దూసుకెళ్లిన కారు | TRS got more voting percent | Sakshi
Sakshi News home page

దూసుకెళ్లిన కారు

Published Mon, May 19 2014 1:07 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

TRS got more voting percent

మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ :  తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) క్షేత్రస్థాయిలోకి దూసుకెళ్లింది. తెలంగాణవాదం ఓటర్ల మనసు గెలిచింది. ఉద్యమం, సెంటిమెంటు ఓట్లు రాల్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓట్లు కొల్లగొట్టింది. గతంలో జరిగిన స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లో కంటే ఈసారి జరిగిన ఎన్నికల్లో అత్యధిక ఓట్లు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రానికి మొద టి సారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ 46.08 ఓట్లు రాబ ట్టి మెజార్టీ సీట్లు సాధించింది. జిల్లాలో పది అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసి ఏడు అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఎవరితో పొత్తు లేకుండా 38 జెడ్పీటీసీ స్థానాలు గెలిచి జెడ్పీ పీఠం కైవసం చేసుకుంది. కారు తుఫాన్‌లో కాం గ్రెస్, టీడీపీ, బీజేపీలు కొట్టుకుపోయాయి.

 కాంగ్రెస్ అధిష్టానం టిక్కెట్టు నిరాకరించడంతో ఒంట రిగా ఎదురు నిలిచి బీఎస్పీ అభ్యర్థులు ఇంద్రకరణ్‌రెడ్డి, కోనేరు కోనప్ప విజయం సాధించడంతో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పినట్టయింది. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసినప్పటికీ దేశం కంటే బీజేపీ నయమనిపిస్తోంది. బీజేపీ పోటీ చేసిన నాలుగు స్థానాల్లో ముథోల్, ఆదిలాబాద్ నియోజక వర్గాల్లో గులాబీ గాలిని ఎదుర్కొని రెండో స్థానంలో నిలిచింది. తెలుగుదేశం పోటీ చేసిన ఆరు స్థానాల్లో కేవలం ఖానాపూర్ అసెంబ్లీ స్థానంలో మాత్రమే రెండో స్థానంలో నిలిచింది. సిర్పూర్‌లో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. బెల్లంపల్లి, బోథ్, ఆసిఫాబాద్‌లో మూడో స్థానంలో అభ్యర్థులు నిలవడం విశేషం. సీపీఐ పోటీ చేసిన ఒకే ఒక్క బెల్లంపల్లిలో రెండో స్థానంతో పరువు కాపాడుకొంది.

టీఆర్‌ఎస్ : జిల్లాలో 19,59,660 ఓట్లకు 14,44,280 పోలయ్యాయి. వీటిలో టీఆర్‌ఎస్ పది మంది అభ్యర్థులకు 6,65,659 ఓట్లు పోలయ్యాయి. జిల్లాలో టీఆర్‌ఎస్ పోలైన ఓట్ల శాతం 46.08గా నమోదైంది. ఏ పార్టీ ప్రకటించని విధంగా అందరి కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించింది. ఒంటరిగా బరిలోకి దిగి పది అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసి ఏడు అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలను దక్కించుకొంది. అధినేత కేసీఆర్ ఒకేరోజు జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో బహిరంగ సభలను నిర్వహించి, ప్రచారం చివరి రోజున చెన్నూర్ నియోజక వర్గంలో ప్రచారం పూర్తిచేశారు. దీంతో అభ్యర్థుల విజయానికి ఎదురులేకుండా పోయింది. కేసీఆర్ చేసిన ప్రసంగాలతో, ఇచ్చిన హామీలతో కారు జోరు పెరిగింది.

 కాంగ్రెస్, సీపీఐ : జిల్లాలో కాంగ్రెస్, సీపీఐ కలిసి అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోటీ చేశాయి. సీపీఐ బెల్లంపల్లి అసెంబ్లీకి పోటీ చేయగా, మిగతా తొమ్మిది స్థానాలకు కాంగ్రెస్ తన అభ్యర్థులను నిలబెట్టింది. మొత్తం ఓట్లలో రెండు పార్టీలకు కలిపి 3,55,380 పోలయ్యాయి. జిల్లాలో 24.60 శాతం ఓట్లతో రెండు పార్టీలు తృప్తి పడాల్సి వచ్చింది. రెండు పార్టీల నుంచి కేవలం ముథోల్ నుంచి విఠల్‌రెడ్డి ఒక్కరే గెలుపొందడం విశేషం. జైరాం రమేష్, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తం కుమార్‌రెడ్డి, వి హన్మంతరావు వంటి అగ్ర నాయకులు వచ్చి ప్రచారం చేసినా అభ్యర్థులు గెలువలేదు. కనీసం ఓట్ల శాతం కూడా పెరగలేదు.

 టీడీపీ, బీజేపీ : జిల్లాలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిసి పది అసెంబ్లీ పోటీ చేశాయి. తెలుగుదేశం ఆరు, బీజేపీ నాలుగు స్థానాలకు తమ అభ్యర్థులను పోటీలో దింపాయి. రెండు పార్టీలకు కలిపి 2,32,634 ఓట్లు పోలయ్యాయి. జిల్లాలో 16.10 శాతం ఓట్లు పోలయ్యాయి. బీజేపీ నాలుగింటి లో ఆదిలాబాద్, ముథోల్‌ల్లో ద్వితీయ స్థానం సాధించి, మిగతా రెండు స్థానాల్లో తృతీయ స్థానంలో నిలిచింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఆరు స్థానాల్లో బరిలో నిలువగా, ఖానాపూర్‌లో ద్వితీయ స్థానం, బెల్లంపల్లి, బోథ్, ఆసిఫాబాద్‌ల్లో తృతీయ స్థానం, సిర్‌పూర్ కాగజ్‌నగర్‌లో నాలుగో స్థానంతో తృప్తి పడింది. జిల్లాలో రెండు పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం చంద్రబాబుతోపాటు కిషన్‌రెడ్డి, సినీ నటులు జీవిత, రాజశేఖర్ పర్యటించినా ఒక్క స్థానం దక్కక పోవడంతో ఆ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆవేదననలో పడిపోయారు.

 కొసమెరుపు
 కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు నిరాకరించడంతో ఆ పార్టీకే ఎదురు నిలిచి బీఎప్సీ తరుఫున నిర్మల్ నుంచి ఇంద్ర కరణ్‌రెడ్డి, సిర్‌పూర్‌కాగజ్‌నగర్ నుంచి కోనేరు కోనప్ప గెలుపొంది జిల్లా రికార్డులో నమోదు చేశారు. అంతే కాకుండా కాంగ్రెస్‌కు తమ సత్తా ఏంటో చూపించి, మిగతా నాయకుల కంటే తామో మిన్న అని నిరూపించారు. బీఎస్పీ అభ్యర్థులు జిల్లా మొత్తంలో 1,14,620 ఓట్లు సాధించి 7.93 శాతం నమోదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement