకం ప్రాతిపదికన కాక జనాభా ప్రాతిపదికన కేటాయిస్తే భవిష్యత్‌లో సీమాంధ్రలో పరిశ్రమలు అభివృద్ధి చెందితే ఇబ్బందులు తలెత్తవు. ఏపీ బార్ కౌన్సిల్ నిధిని కేసుల ప్రాతిపదికన కేటాయించాలి.
 - ముప్పాళ్ళ సుబ్బారావు, న్యాయవాది, మానవ హక్కుల నేత, రాజమండ్రి
 
 సముద్ర తీరమే మనకున్న ఆస్తి
 రాష్ర్ట విభజనను అడ్డుకోవాలని తీవ్రంగా ఉద్యమించినా ఫలితం లేకపోయింది. సముద్రతీరమే మనకున్న ప్రధాన ఆదాయ వనరు. ఒక్కో జిల్లాకు ఒక్కోటి చొప్పున తొమ్మిది కోస్తా జిల్లాలకు తొమ్మిది పోర్టులు అందుబాటులోకి వస్తాయి. తెలంగాణ  జిల్లాల నుంచి కాకినాడ పోర్టు ద్వారా ఎగుమతయ్యే బియ్యం, మొక్కజొన్న, గ్రానైట్‌లను కొన్నేళ్లు అంతర్రాష్ర్ట పన్ను నుంచి మినహాయింపునిస్తేఎగుమతులు పెరిగి మన పోర్టుకు ఆదాయం వృద్ధవుతుంది. పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించి పదేళ్లు పన్ను రాయితీనివ్వాలి.  
 - దంటు సూర్యారావు, కోకనాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు
 
 రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటునందిస్తాం..
 రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అనేక పోరాటాలు చేసినప్పటికీ యూపీఏ సర్కార్ ఏకపక్ష నిర్ణయం వల్ల రాష్ట్రం విడిపోతున్నందుకు తీవ్రంగా చింతిస్తున్నాం.రాష్ట్ర పునర్నిర్మాణం, అభివృద్ధికి మా వంతు తోడ్పాటునందిస్తాం. రాష్ట్ర పునర్నిర్మాణ విషయంలో అంకిత భావంతో పనిచేస్తాం. అవసరమైన పక్షంలో అదనంగా ఒక గంట పనిచేయడానికి కూడా వెనుకాడం.
 - బూరిగ ఆశీర్వాదం, ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement